Gaza : గాజాలో ఆ నాలుగు గంటలు..

అధికారిక లెక్కల ప్రకారమే 11 వేల మంది గాజా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది దాకా చనిపోయి ఉంటారని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - November 10, 2023 / 01:18 PM IST

By: డా. ప్రసాదమూర్తి

4 Hours in Gaza : 34 రోజులు దాటింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు జరిపిన తర్వాత ఈ 34 రోజులుగా ఇజ్రాయిల్ గాజాను దిగ్బంధం చేసింది. బాంబుల వర్షంలో ముంచెత్తింది. రక్తం ఏరులై పారించింది. కుప్పల కుప్పల క్షతగాత్రులతో ఆసుపత్రులను నింపేసింది. అమాయక శవాలతో ఉత్తర గాజా (Gaza) మొత్తాన్ని స్మశానంగా మార్చేసింది. అధికారిక లెక్కల ప్రకారమే 11 వేల మంది గాజా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది దాకా చనిపోయి ఉంటారని తెలుస్తోంది. వీరిలో సగానికి పైగా పిల్లలే ఉన్నారు. భార్యలు భర్తల్ని.. భర్తలు భార్యల్ని.. పిల్లలు తల్లిదండ్రులని.. తల్లితండ్రులు పిల్లల్ని.. వృద్ధులు తమకు ఆధారమైన సంతానాన్ని.. ఇలా ఎందరెందరో తమ ప్రాణాధారమైన వ్యక్తుల్ని కోల్పోయారు. ప్రపంచమంతా పాలస్తీనాలో జరుగుతున్న ఈ నెత్తుటి హోమం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ దేశం ఈ దేశం అని లేదు, దాడి చేస్తున్న ఇజ్రాయిల్ దేశం నుంచి, దాన్ని సమర్థిస్తున్న అమెరికా నుంచి పశ్చిమ దేశాల నుంచి మొత్తం ప్రపంచ దేశాలు అన్నింటా ఇజ్రాయిల్ యుద్ధ ఘాతుకాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు సాగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ని కొద్ది మేరకైనా కట్టడి చేయకపోతే ప్రపంచవ్యాప్తంగా తాము విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుని కొంచెం వెనక్కి తగ్గేలా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. మొన్న జపాన్లో సమావేశమైన జి-7 విదేశాంగ మంత్రులు సంయుక్తంగా ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని యుద్ధ విరామం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒకపక్క పాలస్తీనాలో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని, వారిని సంపూర్ణంగా హతమార్చితే గాని అక్కడ శాంతి నెలకొనదని ఈ సో కాల్డ్ ధనిక దేశాలు నిస్సిగ్గుగా ప్రకటిస్తూనే, మరోపక్క మానవత్వాన్ని ప్రదర్శిస్తూ కొంచెం యుద్ధంలో విరామాన్ని పాటించమని నెతన్యాహుని బతిమాలుకుంటున్నాయి. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా, ఇటలీ దేశాలు కంటి తుడుపుగా చేసిన వినతిని మన్నిస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గాజా (Gaza)లో యుద్ధానికి రోజుకు నాలుగు గంటల విరామం ప్రకటించాడు.

ఈ విరామం ఎవరి కోసం.. దేనికోసం?

మూడున్నర లక్షల మంది సైన్యంతో గాజాను ముట్టడించిన ఇజ్రాయిల్ ఇప్పుడు రోజుకు నాలుగు గంటల యుద్ధ విరామాన్ని ప్రకటించడం మానవతా చర్యగా అమెరికా లాంటి దేశాలు కొనియాడుతున్నాయి. కానీ ప్రపంచ దేశాలన్నీ పూర్తి విరామాన్ని పాటించాల్సిందేనని తీవ్రమైన డిమాండ్ చేస్తున్నాయి. ఇజ్రాయిల్ దేశంలోనే అనేకమంది మేధావులు జర్నలిస్టులు సామాజిక కార్యకర్తలు కళాకారులు రచయితలు నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెతన్యాహు ప్రకటించిన ఆ నాలుగు గంటల విరామం దేనికోసం? ఎవరికోసం? అనే ప్రశ్న ఉదయిస్తుంది. రోజుకు నాలుగు గంటల విరామం ప్రకటించామని, ఈ నాలుగు గంటల సమయంలో విదేశీయులు బయటకు వెళ్ళవచ్చని, ఉత్తర గాజా (Gaza) నుంచి దక్షిణ కాజాకు వెళ్ళాలి అనుకున్న వాళ్లు క్షేమంగా తరలిపోవచ్చని, ఇంధనం ఇతర సామగ్రిని సమకూర్చుకోవచ్చని నెతన్యాహు చెప్తున్నారు. కానీ ఆయన నిజాయితీ పట్ల ప్రపంచానికి నమ్మకం పోయింది. ఈ సమయాన్ని చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటాడని పలువురు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

