Janasena Party: చుక్కానిలేని నావ‌`లా జ‌న‌సేన‌

ఒక్క‌సారే అదృష్టం త‌లుపు త‌డుతుంద‌ని పెద్ద‌లు అంటారు. దాని జారివిడుచుకుంటే జీవిత‌కాలపు త‌ప్పు జ‌రిగిన‌ట్టే భావిస్తారు.

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 12:39 PM IST

ఒక్క‌సారే అదృష్టం త‌లుపు త‌డుతుంద‌ని పెద్ద‌లు అంటారు. దాని జారివిడుచుకుంటే జీవిత‌కాలపు త‌ప్పు జ‌రిగిన‌ట్టే భావిస్తారు. స‌రిగ్గా ఈ నానుడిని చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయానికి అన్వ‌యిస్తే స‌రిపోతుంది. కింగ్ మేక‌ర్ గా ఉండాల్సిన ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ‌కీయాల్లో చిరంజీవి న‌వ్వుల‌పాల‌య్యారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల ముందు ప్ర‌జారాజ్యం 2.0గా వ‌చ్చిన జ‌న‌సేన ఇంచుమించు అలాంటి త‌ప్పుల‌ను చేస్తోంది. ప‌ల్ల‌కీమోసే బోయిగా మాత్ర‌మే జ‌న‌సేనాని ఉండిపోయార‌ని ఆ పార్టీని వీడిన వాళ్లు చెబుతారు.

వాస్త‌వంగా 2014 ఎన్నిక‌లకు ముందుగా పార్టీ పెట్టిన ఆయ‌న బీజేపీ, టీడీపీ కూట‌మికి మాట వ‌రుస‌గా మ‌ద్ధ‌తు ప‌లికారు. కూట‌మి అధికారంలోకి రావ‌డానికి త‌న చ‌ల‌వేనంటూ 2014 నుంచి 2017 వ‌ర‌కు ఊహించ‌నంత రాజ‌కీయ బ‌లాన్ని కూడ‌దీసుకున్నారు. రాజ్యాధికారం అందుకునే ప‌రిస్థితులు వ‌చ్చేశాయ‌ని భావించిన ప‌వ‌న్ క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ తో కూట‌మి క‌ట్టారు. కాన్షీరాం, చేగువీరా భావ‌జాలాన్ని బ‌లంగా వినిపించారు. ప్ర‌త్యేక హోదాపై అన్నీ పార్టీలు గేమాడుతున్నాయ‌ని తిర‌గ‌బడ్డ కాట‌మ‌రాయుడు పాచిపోయిన ల‌డ్డూలను ప్ర‌క‌టించిన‌ బీజేపీ పంచ‌న చేరిపోయారు. దీంతో ఆయ‌న రాజ‌కీయ గ్రాఫ్ అమాంతం ప‌డిపోయింది.

జనసేనను 2014 మార్చిలో పవన్ స్టార్ట్ చేసినపుడు ఆ పార్టీలో ఒక ఫైర్ కనిపించింది. సరైన సమయంలో పవన్ దిగాడని అంతా అన్నారు. ఉమ్మడి ఏపీ అడ్డగోలు విభజనని పూర్తిగా ఎండగట్టిన ఒకే ఒక్కడుగా పవన్ని ఆంధ్రులు ఆశగా చూశారు. అయితే పవన్ ఆవేశం కాస్తా సరైన వ్యూహం లేక చతికిలపడింది. 2014 ఎన్నికల వేళ కెరటంగా వచ్చిన పవన్ టీడీపీ, బీజేపీ పంచ‌న చేర‌డంతో ఆయ‌న ప‌వ‌ర్ త‌గ్గిపోయింది. ఆయ‌న ద్వారా గరిష్ట రాజకీయ లాభాన్ని ఆ రెండు పార్టీలు పొందితే వాటికి మద్దతుదారుగా సైడ్ క్యారక్టర్ కి పరిమితం కావడం పవన్ చేసిన అతి పెద్ద చారిత్రాత్మకమైన తప్పు.

