Kotappa Konda: మహా శివరాత్రి, కోటప్ప కొండ విశిష్టత..!

కోటప్పకొండ గుంటూరు (Guntur) జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి.

కోటప్పకొండ (Kotappa Konda) గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు.

స్థలపురాణం:

త్రికూట పర్వతాలలో మధ్యమ శిఖరంపై శ్రీ కోటేశ్వర లింగం ఉంది. కొత్త ఆలయం దక్షిణ భాగంలో గణనాధుని గుడి, పడమర ‘సాలంకేశ్వరాలయం’ ఉత్తరాన ‘సంతాన కోటేశ్వర లింగం’, ఎడమ భాగాన బిల్వ వృక్షం కింద ‘మార్కండేయ లింగం’, తూర్పు మండపంలో నందీశ్వరుడు, దీనికి తూర్పున ‘అడవి రామ లింగం’, వెనక లింగ మూర్తి తూర్పున దుర్గా , భైరవులు , గర్భాలయంలో ద్వారపాలురు ఉంటారు. సోపాన మార్గ ప్రారంభంలో కింద తలనీలాలను సమర్పించే ప్రదేశాన్ని ‘బొచ్చు కోటయ్య’ గుడి అంటారు.

కొండ కింద నీలకంఠేశ్వరస్వామి , దీనికి నైరుతిన వాసు దేవానంద సరస్వతి స్వాముల వారు కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఉన్నాయి. ఈ క్షేత్రంలో దైవ నిర్మితమైన దోనెలు ఎన్నో ఉన్నాయి. దిగువ దోనేలలో ఎద్దడుగు దోన , పుర్ర చేతి దోన , ఉబ్బు లింగయ్య దోన , పాలదోనలో భక్తులు స్నానాలు చేస్తారు. ఇక్కడే తపస్సు చేసుకోవటానికి ఎన్నో గుహలు అనుకూలంగా ఉన్నాయి.

త్రికూటానికి దక్షిణాన “ఒగేరు” లేక ‘ఓంకార నది’ ప్రవహిస్తోంది. చేజెర్లలో శిబిచక్రవర్తి లింగైక్యం చెందిన కోటేశ్వర లింగానికి సమస్త దేవతలు , సిద్ధ సాధ్యాదాదులు మహర్షులు ఓంకారంతో అభిషేకించిన జలం కపోతేశ్వర స్వామి గుడి వెనక నుండి బయల్దేరి కోటప్ప కొండ దగ్గర ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.

భక్తులు ముందుగా విష్ణు శిఖరంలోని పాప వినాశన తీర్ధంలో స్నానం చేసి లింగమూర్తిని పూజించి, గొల్ల భామను దర్శించి తర్వాత త్రికూటేశ్వర లింగ దర్శనం చేయటం విధానం. శ్రావణ మాసంలో రుద్ర శఖరాన్ని కార్తీక మాసంలో విష్ణు శిఖరాన్ని, మాఘంలో బ్రహ్మ శిఖరాన్ని దర్శించి మహాలింగార్చన చేసి ప్రాచీన, నూతన కోటేశ్వర స్వాముల దర్శనం చేసి తరించాలి. కోటప్పకొండ (Kotappa Konda) అపర కైలాసం అని అచంచల విశ్వాసం.

చరిత్ర ప్రసిద్ధి:

కోటప్ప కొండ దేవుడికి వెయ్యేళ్ళ పైబడి చరిత్ర ఉంది. ఇక్కడి దాన శాసనాలలో వెలనాటి గొంకరాజు , వెలనాడు చాళుక్య భీమరాజు , వెలనాటి కుళోత్తుంగ చోళుడు , వెలనాటి రాజేంద్రుడు పేర్లున్నాయి. కృష్ణ దేవరాయలు , మల్రాజు వెంకట నారాయణి , వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మొదలైన రాజులు జమీందార్లు స్వామికి విలువైన మాన్యాలు రాసి సమర్పించారు.