గాజా (Gaza)లో హమాస్ రహస్య సొరంగ మార్గాలను అదుపులోకి తెచ్చుకోవడానికి, హమాస్ నేతలతో చర్చలు జరిపి తమ బందీలను విముక్తి చేసుకోవడానికి, తమ సైనికులకు కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఈ సమయాన్ని ఇజ్రాయిల్ ఉపయోగించుకుంటుందని పలువురు మేధావులు చెప్తున్నారు. అందుకే గాజాలో రోజుకు నాలుగు గంటలు చొప్పున ప్రకటించిన ఈ యుద్ధ విరామంలో ఎవరు ఏం చేస్తారనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. ఈ నాలుగు గంటల సమయంలో గాజి ప్రజలు ఆసుపత్రులలో, రోడ్లమీద, ఇళ్లల్లో నిత్తురోడుతూ పడి ఉన్న క్షతగాత్ర బంధువులకు సపర్యలే చేసుకుంటారా, లేక ఎక్కడి వాళ్ళని అక్కడే వదిలేసి తమ దారి తాము చూసుకొని మూటాముల్లే సర్దుకుని దక్షిణ గాజాకు పారిపోతారా ఈ సందిగ్ధ సంక్షోభ సమయంలో వారు ఏం చేస్తారు? అనేది మనలాంటి వారికి ఊహించడమే కష్టం. ఏదో రోజుకు నాలుగు గంటల సమయాన్ని బిక్షగా పడేశానని నెతన్యాహు ఇప్పుడు గొప్ప మానవతా మూర్తిగా పోజు పెట్టవచ్చు. పూర్తి యుద్ధ విరామాన్ని తాను ప్రకటించబోయేది లేదని ఆయన ప్రపంచానికి తెగేసి చెప్పాడు. దీన్నిబట్టి ఈ తాత్కాలిక విరామం తన సైన్యం శక్తిని తిరిగి పుంజుకోవడానికి గాని, తన ఆయుధ సామాగ్రిని తిరిగి సమకూర్చుకోవడానికి, తమ ఇంధన అవసరాలను తిరిగి పరిపూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడని ఊహించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Also Read:  Air Taxis: 2026 నాటికి భారత్ లో ఎయిర్ ట్యాక్సీలు..!

పూర్తి యుద్ద విరమణ ఒక్కటే పరిష్కారం:

ఇంత విధ్వంసం జరిగాక ఇంత రక్తపాతం జరిగాక ఇంత అల్లకల్లోలం జరిగాక ఇక ఇప్పుడైనా ఇజ్రాయిల్ శాంతించాలని, కక్ష తీర్చుకోవడానికైనా ప్రతీకారానికైనా ఓ పరిమితి ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులు నెతన్యాహుకి హితవు పలుకుతున్నారు. ఇలా మూడు నాలుగు గంటల రోజువారి విరామం, రానున్న రోజుల్లో మరింత విధ్వంసానికి మరింత రక్తపాతానికి మరింత మానవ మారణహోమానికి దారితీస్తుంది తప్ప ఇది శాశ్వత పరిష్కారం కాదు. అందుకే గాజా (Gaza)లో సంపూర్ణ యుద్ధ విరమణ ప్రకటించాలని ప్రపంచ దేశాల్లో మానవ వాదులంతా ముక్తకంఠంతో నిలదీస్తున్నారు. అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు సన్నాయి నొక్కులు ఆపేసి, నెతన్యాహుని సంపూర్ణంగా అడ్డుకొని గాజాలో శాంతి భద్రతల స్థితిని పునరుద్ధరించడానికి తమ శక్తి యుక్తులన్నీ ఉపయోగించాలి.

ఐక్యరాజ్యసమితి ఇలాంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకొని, తన ఉనికి యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పాలి. బలైపోతున్నది కేవలం గాజా (Gaza) ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకుంటున్న కోట్లాదిమంది ఆశలు కూడా. అందుకే గాజాలో తాత్కాలిక విరామాలు కాదు సంపూర్ణ యుద్ధ విరామమే పరిష్కారం.

Also Read:  War On Bedbugs : దక్షిణ కొరియాను వణికిస్తున్న నల్లులు