Heart Attack: ఈ చిన్న తప్పులే మగవారిలో గుండెపోటుకు కారణమని తెలుసా..?

గత కొన్నేళ్లుగా ప్రపంచంలో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. అందులోనూ పురుషులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. మగవారికి గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - January 20, 2022 / 01:43 PM IST

గత కొన్నేళ్లుగా ప్రపంచంలో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. అందులోనూ పురుషులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. మగవారికి గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి. అంటే చాలా కారణాలు చెబుతున్నాయి అధ్యయనాలు. మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు సమస్య ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీనికి కారణాలు చాలా ఉన్నప్పటికీ అజ్ఞానం, అపోహలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మగవారు చేసే ఆరోగ్యపరమైన తప్పులేంటో తెలుసుకుందాం.

ఆరోగ్యపరమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం….
వార్షిక చెకప్ కోసం వైద్యుల వద్దకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వెళ్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ వంటి సాధారణమైన పరీక్షలు చేయించుకునేందుకు మహిళలే ముందుకు వస్తున్నారు. గుండెపోటు లక్షణాలను విస్మరించడంలో పురుషులు ముందుంటున్నారు.

గుండెపోటు వచ్చే వయస్సు కాదనే అపోహ….
గుండెపోటు రావాలంటే వృద్ధులై ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కు గురైన సందర్భాలు ఎన్నో చూశాం. అయితే జన్యు పరంగా హార్ట్ ఎటాక్ వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది ముమ్మూటికి నిజం కాదు. జన్యు పరంగా కేవలం 30శాతం మాత్రమే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 70శాతం మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది.

వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. అధిక బరువుతో బాధపడేవారు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. అంతేకాదు అధిక రక్తపోటును నియంత్రించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వీయ మందులు వాడటం….
మహిళలు సొంతంగా మందులు వాడుతుంటారు. డిప్రెషన్, శరీర నొప్పులు, తలనొప్పి వంటి వాటికి వైద్యులకు దగ్గరకు వెళ్లకుండా సొంతంగా వైద్యం చేసుకుంటారు. హోం రెమెడిస్ తో తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పురుషులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. తమ శరీరంలో వచ్చే మార్పులు గమనించడంలో పూర్తిగా విఫలం అవుతుంటారు. కాబట్టి ప్రతి మూడు లేదా నాలుగు నెలలకోసారి వైద్యున్ని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకున్నట్లయితే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.