National Herald Case : నేషనల్‌ హెరాల్డ్‌ కేసేంటి?.. అసలేం జరిగింది?

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కాంగ్రెస్‌ పెద్దల మెడకు చుట్టుకుంది. అడ్డగోలుగా చేసిన ఓ పని సోనియా, రాహుల్‌ను పూర్తిగా ఇరకాటంలో పడేసింది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కష్టార్జితమయిన నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను అప్పనంగా దక్కించుకోడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది.

  • Written By:
  • Updated On - June 14, 2022 / 02:18 PM IST

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కాంగ్రెస్‌ పెద్దల మెడకు చుట్టుకుంది. అడ్డగోలుగా చేసిన ఓ పని సోనియా, రాహుల్‌ను పూర్తిగా ఇరకాటంలో పడేసింది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కష్టార్జితమయిన నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను అప్పనంగా దక్కించుకోడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది.

ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో కేసు పూర్వపరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. 1937లో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు గాంధీ, పటేల్‌, నెహ్రూ మూలస్తంభాలుగా నిలిచారు. నేషనల్‌ హెరాల్డ్‌ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి 5 వేల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరందరికి నేషనల్‌ హెరాల్డ్‌లో షేర్లు ఉన్నాయి. పాలకుల ప్రజా కంటక నిర్ణయాలను నేషనల్‌ హెరాల్డ్‌ ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో బ్రిటీష్‌ వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో 1942 నుంచి 1945 వరకు నేషనల్‌ హెరాల్డ్‌పై బ్రిటీష్‌ పాలకులు నిషేధం విధించారు.

ఇదే క్రమంలో వరుస ఉద్యమాలతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నష్టాల పాలయింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు నేషనల్‌ హెరాల్డ్‌కు నాటి జాతీయ పార్టీ కాంగ్రెస్‌ రూ.90కోట్ల మేర విడతల వారీగా సాయం అందించింది. చాన్నాళ్ల పాటు వీటిని పట్టించుకోని కాంగ్రెస్‌ పెద్దలు.. యూపీఏ 2 హయాంలో నేషనల్‌ హెరాల్డ్‌పై దృష్టి సారించారు. 2009 నాటికి నేషనల్‌ హెరాల్డ్‌లో మిగిలిన వాటాదారుల సంఖ్య కేవలం 1057 మంది మాత్రమే. అయితే నేషనల్‌ హెరాల్డ్‌కు ఢిల్లీతో పాటు పలు నగరాల్లో నడిబొడ్డున అత్యంత విలువైన ఆస్తులున్నాయి. న్యూఢిల్లీలోని బహుదూర్‌ షా జఫర్‌ మార్గ్‌లో అత్యంత కీలకమైన ప్రాంతంలో హెరాల్డ్‌ హౌజ్‌ ఉంది. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తుల గురించి వివరాలు 2009లో బయటికొచ్చాయి. ఇక్కడే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

2010లో రూ.50లక్షల మూలధనంతో యంగ్‌ ఇండియన్‌ అనే కంపెనీని కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్‌కు 76 శాతం వాటా, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లకు 24 శాతం వాటాతో యంగ్‌ ఇండియన్‌ ఏర్పాటయింది. దీనికి కావాల్సిన రూ.50లక్షల మూలధనం కూడా సిద్ధంగా లేకపోవడంతో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ దగ్గర రూ.కోటి లోన్‌ తీసుకుని మరీ సంస్థను ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో ఏఐసీసీలో మరో పరిణామం చోటు చేసుకుంది. నేషనల్‌ హెరాల్డ్‌కు ఇచ్చిన అప్పును తీర్చలేని రుణంగా ప్రకటించిన ఏఐసీసీ.. దాన్ని యంగ్‌ ఇండియాకు రూ.50లక్షలకు ఇచ్చేసింది. అంటే నేషనల్‌ హెరాల్డ్‌ రూ.90 కోట్ల బకాయిలను యంగ్‌ ఇండియన్‌కు రూ.50 లక్షలకు అప్పగించిందన్న మాట. దీనికి సంబంధించి అటు ఏఐసీసీ తరపున, ఇటు యంగ్‌ ఇండియన్‌ తరపున, దాంతో పాటు నేషనల్‌ హెరాల్డ్‌ తరపున కూడా ఒకే వ్యక్తి మోతీలాల్‌ వోరా సంతకం చేయడం గమనార్హం.

ఈ ఒప్పందంతో నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులన్నీ యంగ్‌ ఇండియన్‌ స్వాధీనం చేసుకుంది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు రూ.5వేల కోట్లు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల వాటాలకు చెందిన కంపెనీలో భారీగా అవకతవకలు జరిగాయంటూ 2012లో ఢిల్లీ కోర్టులో సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. అప్పట్లో ఈ కుంభకోణాన్ని సుమారు రూ.1600 కోట్లుగా లెక్కగట్టారు సుబ్రహ్మణ్యస్వామి. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ ఏర్పాటు ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులన్నింటినీ సోనియా, రాహుల్‌ చేజిక్కించుకున్నారని ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించి 2014లో సోనియా, రాహుల్‌, శ్యాంపిట్రోడాలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. 2016లో పటియాలా హౌజ్‌ కోర్టు నుంచి కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌ తెచ్చుకున్నారు. 2019లో రూ.64కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఇప్పటికే సోనియా, రాహుల్‌లకు ఆదాయంపన్ను శాఖ నోటీసులిచ్చింది. ఐటీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయించింది. 2019లో సోనియా, రాహుల్‌లకు సుప్రీంకోర్టులో ఐటీ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. ట్రైబ్యునల్‌లో సోనియా, రాహుల్‌లకు వ్యతిరేకంగా పరిణామాలు చోటుకున్నాయి. సోనియా, రాహుల్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. చదవండి: ఈడీ విచారణకు హాజరైన రాహుల్‌ గాంధీ