త్రికూటాచల మహాత్మ్యం:

ఎల్లమంద గ్రామానికి చెందిన ఎల్లముని మందలింగ బలిజ కులానికి చెందిన మహాభక్తుడు. అడివికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మి జీవించేవాడు. ఒక రోజు మధ్యమ లింగాన్ని పూజించి , మర్నాడు తమ్ములతో విష్ణు శిఖరాన్ని చేరగా కుండపోతగా గాలి , వర్షం కురిసింది. దగ్గరలోని గుహలో తలదాచుకొన్నారు. అక్కడ ఒక ధనం ఉన్న బిందె కనిపించింది. దాన్ని తీసుకొని సాలంకయ్య, రుద్ర శిఖరంలో ప్రత్యక్షమైన ఒక జంగమయ్యను రోజూ పూజించేవాడు. కొద్ది కాలం తర్వాత జంగమయ్య అదృశ్యమైనాడు. సాలంకయ్య వేదన చెంది వెతికి వేసారి నిరాహార దీక్ష చేస్తూ , బ్రహ్మ శిఖరం చేరి ఆక్కడున్న గొల్లభాముకు తన బాధను చెప్తామని వెతికితే ఆమెకూడా కనిపించలేదు. బ్రహ్మ శిఖరంలో ఒక గుహను చేరగానే ‘నేను నీవిందు ఆరగించాను , నీ వాడిని , పరమేశ్వరుడిని , గొల్లభాము మోక్షమిచ్చాను నేనిక్కడే ఉంటాను. ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు. త్రికూటేశ్వర లింగరూపంలో అర్చించు. మహా శివరాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి నన్ను అభిషేకించాలి. జాగరణ చేసి ప్రభలను కట్టి వీరంగం మొదలైన వాయిద్యాలతో మర్నాడు అన్నదానం చేయాలి. అప్పుడు నువ్వు శివైక్క్యం చెందుతావు’ అని చెప్పి జంగమ దేవర అదృశ్యమైనాడు.

సాలంకుడు యోగి ఆదేశం తో గుడి కట్టించి త్రికూటేశ్వర లింగాన్ని ప్రతిష్టించి, గొల్లభామకు(ఆనంద వల్లి ) వేరుగా గుడి కట్టించి భక్తితో పూజించాడు. పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించాడు. అప్పుడు దివ్యవాణి ‘ఇది బ్రహ్మచారి దక్షిణామూర్తి క్షేత్రం. ఇక్కడ కళ్యాణాలు నిషిద్ధం’ అని వినిపించింది. సాలంకుడు ప్రతిష్ట కోసం తయారు చేయించిన పార్వతీ విగ్రహం మాయమైంది. విరక్తి చెందిన సాలముడు దేహ త్యాగం చేయ నిశ్చయించి యోగబలంతో లింగైక్యం చెందాడు. అతని తమ్ములు కూడా లింగైక్యం చెందారు. వీరు బ్రహ్మ , విష్ణు , మహేశ్వర లింగాలుగా , సాలంకయ్య ‘సాలంకేశ్వరుడు’గా ఆయన ప్రతిష్టించిన లింగం ‘కోటేశ్వర లింగం’ గా బ్రహ్మ శిఖరాన వెలిసి ఈ క్షేత్రం ‘పంచ బ్రహ్మ స్థానక్షేత్రం’గా పేరుపొందింది.

ఆనంద వల్లి (గొల్లభామ):

శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే త్రికూటాచల దక్షిణాన ‘కొండ కావూరు’ గ్రామంలో యాదవ వంశంలో సుందరి సునందలకు గారాలబిడ్డగా ‘ఆనంద వల్లి’ అనే పాప జన్మించింది.

