Konaseema Farmers:కోన‌సీమ `పంట విరామం` దేశానికే డేంజ‌ర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతువ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయం నిజంగానే లాభదాయకం కాదని ఏటేటా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలే చెబుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 06:00 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతువ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయం నిజంగానే లాభదాయకం కాదని ఏటేటా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలే చెబుతున్నాయి. స్వామినాధన్ రిపోర్ట్ ప్రకారం పంటకు అయ్యే మొత్తం ఖర్చు లెక్కించి , ఆ ఖర్చు మొత్తంలో సగం కలిపి రైతుకు లాభం కింద ఇవ్వాలి. అలా అయితే క్వింటాలుకు అయ్యే ఖర్చు 2400/- అని ప్రభుత్వం లెక్కించింది. దానికి సగం అంటే 1200/- కలిపితే 3600/- అవుతుంది. దాన్ని మనం 75 kg ల బస్తాకు లెక్కిస్తే 2700/- అవుతుంది. మరి నేడు బస్తా ధర అంత ఉందా ? కనీసం 1700/- కూడా లేదు. ధర తక్కువకు అమ్ముకుని వడ్డీలు కట్టలేక రైతు అప్పుల పాలై, అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇవి చాల దన్నట్లు అకాల వర్షాలు, తుఫానుల వల్ల పంట నాశనం అయితే ఇన్సూరెన్స్ సరిగ్గా అందడం లేదు. తెగుళ్లు , చీడ – పీడ వచ్చి పంట నష్టం జరుగుతోంది . యాతా వాతా దిగుబడికి , ఖర్చుకూ వ్యత్యాసం వచ్చి గిట్టుబాటు కాక కాడి పారేసి క్రాప్ హాలిడే పాటించడానికి రైతు మొగ్గు చూపుతున్నాడు.

అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం లోకి వచ్చాక మరో మాట. ప్రతిసారీ ప్రతి పార్టీ చేతిలో రైతు మోసపోతూనే ఉన్నాడు. పండించే వారి కన్నా తినే వారు ఎక్కువైనారు. ఉచిత ఆహారం పేర ప్రభుత్వం చేసే సాయం కోసం ధరలను పెరగనీయ కుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. ధర పెంచితే ఆహార భద్రతకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలి. ఆ భారం మోయడానికి ప్రభుత్వాలు సిద్ధంగాలేక రైతునోట మట్టి కొడుతున్నాయి ఈ ప్రభుత్వాలు. పన్నుల రూపేణా అంటే పురుగు మందులు, ఎరువులు, రవాణా ఇలా ఎకరాకు 10 వేల ఆదాయం ప్రభుత్వానికి చేరుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అదే ఇప్పుడు పంట సాయం కింద కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలలో స్థానిక ప్రభుత్వాలు కొంత అదనంగా కల్పి ఇస్తున్నవి. అది ప్రతి ఎకరానికి ఇస్తే కొంత మేర రైతుకి ఉపశమనం కలుగుతుంది. అలా దేశంలో ప్రతి ఎకరాకు సాయం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణా అని తెలుస్తోంది.

ఇక వాణిజ్య పంటలు చూస్తే ఏ 4 , 5 సం. లకో ఒక సారి ధర గిట్టుబాటు అవుతోంది. చీడ పీడలతో పంట నాశనమై , ఒక వేళ సమృద్ధిగా పండినా ధర లేక అప్పులపాలై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ఇలా ఉంటే పండ్ల – పూల తోటలు , కూరగాయలు, చేపలు, కోళ్ల పరిశ్రమ కూడా ఆశాజనకంగా లేవు. అనేక సార్లు టమాటా , మిర్చ్ పంటలకు గిట్టుబాటు లేక రోడ్ల మీద పారబోసిన సంఘటనలు అనేకం మనం చూస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ధాన్యం, వాణిజ్య పంటల మాదిరిగా పళ్లు, కూరగాయలు నిల్వ ఉంచడానికి కుదరదు. కోత తరువాత 3,4 రోజుల్లో ఖర్చు అయ్యిపోవాలి. అది అవకాశంగా తీసుకుని దళారులు ధరలు తగ్గించి కొంటున్నారు. రైతు ఏమీ అనలేని పరిస్థితి, వేరే ప్రాంతానికి తీసుకువెళ్లే సౌకర్యం రైతుకు లేదు. కోల్డ్ స్టోరేజీలు లేవు. చచ్చినట్లు అమ్ముకోవల్సిందే. అందుకే కూరగాయ పంటలు పండించి గిట్టుబాటు లేక , కోత కూలీ కూడా దండగగా భావించి పంటను పశువులకు మేపుతున్నారు, లేకపోతే పంటను దున్ని వేస్తున్నారు. కొన్ని పంటలు విత్తనాల మోసం వల్ల విపరీతంగా పెరిగి ఫల సాయం ఇవ్వక దున్ని వేస్తున్నారు, మరికొందరు చీడ- పీడలు పట్టి దిగుబడి రాక దున్ని వేస్తున్నారు. కానీ వినియోగ దారుడు మాత్రం ఎవేమీ పట్టవు.

