Palestine : పాలస్తీనాకు ప్రపంచ రచయితల సంఘీభావం

పాలస్తీనా (Palestine) పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించి, గాజాను పూర్తి దిగ్బంధం చేసి, అక్కడ నిరంతర రక్తపాతానికి బాటలు తీసి అప్పుడే మూడు వారాలు దాటింది.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 03:31 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Palestine : పాలస్తీనా పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించి, గాజాను పూర్తి దిగ్బంధం చేసి, అక్కడ నిరంతర రక్తపాతానికి బాటలు తీసి అప్పుడే మూడు వారాలు దాటింది. గాజా క్రమంగా ఒక శవాల దిబ్బగా మారిపోతోంది. అమాయక స్త్రీలు పసిపిల్లలు వృద్ధులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఈ మారణ హోమాన్ని ఆపమని ఇజ్రాయిల్ కు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి తన పక్షాన తాను ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా ఇజ్రాయిల్ ఆగడం లేదు. గాజా మొత్తాన్ని తన అధీనంలో తెచ్చుకొనే దాకా అక్కడ నరసంహారం సాగించాలని కఠోర నిర్ణయంతో కదులుతోంది.

అమెరికా లాంటి దేశాలు ఒకపక్క ఇజ్రాయిల్ని హెచ్చరిస్తూనే, మరోపక్క ఆయుధాలు, అవసరమైన యుద్ధ సామాగ్రి సరఫరా చేస్తున్నాయి. ఇజ్రాయిల్ సాగిస్తున్న ఈ ఘోర కలిని నిలువరించే శక్తి ఈ ప్రపంచంలో ఏ దేశానికీ లేదా అన్న సందేహం కలుగుతోంది. మరోపక్క ఇజ్రాయిల్ తో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పాలస్తీనా (Palestine)కు సంఘీభావంగా మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు ఏకమవుతున్నారు. శాంతి కాముకులు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన సాగిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో మాన్ హటన్ లోని ఒక చర్చిలో జరిగిన పాలస్తీనా (Palestine) సాహిత్య ఉత్సవం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join.

నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ పాలస్తీనా సాహిత్య ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చింది. “పాలిస్తీనా గురించి అంతరాత్మ సాక్షిగా మనం మాట్లాడాలి” అన్నదే ఆ పిలుపు. ఆన్లైన్, ఆఫ్లైన్ కార్యక్రమంగా ఈ ఈవెంట్ జరిగింది. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది పైగా రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. ఇందులో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రషీద్ ఖలీది, ప్రఖ్యాత రచయిత టా-నిహిసి కోట్స్ తదితర ప్రముఖులు, ఎల్ కుర్ద్ లాంటి యువ పాలస్తీనా (Palestine) కవులు కూడా పాల్గొని పాలస్తీనా చరిత్ర, పాలస్తీనియుల ప్రతిఘటన, ఇందులో అమెరికా రాజకీయ జోక్యం మొదలైన అంశాలను వివరించారు.

ఈ ఉత్సవం 2008 నుంచి జరుగుతుంది. ప్రస్తుతం పాలస్తీనా (Palestine) పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దమనకాండ, అది సృష్టిస్తున్న రక్తపాతం ప్రపంచాన్ని కలిచి వేస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ఉత్సవానికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు రచయితలు కళాకారులు మేధావులు పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్న మానవ విధ్వంసాన్ని నిలువరించడానికి ప్రపంచవ్యాప్తంగా రచయితలు మేధావులు కవులు జోక్యం చేసుకోవాలని ఈ ఉత్సవం సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.

వియత్నాం యుద్ధాన్ని ఖండిస్తూ 1967లో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాన్ హటన్ లోని జేన్స్ చాపెల్ లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. సరిగ్గా అక్కడే ఈ పాలస్తీనా ఉత్సవం కూడా నిర్వహించడం ఒక విశేషం. ఈ సందర్భంగా నిర్వాహకులు మార్టిన్ లూథర్ కింగ్ ఆనాడు చెప్పిన మాటలను గుర్తు చేశారు.” ఈ రాత్రి ఈ పవిత్ర స్థలంలో నా హృదయం విప్పి మాట్లాడడానికి వచ్చాను. మౌనం కూడా కుట్రే అని చెప్పే ఒక సమయం వస్తుంది.” ఇవి ఆయన మాటలు. పాలస్తీనా విమోచన కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం, ఆ పోరాటంపై సాగుతున్న ఇజ్రాయిల్ అణచివేత నేపథ్యంలో జరిగిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలకు, మేధావులకు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న ప్రముఖ రచయితలు మేధావులు పాలస్తీనాకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలుపవలసిన ఆవశ్యకతను గూర్చి నొక్కి చెప్పారు.

ఇందులో వారు చెప్పిన మాటల్లో ఒక ముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. “ఇది పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధం కాదు, ఇది పాలస్తీనా మీద జరుగుతున్న యుద్ధం”. అంటే పాలస్తీనా ప్రతిఘటన గురించి సహృదయంగా అర్థం చేసుకోవడానికి పాలస్తీనా చరిత్ర తెలియాలని, అందరూ చరిత్రను తెలుసుకొని జరుగుతున్న ఈ మానవహననాన్ని ఖండించి తమదైన మార్గంలో ఈ ఘోరాన్ని ఆపడానికి కృషి చేయాల్సి ఉందని ఈ సాహిత్య ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజన కారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం యూదులు, ఇజ్రాయిల్ మాత్రమే పాలస్తీనా మీద సాగిస్తున్న యుద్ధం కాదు. ఇది ఇజ్రాయిల్, అమెరికా కలిసి సాగిస్తున్న దమనకాండ అని ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖులు తీవ్ర నిరసన ధ్వనితో మాట్లాడారు. ఇప్పటికే పాలస్తీనాలో 9,000 మంది చనిపోయారు వీరులో నాలుగు వేల మంది పిల్లలే ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏ దేశాలు ఎంత హితబోధ చేసినా, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు జోక్యం చేసుకున్నా, ఇజ్రాయిల్ ఏకపక్షంగా తన నరహంతక కేళి సాగిస్తూనే ఉంది. చూడాలి, ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసన ఉద్యమాలను చూసైనా ఇజ్రాయిల్ మనసు కరుగుతుందేమో.

Also Read:  Tamil Nadu : పేదవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్న కూతురినే కడతేర్చిన కసాయి తండ్రి