Heartbeat: ఒక నక్షత్రం నుంచి భూమికి మిస్టరీ సిగ్నల్స్.. అవి ఏమిటంటే..!?

ఒకరి ఫోన్ నుంచి మరొకరి ఫోన్ కు కాల్ వెళ్తే.. టెలికాం సిగ్నల్స్ ప్రసారం జరుగుతుంది.మరి అంతరిక్షం నుంచి.. పాలపుంత నుంచి భూమికి ప్రత్యేకమైన రేడియో సిగ్నల్స్ అందితే దాన్ని ఏవిధంగా భావించాలి ?

  • Written By:
  • Publish Date - July 17, 2022 / 02:00 PM IST

ఒకరి ఫోన్ నుంచి మరొకరి ఫోన్ కు కాల్ వెళ్తే.. టెలికాం సిగ్నల్స్ ప్రసారం జరుగుతుంది.మరి అంతరిక్షం నుంచి.. పాలపుంత నుంచి భూమికి ప్రత్యేకమైన రేడియో సిగ్నల్స్ అందితే దాన్ని ఏవిధంగా భావించాలి ? ఆ సిగ్నల్స్ ఎవరు పంపినట్టు ? ఎవరికి పంపినట్టు ?

భూమికి కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఒక పాలపుంత నుంచి ఈ రేడియో సిగ్నల్స్ వచ్చాయని అమెరికాలోని మసాచు సెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తరహా రేడియో సిగ్నళ్లను ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ అని పిలుస్తారని వెల్లడించారు. సాధారణమైన ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ అయితే కొన్ని మిల్లీ సెకన్ల పాటే యాక్టివ్ గా ఉంటాయి. కానీ ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ దాదాపు 3 సెకన్ల పాటు యాక్టివ్ గా ఉంటున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈవిధంగా భిన్నంగా ఉన్న ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ కు శాస్త్రవేత్తలు ”

FRB 20191221A” అని పేరు పెట్టారు. ఇవి భూమికి అత్యంత దూరంలో ఉన్న ఒక మాగ్నెటార్ నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఈ రేడియో సిగ్నల్స్ యొక్క ఆకారం.. మనిషి హర్ట్ బీట్ వేవ్స్ ను పోలిన ఆకారంలో ఉన్నట్లు తెలిపారు. మనిషి గుండె ప్రతి 0.8 సెకన్లకు ఒకసారి కొట్టుకుంటుంది. అదేవిధంగా ఈ మిస్టరీ రేడియో సిగ్నల్ ప్రతి 0.2 సెకన్లకు ఒకటి వచ్చింది.

మాగ్నెటార్స్ లో ఏం జరుగుతుంది ?

సూర్యుడి కంటే కొన్ని నక్షత్రాలు చాలా పెద్దగా ఉంటాయనే విషయం తెలిసిందే. 10 నుంచి 25 సూర్యుల పరిమాణంలో ఉండే సూపర్‌మాసివ్ నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తి కోల్పోయిన తరువాత మృత నక్షత్రాలు (న్యూట్రాన్ స్టార్స్‌)గా మారతాయి. ఈ న్యూట్రాన్ స్టార్స్‌లో అత్యంత తీవ్రమైన అయస్కాంత క్షేత్రంతో ఒక చిన్న సమూహం ఏర్పడుతుంది. దీన్ని మాగ్నెటార్స్ అంటారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవర పెడుతున్నాయి. తాజాగా వీటిపై చేపట్టిన పరిశోధనల్లో కొత్త అంశాలకు కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. 13 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక మాగ్నటార్ నుంచి 3.5 మిల్లీసెకన్ల పాటు ఉద్భవించిన, అత్యంత అరుదైన భారీ విస్ఫోటనాలకు సంబంధించిన ఆధారాలను అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం పొందింది. మన గెలాక్సీలో మొత్తం 30 వరకు మాత్రమే మాగ్నటార్స్ ఉన్నాయి. వాటి స్వభావం గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. అయితే వారి నుంచి వెలువడే శక్తి సూర్యుడి నుంచి వెలువడే సౌర మంటల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. క్రియారహిత స్థితిలో కూడా ఈ మాగ్నటార్స్ సూర్యుని కంటే అనేక వేల రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. GRB2001415 మాగ్నటార్‌ నుంచి 2020 ఏప్రిల్ 15న సంభవించిన ఫ్లాష్ సెకనులో పదోవంతు మాత్రమే కొనసాగింది. దీని నుంచి విడుదలైన శక్తి.. 1,00,000 సంవత్సరాలలో మన సూర్యుడు ప్రసరించే శక్తికి సమానం. మాగ్నెటార్ నుంచి వెలువడిన ఈ భారీ విస్ఫోటనం.. వాటి అయస్కాంత గోళంలో అస్థిరత కారణంగా లేదా వాటి క్రస్ట్‌లో ఏర్పడ్డ ఒక రకమైన భూకంపం కారణంగా సంభవించి ఉండవచ్చు. ఈ విస్పోటనం ఒక కిలోమీటరు మందంతో దృఢమైన, సాగే పొరలా ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.