ఏదో ఒకసారి పంట తక్కువ పండి టమాటా కో , ఉల్లి పాయకో ధర పదో, ఇరవయ్యో పెరగ్గానే రోడ్డు ఎక్కి గోల చేసేస్తారు. సరే ఏ కూలివాడో, కార్మికుడో, గోల చేసాడంటే ఒక అర్ధం ఉంది. 50 వేలు, లక్ష తీసుకునే ఉద్యోగస్తులు కూడా మైకు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని తిడతారు. ఉద్యోగులకు ధరలు సూచికగా కరువు భత్యం ఇవ్వాలి, ఏటేటా జీతాలు పెంచాలి, అన్ని అలవెన్సులు ఇవ్వాలి, కానీ బియ్యం, పప్పు- ఉప్పు- కూరల ధరలు పెరగ కూడదు. పెట్రోల్ 150/- అయినా కొంటాడు, టి వి లక్ష అయినా కొంటాడు . కేక్ లు, బిర్యానీలు, డ్రింకులు, మద్యం, చిరుదిళ్లు, విందులు, వినోదాలకు ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ రైతు పండించే ఆహారం దగ్గర మాత్రం నానా యాగీ చేస్తారు. అదీ మన రైతు దౌర్భాగ్యం . ప్రభుత్వాల దగ్గర 2,3 సం.లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని అహం పోయి రైతులను చిన్న చూపు చూస్తుంటే, ఒక్క సం. రం రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ప్రభుత్వాలకు గింగిరాలు తిరిగి బైర్లు కమ్మి భూమి మీదకు వస్తాయి . భారత్ లో పంట విరామం ప్రకటిస్తే భారత్ లోనే కాదు, ప్రపంచమే ఆహార సంక్షోభం ఎదుర్కొంటుంది. భారత్ లో 135 కోట్ల మందికి, ప్రపంచ దేశాలకు ఆహారం అందించడం అంటే ఆషా, మాషీ విషయంగా ప్రభుత్వాలు చూస్తున్నవి. ఉద్యోగులకు, కార్మికులకు యూనియన్లు ఉన్నాయి, క్షణంలో రోడ్డు ఎక్కుతారు, కానీ రైతు అలా చేయలేని బలహీనతను కాష్ చేసుకుంటున్నవి ప్రభుత్వాలు, ప్రసార మాద్యమాలు కూడా . ఉల్లి, టమాటా ధర కొద్దిగా పెరగగానే బారు బారు బూరలు వేసుకుని రోడ్డు మీద నిలబడతారు టి వి వాళ్లు. అదే పంట చేలోకి వెళ్లి రైతు పడే కష్టాన్ని ఏ చానలూ చూపించదు.

తెల్లవారక ముందే ఇంటి ముందుకు పాలు రావాలి. అది ఎలా ఉత్పత్తి అవుతుందో వారికి, ప్రజలకు అనవసరం. డబ్బు ఇస్తున్నాం మాకు కావాలి అంతే. పండించే రైతుకన్నా దాళారీలు, మారు బేరం చేసు కుని అమ్ముకునే వ్యాపారులు లాభపడుతున్నారు. రోడ్డు పక్క అమ్మే చిన్న చిన్న పండ్ల , పూల , కొబ్బరి బొండం, ఇంటింటికి తిరిగే ఆకుకూరల వ్యాపారి కూడా నష్ఠ పోయింది లేదు. ఎందుకంటే పొద్దున కొన్న సరుకు సాయంత్రానికి అమ్ముడై చేతికి డబ్బు వచ్చేస్తుంది. తనకెంత అమ్ము డవుతుందో అంతే కొని మారు బేరం చేస్తాడు. చిన్న వ్యాపారి వేలల్లో, పెద్ద వారు లక్షల్లో సంపాదిస్తున్నారు. రైతు మాత్రం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాడు

అలాగే గుడ్లు, మాంసం , చేపలు ఉత్పత్తి దారుల పరిస్థితి అలాగే ఉంది. రైతుకన్నా చికెన్ కొట్టు వాడు, మటన్ కొట్టు వాడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఏ రోజు ధర ఆ రోజే సాయంత్రానికి కాష్ చేసుకుని ఇంటికి పోతాడు. అలా రైతు ఇంటికి వచ్చి హాయిగా పడుకోలేదు. ఎప్పుడూ ఆకాశం వంక చూసి ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని దిన దిన గండంగా గడుపుతాడు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల వారు రైతు ఉద్యమాలు చేస్తే దక్షిణాది మన రైతులు మనకెందుకులే అని మౌనం వహించారు. ఇప్పటికి గానీ మన వాళ్లకు సెగ తగిలి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఈ పంట విరామమనేది అక్కడక్కడా ఒక్కో గ్రామం చేస్తే కుదరదు. మండలాలు, జిల్లాల స్థాయిలో భారీస్థాయిలో చెయ్యాలి. అప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇది విజయ వంతం కాకపోతే దాన్ని ఇంకా అలుసుగా తీసుకుని ప్రభుత్వాలు, వ్యాపారులు, దళారులు రైతులను పీక పిసిగి, కష్ఠాల పాలు చేసి రోడ్డు మీద దోషులుగా నిలబెడతారు. రైత‌న్నా పంట విరామం నీ ద‌గ్గ‌రున్న చివ‌రి అస్త్రం. దాన్ని రామ‌బాణంలా ఉప‌యోగించాలి.