వాస్తవంగా 2014 ఎన్నికల్లో పోటీ చేయ‌కుండా వ్యూహాత్మ‌కంగా ఆయాచితంగా ప‌వ‌న్ త‌న పార్టీని బ‌తికించుకున్నాడు. ఆ త‌రువాత 2019 వరకూ రాజకీయం దశ దిశ లేకుండా సరైన వ్యూహాలే లేకుండా జ‌న‌సేన సాగిపోయింది. 2017 నాటికి బీజేపీ స్నేహాన్ని తెంచుకున్నారు. ఆ టైమ్ లో ప్రత్యేక హోదా మీద నిగ్గదీసేందుకు ప‌వ‌న్ మొనగాడుగా ఉన్నార‌ని అంతా అనుకున్నారు. బీజేపీకి గుడ్ బై కొట్టిన ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల నాటికి టీడీపీతో క‌టీఫ్ అయ్యారు. ఒక వేళ ఆనాడు టీడీపీతో పొత్తు కొనసాగించి ఉంటే 2019 ఎన్నికలు వేరేగా ఉండేవి. టీడీపీ కూడా ఇంతలా నష్టపోయేది కాదు. పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోయేవారు కాదు. మరో రాంగ్ స్టెప్ కి పవన్ అలా తెర తీశారు.

ఇక 2019లో డిపాజిట్లు పోయాక వామపక్షాలతో మైత్రిని కొనసాగించి ఏపీలో బీజేపీ వ్యతిరేక వైసీపీ వ్యతిరేక ప్రజా ఉద్యమాలు చేసి ఉంటే కథ‌ వేరేగా ఉండేది. కానీ, ఆయన ఆరు నెలలు తిరగకుండానే బీజేపీతో చేతులు కలిపారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన పార్టీని కౌగిలించుకుని రాజ‌కీయాల్లో ప‌లుచ‌న‌య్యారు. పోనీ ఆ బీజేపీతో అయినా సరైన స్నేహాన్ని కొనసాగిస్తున్నారా అంటే అదీ లేదు. ప్ర‌స్తుతం ఆయన చూపులు టీడీపీ మీద ఉన్నాయని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

ఇక వైసీపీ వ్య‌తిరేక ఓట్లు చీలకుండా చూస్తాను అని చెబుతున్న పవన్ దాని కోసం ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారా అంటే అదీ లేదు. బీజేపీతో కటీఫ్ అన్నది చెప్పరు. టీడీపీతో మైత్రి ఉందో లేదో గుట్టు విప్పరు. ఇలా చల్తీ కా నాం గాడీ అన్నట్లుగానే పవన్ రాజకీయం `చుక్కానిలేని నావ‌`లాగా ఏపీలో సాగుతోంది. ఫ‌లితంగా పవన్ పార్టీ మీద తొలినాటి మోజులు కానీ ఆ ఆకర్షణలు కానీ ఏమీ లేకుండా పోయాయని రాజ‌కీయ చ‌ద‌రంగంలోని సీనియ‌ర్లు సైతం మాట్లాడుకుంటున్న ప‌రిస్థితి.

ఇపుడు ఎన్నికలు దూసుకొస్తోన్న క్ర‌మంలో తాపీగా పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత మీద ఫోకస్ అంటున్నారు. తన పార్టీలోకి చేరికలను కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ పవన్ వైఖరిని ఆయన వ్యూహాల లేమిని చూసిన ఇతర పార్టీలలోని సీనియర్లు దూరంగానే ఉంటున్నారు. పవన్ మీద నమ్మకం లేకనే ఇలా చేస్తున్నారని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పవన్ సీరియస్ పాలిటిక్స్ చేయడం లేదని ఇప్పటికే చాలా మంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఒకనాడు మేధావులు సీనియర్లు ఎంతోమంది కీలక నేతలు ఉన్న జనసేనలో ఇపుడు పెద్దగా ఎవరూ లేకపోవడానికి కారణం పవన్ వేస్తున్న తడబాటు అడుగులని ఎవ‌రైనా చెబుతారు. ఏపీలో రాజకీయ శూన్యత పూర్తిగా ఉన్నా కూడా గుర్తిస్తున్నారో లేదో తెలియడంలేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను చూస్తుంటే, ప్ర‌జారాజ్యం వైఫ‌ల్యాలు ప‌వ‌న్ కు ఏ మాత్రం గుణ‌పాఠం నేర్పిన‌ట్టు క‌నిపించ‌డంలేద‌ని అనుకోవ‌డంలో త‌ప్పులేదేమో!