చిన్న నాటి నుంచే శివభక్తిలో లీనమయ్యేది. రుద్రాక్షమాలలు ధరించేది. ఆధ్యాత్మిక భావాలను బోధించేది. పెరిగే కొద్దీ శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఒక శివరాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్ర శిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి, బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా , సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది.

ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై ఆనందవల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం ఆమె భక్తీ కి సంతసించి జంగమయ్య శివైక్యాన్ని ప్రసాదించాడు.

పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ (Kotappa Konda):

  1. ఈ క్షేత్రంలో శివుడు బాలుడిగా అవతరించాడు.
  2. ఈ క్షేత్రంలో శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశాడు.
  3. ఈ క్షేత్రంలో శివుడు విష్ణువు పాపాలను కడిగి వేశాడు.
  4. ఈ క్షేత్రంలో శివుడు తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు.
  5. కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు జీవితంలోని కష్టాలను దాటడానికీ భక్తులు కోటప్పను తలుచుకుంటారు!
  6. ‘చేదుకో మమ్మల్ని ఏలుకో ’ అని శరణుజొచ్చే ప్రతి ఒక్కరినీ చల్లగా చూసే శివుడు ఎల్లరకూ అభయమిచ్చే దేవుడు ఈ కోటప్ప !!

విశిష్ట సేవా విధానం:

శ్రీ త్రికూటేశ్వరాలయంలో ఎప్పుడూ అఖండ దీపారాధన , అభిషేకాలు పూజలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవానికి ఇక్కడికి కుల మత భాషా ప్రాంత భేదాలు లేకుండా అశేష జనం వస్తారు. మహా ఎత్తైన ప్రభలు కట్టుకొని రావటం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఏదైనా ఎత్తుగా ఉంటె ‘కోటప్పకొండ ప్రభ’ అనటం అలవాటైంది. మాఘమాసంలో పశువులతో ప్రదక్షిణ చేసి స్వామిని సేవిస్తారు. తడి బట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాన పెట్టుకొని గరి నెక్కి ప్రదక్షిణ చేస్తారు. సంతాన హీనులు , భూతప్రేత పిశాచాదుల బారిన పడినవారు నేత్రదృష్టి కోల్పోయిన వారు కోటేశ్వరస్వామి ప్రదక్షిణ చేసి దర్శించి మనోభీస్టాన్ని నేరవేర్చుకొంటారు.

కోటి ప్రభల కోటేశ్వరుడు:

కొండ కింద ప్రసన్నకోటేశ్వరుడు , నీలకంఠేశ్వరుడు మొదలైన ఆలయాలున్నాయి. అన్నదాన సత్రాలున్నాయి. శివరాత్రికి అన్నికులాల వారికి అన్నదానం జరుగుతుంది. శివరాత్రి తిరునాళ్ళు పరమ వైభవంగా నిర్వహింపబడుతాయి. నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ‘శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో కోటిన్నోక్క ప్రభలతో నా కొండకు వచ్చే భక్తుల కోసం నేను కొండ దిగి వచ్చి దర్శనం అనుగ్రహిస్తాను’ అని కోటేశ్వరుడు అభయమిచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు. శివుడికి ఇష్టమైన వెదురు గడలతో ప్రభలను నిర్మించి , అనేక చిత్ర విచిత్ర పటాలను అలంకరించి విద్యుద్దీపాలతో వెలుగులు వెలయింపజేస్తూ కోటప్పకొండ (Kotappa Konda) తిరునాళ్ళకు వస్తారు. కాని ఇన్నేళ్ళుగా ప్రభలు కట్టినా కోటిన్నొక ప్రభ సంఖ్య కాలేదట.

