Asteroid Samples : ఆస్టరాయిడ్ శాంపిల్స్ భూమికి వచ్చేశాయ్.. ఎలా ? ఎందుకు ?

Asteroid Samples : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో ముందడుగు వేసింది.

  • Written By:
  • Updated On - September 25, 2023 / 06:05 AM IST

Asteroid Samples : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో ముందడుగు వేసింది.  భూమి పుట్టుక, జీవం గురించిన గుట్టు విప్పే దిశగా 2016లో ప్రయోగించిన  ‘ఒసిరిస్‌ రెక్స్‌’ స్పేస్‌క్రాఫ్ట్‌ .. ‘బెన్నూ’ అనే గ్రహశకలం నుంచి దుమ్ము, రాళ్ల శాంపిళ్లను సేకరించింది. వాటిని ఒక క్యాప్సూల్‌ ద్వారా సురక్షితంగా భూమికి పంపించింది. భూమి నుంచి లక్ష కిలోమీటర్ల దూరం నుంచి ‘ఒసిరిస్‌ రెక్స్‌’ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా విడుదలైన ఈ క్యాప్సూల్‌ అమెరికాలోని ఉతా ఎడారిలో దిగింది.

వాస్తవానికి 2016లో భూమి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ‘ఒసిరిస్‌ రెక్స్‌’ స్పేస్‌క్రాఫ్ట్‌  2020 అక్టోబరులోనే బెన్నూ గ్రహశకలం వద్దకు చేరుకుంది. ఆ గ్రహశకలం ఉపరితలంపై డ్రిల్‌ చేసి మట్టి, రాళ్ల శాంపిళ్లను సేకరించింది. మళ్లీ 2021 మే 10న భూమి దిశగా ‘ఒసిరిస్‌ రెక్స్‌’ స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆ స్పేస్ క్రాఫ్ట్  భూమికి లక్ష కిలోమీటర్ల దూరం నుంచి ఒక క్యాప్సూల్ ద్వారా బెన్నూ గ్రహశకలం శాంపిల్స్ ను (Asteroid Samples) జారవిడిచింది. అది పారచూట్ ద్వారా అమెరికాలోని ఉతా ఎడారిలో ల్యాండ్ అయింది. క్యాప్సూల్ ల్యాండింగ్ దృశ్యాలను నాసా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read : Telangana : తెలంగాణలో బీజేపీకి షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన తొమ్మిది మంది నిజామాబాద్ నేత‌లు

వాస్తవానికి నాసా ఒక భారీ ఆస్టరాయిడ్‌ ను 1999 సెప్టెంబర్‌ 11న తొలిసారి గుర్తించింది. దానికి బెన్నూ అని పేరు పెట్టింది. దీని విస్తీర్ణం దాదాపు 565 మీటర్లు. సెకనుకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. ఈజిప్ట్ మైథాలజీలో ఉన్న బెన్నూ అనే పక్షి పేరును ఈ ఆస్టరాయిడ్‌కు పెట్టారు. ఈ గ్రహశకలం 450 కోట్ల సంవత్సరాల పురాతనమైనదని నాసా అంచనా వేస్తోంది. దాదాపుగా 2,182 సంవత్సరం సెప్టెంబర్‌లోనే ఈ ఆస్టరాయిడ్‌ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే దానిపై దృష్టిసారించిన నాసా.. సమగ్ర స్టడీ చేస్తోంది.