5 Signs Of Heart Failure: హార్ట్ ఫెయిల్యూర్ కు ముందు శరీరమిచ్చే 5 సంకేతాలు.. గుర్తిస్తే గుండె పదిలం!!

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 03:00 PM IST

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. ఇతర అవయవాలతో సహా శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది.
గుండె సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు దాని ఆరోగ్యం బలహీనపడుతుంది. ఈ పరిస్థితి శరీర అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. అవయవాల వైఫల్యం కారణంగా రక్త నాళాలు దెబ్బ తింటాయి. గుండె కండరాలకు రక్తాన్ని అందించడంలో విఫలమవుతాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది.మన దేశంలో చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్ కేసులు బాడీ పార్ట్స్ వైఫల్యం కారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత నిర్ధారణ అవుతాయి. ఇలా జరగకూడదు అంటే.. సమయానుసారం గుండె ఆరోగ్యం ఎలా ఉంది అని టెస్ట్ చేయించుకోవాలి.

హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా జరగదు. అది రావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. వాటిని ఎప్పటికప్పుడు గ్రహించడం వలన ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్ కావచ్చు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లుగా..

గుండె ఆరోగ్యం క్షీణించడం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోతుంది. దీని కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమయంలో అలర్ట్‌గా ఉండి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2. కాళ్ల వాపు..

గుండె ప్రభావవంతంగా రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు శరీరంలోని దిగువ భాగాలకు పంప్ చేసిన రక్తాన్ని తిరిగి తీసుకోవడంలో విఫలమవుతుంది. ఇది కాళ్లు, చీలమండలు, పొత్తికడుపు, తొడలలో పేరుకుపోయి వాపుకు కారణమవుతుంది.

3. శ్వాస ఆడకపోవడం..

ఊపిరితిత్తులలో రక్తం పేరుకుపోవడం వలన కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తాజాగా ఆక్సిజన్ ఉన్న రక్తంగా మార్చడం కష్టమవుతుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా ఏర్పడి శ్వాసలోపం తీవ్రమవుతుంది.

4.గుండె దడ..

గుండె దడ వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. లేదా కొన్ని కొన్ని సార్లు గుండె కొట్టుకోవడం మానేస్తుంది. చాలా సార్లు ఒత్తిడి, యాంగ్జైటీ, వ్యాయామం ఎక్కువ చేయడం, కెఫిన్‌ని ఎక్కువగా తీసుకోవడం అలానే ఆల్కహాల్‌ని ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి కారణాల వల్ల కూడా గుండె దడ వస్తుంది. “టాకీకార్డియా” అనే రిథం గుండెలో సంభవించినప్పుడు నిమిషానికి వంద సార్లు గుండె కొట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి స్థితిలో సులువుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ చేయడం కష్టం. ఇక “బ్రాడీకార్డియా” అనే మరో రిథం రెండో రకం. ఇది సంభవిస్తే గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువ కొట్టుకోవడం జరుగుతుంది. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండని సమయంలో.. ఇది సంభవిస్తే మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

5. అలసట..

గుండె ఆరోగ్యం క్షీణించినప్పుడు అసాధారణ రీతిలో అలసట ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి గుండె సమర్థవంతంగా ఆక్సీజన్ ఉన్న రక్తాన్ని పంప్ చేయలేకపోవవడమే దీనికి కారణం.శ్వాసలోపం, అలసట కారణంగా, గుండె వైఫల్యం ఉన్న వ్యక్తులు తరచుగా శారీరక శ్రమలు, రోజువారీ కార్యకలాపాలు చేయడంలో ఇబ్బంది పడతారు.