Real Estate : సీఎంల ‘భూ’ క‌లాపం

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం న‌మ్ముకుంది. ప్ర‌భుత్వం ఖ‌జానా నింపుకోవ‌డానికి దీన్నో అవ‌కాశంగా భావిస్తోంది. అందుకే, ప‌ట్ట‌ణాల‌కు, గ్రామాల‌కు కూడా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్త‌రింప చేయాల‌ని ఆలోచిస్తోంది. తెలంగాణ జిల్లాల‌ను 10 నుంచి 33కు చేసిన త‌రువాత భూముల ధ‌ర‌ల‌ను ఆకాశానికి తీసుకెళ్లారు.

  • Written By:
  • Updated On - January 14, 2022 / 08:16 PM IST

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం న‌మ్ముకుంది. ప్ర‌భుత్వం ఖ‌జానా నింపుకోవ‌డానికి దీన్నో అవ‌కాశంగా భావిస్తోంది. అందుకే, ప‌ట్ట‌ణాల‌కు, గ్రామాల‌కు కూడా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్త‌రింప చేయాల‌ని ఆలోచిస్తోంది. తెలంగాణ జిల్లాల‌ను 10 నుంచి 33కు చేసిన త‌రువాత భూముల ధ‌ర‌ల‌ను ఆకాశానికి తీసుకెళ్లారు. హైద్రాబాద్ ప‌రిధిలో రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని న్యూస్ వ‌చ్చిన‌ వెంట‌నే తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అవుతోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని హెచ్ ఎండీఏ భూముల‌ను వేలానికి పెండుతోంది. విచిత్రంగా ధ‌ర‌ల‌ను ఆకాశానికి తీసుకెళ‌తారు. అవే ధ‌ర‌ల‌ను కొన‌సాగిస్తూ హైప్ ను ప‌దిలంగా ఉంచుతుంద‌ని రియ‌ల్ వ్యాపారుల అభిప్రాయం.హైద్రాబాద్ చుట్టుప‌క్క‌ల శాటిలైట్ టౌన్ షిప్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ మేర‌కు భూముల‌ను సేక‌రిస్తోంది. మ‌రో ఔట‌ర్ రింగ్ రోడ్డుకు బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది. కేంద్రం నుంచి దాని అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంది. హైద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో సామాన్యుడికి అంద‌నంత ఎత్తుకు రియ‌ల్ ధ‌ర‌ల‌ను స‌ర్కార్ తీసుకెళ్లింది. కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లా కేంద్రాల్లో రియ‌ల్ ధ‌ర‌లు అనూహ్యంగా పెరిగేలా చేసింది. ప‌ట్ట‌ణాల‌కు సాఫ్ట్ వేర్ రంగాన్ని తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. రాబోవు రోజుల్లో టూ టైర్ ప‌ట్ట‌ణాల్లో ఐటీ అభివృద్ధి చేసేలా కంపెనీల‌కు అనువైన జీవోల‌ను తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు ఆయా జిల్లాల్లోని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసేలా ప్లాన్ చేసింది.

హైద‌రాబాద్ న‌గ‌రం ప‌రిధిలోని హెచ్ఎండీఏ త‌ర‌హాలోనే తెలంగాణ‌లోని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో అర్బ‌న్ డ‌వ‌లెప్మెంట్ అథారిటీల‌ను ఏర్పాటు చేయాలని సూచించింది .ఆయా ప్రాంతాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగం లే వౌట్ల‌ను వేయ‌డం ద్వారా ప్లాట్ల‌ను విక్ర‌యించాల‌ని ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం లాంటి చోట్ల ఇలాంటి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ స‌ర్కార్ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. రాబోవు రోజుల్లో న‌గ‌ర పంచాయ‌తీల‌కు కూడా ఈ వ్యాపారాన్ని విస్త‌రింప చేయాల‌ని భావిస్తోంది. ప్రైవేటు వ్యాపారుల కంటే ప్ర‌భుత్వమే లే ఔట్లు వేయ‌డం ద్వారా సామాన్యుల‌కు మేలు చేకూరుతుంద‌ని స‌ర్కార్ అంచ‌నా వేస్తోంది. స్వామి కార్యం..స్వ‌కార్యం త‌ర‌హాలో వ్యాపారంతో ఉపాధి ల‌భిస్తుంద‌ని చెబుతోంది. మ‌రో వైపు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ప్ర‌భుత్వానికి నిధులు స‌మ‌కూరుతాయ‌ని అంచ‌నా వేస్తోంది. ఏపీలోనూ జ‌గ‌న‌న్న టౌన్ షిప్ ల‌ను వేయాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం దూకుడుగా వెళుతోంది. తొలుత ఐదు జిల్లాల్లో లే ఔట్లు వేయ‌డం ద్వారా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుడుతోంది. ఆ త‌రువాత మిగిలిన జిల్లాల‌కు వ్యాపారాన్ని విస్త‌రించ‌డం ద్వారా ప్ర‌భుత్వ రాబ‌డిని పెంచుకోవాల‌ని జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నాడు. తెలంగాణ‌లో మాదిరిగా ఏపీలోనూ రియ‌ల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయేలా చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తోంది. కేసీఆర్ త‌ర‌హాలో జ‌గ‌న్ కూడా విజ‌యం సాధిస్తాడా? లేక అమ‌రావ‌తి ప్రాజెక్టులో మాదిరిగా ఫెయిల్ అవుతాడా? చూడాలి.