ఎప్పటికప్పుడు ఒక ప్రభ తగ్గుతోందట. ఆలెక్క పూర్తీ అయితే ప్రళయం వచ్చి స్వామి కిందకి దిగివస్తాడని నమ్ముతున్నారు. ‘చేదుకో కోటేశ్వరా, చేదుకొని మమ్మాదరించవయ్యా’ అని భక్తీతో ఆర్తితో వేడుకొంటూ హరహర మహాదేవ స్మరణతో దిక్కులు పిక్కటిల్లిపోతాయి. ఎడ్ల పందాలు, చిత్రమైన ఆటలు కోలాటాలు , నృత్య గీతాలతో , రంగుల రాట్నాలతో ప్రాంగణం అంతా శోభాయమానంగా కనిపిస్తుంది. పశువులతో గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకొనే అశేష జనసమూహం ఉత్సాహాన్నిస్తుంది. శివరాత్రి వేడుకలతో బాటు కార్తీక , మార్గశిర మాఘ మాసాలలో భక్తులు సామూహిక బిల్వార్చన , రుద్రాభిషేం , రుద్రయాగం జరగటం ఇక్కడి విశేషం.

లింగ ప్రాధాన్యం:

సంతానం అపేక్షించేవారు శుచిగా తడి బట్టలతో ‘సంతాన కోటేశ్వరలింగం’కు ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారు. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి వరకు తడి బట్టలతోనే శివ పంచాక్షరి జపిస్తూ గడగడలాడే చలిలో కూడా ఆలయం చుట్టూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేయటం వారి మహాభక్తికి , విశ్వాసానికి , నమ్మకానికి నిదర్శనం. కొత్త కోటేశ్వరాలయం పైన ఉన్న సెలయేరు దగ్గరున్న మార్కండేయ మహాముని చేత ప్రతిష్టింపబడిన మార్కండేయ శివలింగం ఉంది.

కైలాసం నుండి సతీవియోగ వికల మనస్కుడై ఇక్కడికి వచ్చి దక్షిణామూర్తి గా వెలసిన శివుని వెతుక్కొంటూ ఆయన వాహనమైన బసవన్న ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేశాడు. ఆయన అమోఘ తపస్సుకు భంగం కాకుండా పరమేశ్వరుడు ఇక్కడ తాగు నీటికోసం ఒక వాగును ప్రవహింప జేశాడు. అదే ‘ఎద్దడుగు వాగు’ అని పిలువబడుతోంది.

త్రికోటేశుని సన్నిధిలోని ‘బసవ మందిరం’ భక్తులు శివరాత్రి మొదలైన పర్వ దినాలలో పూజలు , వ్రతాలు ఆచరిస్తారు. ఇక్కడి అసలు దైవం బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి కనుక ధ్వజస్తంభ ప్రతిష్ట జరగలేదు. కళ్యాణ వైభోగం లేదు అందుకే స్వామిని ‘బాల కోటేశ్వరుడు’ అని ‘సంతాన కోటేశ్వరుడు’ అని అంటారు. అడవి రామలింగేశ్వరుడు , కూకట్లశంభుడు , శంభు లింగమ్మ , నాగమ్మ , వెంకటేశ్వరుడు అనే భక్తులు స్వామిని సేవించి పునీతులైనారు. 200 ఏళ్ళ నుండి ప్రభలతో మొక్కులు సమర్పించటం ఉన్నదని తెలుస్తోంది. పొట్లూరి గ్రామం నంది వాహనంపై శివుని అలమరించి శివరాత్రి జాగరణ నాడు ప్రభలతో ఆ గ్రామ ప్రజలు అన్ని మెట్లు యెక్కిస్వామిని దర్శించటం ఇప్పటికీ ఆనవాయితిగా వస్తోంది.

ఇక్కడి ప్రభలు ‘ఈశ్వరుని క్రాంతి ప్రభలకు’ నిదర్శనం. ఆహ్లాదానికి, ఔన్నత్యానికి సమైక్యతకూ ప్రతీక. 40 అడుగుల నుండి 100 అడుగుల ఎత్తు వరకు ప్రభలు వాటిపై విద్యుత్ కాంతులతో నిర్మించటం విశేషాలలో విశేషం. ‘అమావాస్యనాడు పున్నమి’ సందర్శనాన్ని తలపింపజేస్తుంది.

