Marriage Vs Individual Privacy : భర్త వ్యక్తిగత సమాచారాన్ని భార్యకు చెప్పక్కర్లేదు : హైకోర్టు

Marriage Vs Individual Privacy : భర్త తన వ్యక్తిగత వివరాలను భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 08:48 AM IST

Marriage Vs Individual Privacy : భర్త తన వ్యక్తిగత వివరాలను భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు, వ్యక్తిగత స్వయంప్రతిపత్తి అనేవి జీవిత భాగస్వామికి కూడా ఉంటాయని తెలిపింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా.. విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు ఉండదని తేల్చి చెప్పింది. హుబ్బళ్లికి చెందిన మహిళ తన మాజీ భర్త ఆధార్ సహా వ్యక్తిగత వివరాలను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌.సునీల్‌దత్‌ యాదవ్‌, జస్టిస్‌ విజయకుమార్‌ ఏ పాటిల్‌లతో కూడిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఈమేరకు సంచలన తీర్పును వెలువరించింది.

కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన మహిళకు 2005లో పెళ్లయింది. అయితే పాప పుట్టిన తర్వాత భార్యాభర్తలు మనస్పర్దలతో విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా ప్రతినెలా  రూ.10,000.. పాప సంరక్షణకు మరో రూ.5 వేలు చెల్లించాలని భర్తను ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే మాజీ భర్త భరణాన్ని ఇవ్వడం లేదంటూ సదరు మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త ఆధార్‌ కార్డు వివరాలను ఇవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కు సమాచార హక్కు చట్టం కింద సదరు మహిళ దరఖాస్తు సమర్పించింది.  అయితే తాము ఆ వివరాలను ఇవ్వలేమని 2021 ఫిబ్రవరి 25న UIDAI తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సదరు మహిళ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. ఆమెకు ఆధార్‌ వివరాలు అందజేయాలని గత ఫిబ్రవరి 8న మహిళ భర్తను ఆదేశించింది. ఆ ఆదేశాలపై కర్ణాటక హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి UIDAI అప్పీల్ చేసింది.

Also Read: Richest Cricketer : ఈ క్రికెటర్‌కు 225 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది తెలుసా?

అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్‌ వివరాలను తెలియజేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను UIDAI తరఫు న్యాయవాది హైకోర్టు ఎదుట ప్రస్తావించారు. అయితే UIDAIకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ‘‘వివాహ బంధంతో ఇద్దరు భాగస్వాముల కలయిక  జరిగినంత మాత్రాన వ్యక్తి గోప్యతా హక్కు కనుమరుగు కాదు. వ్యక్తిగత హక్కు స్వయంప్రతిపత్తిని ఆధార్ చట్టంలోని సెక్షన్ 33 రక్షిస్తుంది. దాని ప్రకారం విధానపరమైన హక్కును వివాహం తొలగించలేదు’’ అని కర్ణాటక హైకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పు(Marriage Vs Individual Privacy) ఇచ్చింది.