Brain Chip : తొలిసారిగా మనిషి మెదడులోకి చిప్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?

Brain Chip : తొలిసారిగా ఓ మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చారు.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 09:07 AM IST

Brain Chip : తొలిసారిగా ఓ మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చారు. 8 మిల్లీమీటర్ల వ్యాసంతో సమానమైన సైజు కలిగిన చిప్‌ను సర్జరీ ద్వారా మనిషి మెదడులో అమర్చారు. ఈ ఘనతను  న్యూరాలింక్‌ (Neuralink) కంపెనీ సాధించింది. ఈ సంస్థ ఎవరిదో తెలుసా ? ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్కే ఈ కంపెనీ ఓనర్. ఎలక్ట్రానిక్‌ చిప్‌ను మెదడులో అమర్చుకున్న వ్యక్తి  వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. ఈ చిప్‌ను మెదడులో అమర్చిన తర్వాత.. ఆ వ్యక్తిలో స్పష్టమైన ‘న్యూరాన్‌ స్పైక్‌ డిటెక్షన్‌’ను గుర్తించినట్లు చెప్పారు. నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ఈ చిప్ లక్ష్యం. మనిషి మెదడు సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ చిప్‌తో  ప్రయోగాలు చేస్తున్నారు. మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉంది. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను(Brain Chip) అమర్చింది. అయితే, న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ అప్పట్లో వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ -కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (BCI) ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలోనే ఆమోదం తెలిపింది. అంటే ఈ చిప్‌ను మనుషుల మెదడులో అమర్చేందుకు న్యూరాలింక్ కంపెనీ అధికారిక అనుమతులు కూడా ఇప్పటికే పొందింది. ఈ చిప్‌ను ఇంతకుముందు ప్రయోగ పరీక్షల్లో భాగంగా పందులు, కోతుల మెదడులో అమర్చారు. దీంతో అది అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని తేలింది. ఈ చిప్‌ను అమర్చిన తర్వాత ఒక కోతి ‘పాంగ్‌’ వీడియో గేమ్‌ కూడా ఆడేంత తెలివితేటలను సొంతం చేసుకుంది. కాగా, న్యూరో టెక్నాలజీ కంపెనీ ‘న్యూరాలింక్’ను ఎలాన్ మస్క్ 2016లో స్థాపించారు. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ‘న్యూరాలింక్’ కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రయోగాల కోసం న్యూరాలింక్ కంపెనీ ఇప్పటికే రూ.3వేల కోట్ల దాకా సేకరించింది.

Also Read : Life Expectancy : చదువు ఆయుష్షును కూడా పెంచుతుంది : రీసెర్చ్ రిపోర్ట్

బ్రెయిన్ చిప్ పనితీరు ఇదీ.. 

  • మనిషి మెదడులో అమర్చిన చిప్ సైజు 8 మిల్లీమీటర్లు. దీని పేరు ఎన్‌1.
  •  ఈ చిప్‌కు మూడువేలకుపైగా సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఒక్కో ఎలక్ట్రోడ్ మన వెంట్రుక మందంలో  20వ వంతు సైజులో ఉంటుంది.
  • మనిషి పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 చిప్‌ను అమర్చారు.
  • ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా చొప్పిస్తారు.
  • ఈ ఎలక్ట్రోడ్‌లు మెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి.
  • ఈ ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి.
  • ఈ చిప్‌లోని ఎలక్ట్రోడ్లు ఏకకాలంలో వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి.
  • ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చని ఎలాన్ మస్క్ అంటున్నారు.
  • మెదడులో చిప్ ఇన్‌స్టాల్‌ అయ్యాక దాని నుంచి విద్యుత్‌ సంకేతాలు బయటికి వస్తాయి. ఆ విద్యుత్ సంకేతాలను  కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తారు.