వసతి సౌకర్యాలు:

కొండపై తిరుమల దేవస్థానమువారి సత్రము , గవర్నమెంటువారి రెస్ట్ హౌస్ లు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు , బసవ మందిరము సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కుల ప్రాతిపదికగా పలు సత్రములు నిర్మాణ కార్యక్రమములలోనూ , అతి తక్కువగా పూర్తి అయినవీ ఉన్నాయి. కొండ వద్ద వసతిగృహాలు ఉన్నాయి. ఆనందవల్లి అతిథిగృహంలో గదికి రూ.250 చెల్లించాలి. తోట వారి అతిథిగృహంలో అయితే రూ. 300 , నంది అతిథిగృహంలో రూ. 750 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంది.

దర్శన సమయాలు:

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు , మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. స్వామివారికి అర్చన, ఉచిత దర్శనం సమయంలో తీసుకుంటే రూ. 5 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేక దర్శనం రూ. 75 , అష్టోత్రం రూ. 100 , అభిషేకం దంపతులకు మాత్రమే రూ. 200 , పంచ హారతి ఒక్కొక్కరికి రూ. 100 , పిల్లలకు అన్నప్రాసన చేయిస్తే రూ. 150 , అక్షరాభ్యాసం చేయిస్తే రూ. 150 వీటితో పాటు వాహన పూజలు చేయించుకోవచ్చు. నవగ్రహ పూజ , శనిత్రయోదశి సందర్భాల్లో రూ. 200 చెల్లించి పూజలు చేయించుకోవాలి. శాంతి యాదశాల పూజకు రూ. 1116లు , మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (ఒకే కుటుంబానికి) రూ.1116లు చెల్లించాల్సి ఉంటుంది. మూలవిరాట్‌ అభిషేకం పర్వదినాల్లో అయితే రూ. 400 చెల్లించాలి. ఇవి కాకుండా ప్రత్యేక స్కీములు ద్వారా కూడా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. జీవితకాల అభిషేకం (పదేళ్లు) రూ. 2116లు, జీవిత కాల అష్టోత్రం (10 ఏళ్లు) రూ. 1116లు, నిత్య గోత్రనామ పథకం ఏడాదికి రూ. 1116లు చెల్లించాలి. కొండ వద్ద వసతిగృహాలు ఉన్నాయి. ఆనందవల్లి అతిథిగృహంలో గదికి రూ. 250 చెల్లించాలి. తోట వారి అతిథిగృహంలో అయితే రూ. 300 , నంది అతిథిగృహంలో రూ. 750 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంది.

రవాణా సౌకర్యాలు:

కోటప్పకొండకు (Kotappa Konda) దగ్గరలో కల నరసరావుపేట పాత బస్ స్టాండు , కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు ఉంది. విజయవాడ , గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా , నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు.

సత్తెనపల్లి , పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్పకొండకు చేరవచ్చు. మాచర్ల , గురజాల , కారంపూడి యాత్రికులు కూడా నరసరావుపేట మీదుగా కోటప్పకొండకు వెళ్లే మార్గం ఉంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం , దర్శి , కురిచేడు , త్రిపురాంతంకం , యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు.

ఇవేకాక ప్రైవెటు వాహనములు కూడా ఈ దారిని ప్రయాణిస్తుంటాయి. కొండ పైకి వెళ్ళుటకు బస్సులు , జీపులు , ఆటోలు దొరకుతాయి. అలాగే డాక్టర్ కోడెల శివప్రసాద్ మంత్రిగా వున్న సమయంలో కోటప్పకొండ (Kotappa Konda) మీదకు బస్సు మార్గాన్ని ఏర్పరచి అనేక సౌకర్యాలు కల్పించారు. భక్తులు ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం కోటప్పకొండ.

Also Read:  Shivaratri: శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?