Polavaram Issue : జ‌గ‌న్ ఎత్తుకు చంద్ర‌బాబు పైఎత్తు!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేస్తోన్న ప్లాన్ కు `టిట్ ఫ‌ర్ టాట్‌`లాగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు వ్యూహాన్ని మార్చారు.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 02:00 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేస్తోన్న ప్లాన్ కు `టిట్ ఫ‌ర్ టాట్‌`లాగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు వ్యూహాన్ని మార్చారు. తెలుగుదేశం పార్టీ రాజ‌కీయ వ్యూహ క‌మిటీ వినూత్న పంథాను ఎంచుకుంది. ఇక నుంచి సంక్షేమ ప‌థ‌కాల కంటే జ‌గ‌న్ స‌ర్కార్లోని అవినీతి గురించి ఫోక‌స్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఏపీకి త‌ల‌మానికంగా క‌నిపిస్తోన్న పోల‌వ‌రం నిర్మాణం, మ‌ద్య నిషేధం, మూడు రాజ‌ధానుల‌ గురించి ఫోక‌స్ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఒంగోలు మ‌హానాడు విజ‌య‌వంతం త‌రువాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ కోలుకోని విధంగా ప‌డిపోయింద‌ని తాజాగా బ‌య‌ట‌కొచ్చిన స‌ర్వేల ఆధారంగా టీడీపీ విశ్వ‌సిస్తోంది.

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీకరించిన త‌రువాత ఏడాది తిర‌గ‌కుండానే టీడీపీ ఉద్య‌మాల‌కు తెర‌లేపింది. ఇసుక సిండికేట్‌, మ‌ద్యం సిండికేట్ ల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లింది. ఆ త‌రువాత క‌రోనా స‌మ‌యంలో జూమ్ యాప్ ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను త‌ర‌చూ వెలుగొత్తి చాటింది. ఇళ్ల ప‌ట్టాల రూపంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దందాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఉద్యోగుల `చ‌లో విజ‌యవాడ‌`తో విజ‌య‌వంతం కావ‌డంతో ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా టీడీపీ వేగంగా అడుగులు వేసింది. అభివృద్ధి జ‌ర‌గ‌డంలేద‌ని రోడ్ల‌ను చూపిస్తూ ఇటీవ‌ల పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఉన్న డ‌బ్బును పంచుతూ ఏపీ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నార‌ని బ‌లంగా స్లోగ‌న్ తీసుకెళ్లారు. ప్ర‌తిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు వ్య‌తిరేక‌మంటూ బ‌లంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ప్ర‌జా ద‌ర్బార్‌ను నిర్వ‌హించ‌డంతో పాటు బ‌స్సు యాత్ర‌ను నిర్వ‌హించ‌డం ద్వారా సంక్షేమ ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధం అయ్యారు. మేనిఫెస్టోలో పెట్టిన న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేయ‌కుండా దుష్ట‌చ‌తుష్ట‌యం అడ్డుప‌డుతుంద‌ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి జ‌గ‌న్ స్కెచ్ వేశారు. ఫ‌లితంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ఓటు బ్యాంకును కాపాడుకోవాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ విష‌యాన్ని గ్ర‌హించిన చంద్ర‌బాబు అత్య‌వ‌స‌రంగా పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ క‌మిటీ మీటింగ్ ను ఏర్పాటు చేసి పోల‌వ‌రం నిర్మాణం అంశాన్ని హైలెట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఉత్త‌రాంధ్ర‌, కృష్ణా , గుంటూరు, ప్ర‌కాశం జిల్లా ప్ర‌జలతో నేరుగా ముడిప‌డిన అంశంగా పోల‌వ‌రం నిర్మాణం ఉంది. ప‌రోక్షంగా రాయ‌ల‌సీమ జిల్లాతోనూ ముడిప‌డింది. అందుకే, పోల‌వ‌రం నిర్మాణంలోని నిర్ల‌క్ష్యాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌ని ప్లాన్ చేశారు.

జ‌గ‌న్ మేనిఫెస్టోలో పెట్టిన మ‌ద్య నిషేధం అంశాన్ని హైలెట్ చేయాల‌ని చంద్ర‌బాబు స్కెచ్ వేశారు. మూడు రాజ‌ధానులు, పోల‌వ‌రం, మ‌ద్య నిషేధం అంశాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ క‌మిటీ నిర్ణ‌యించింది. వీలున్నంత వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాల గురించి మాట్లాడ‌కుండా ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి భాగోతాలు, పోల‌వ‌రం, మ‌ద్యం నిషేధం, మూడు రాజ‌ధానులు గురించి చ‌ర్చ‌కు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ తాజాగా వేసిన ఎత్తుగ‌డ‌కు చంద్ర‌బాబు పైఎత్తుగా ప‌నిచేస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది. మొత్తం మీద జ‌గ‌న్ కు నిద్ర‌లేకుండా చేసేలా రాబోవు రోజుల్లో విధాన‌ప‌ర‌మైన వైఫ‌ల్యాలను ఎండ‌గ‌ట్టాల‌ని స్కెచ్ చేసిన చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర‌కు కూడా శ్రీకారం చుట్ట‌బోతున్నారని తెలిసింది.