Telangana : వామపక్షాలకు ఇక ఏది దారి?

తెలంగాణ (Telangana)లో సిపిఐ, సిపిఎం పార్టీలు మొదట బీఆర్ఎస్ వైపు ఆశగా ఎదురుచూశాయి. వారి ఎదురుచూపులు ఫలించలేదు.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 03:15 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana Assembly Elections 2023 : రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనమైన పోరాట చరిత్ర కలిగిన వామపక్షాలు, ఎన్నికల రాజకీయాల్లో క్రమంగా తమ ప్రభావం కోల్పోతున్నాయా? ఓట్లు, సీట్లు, అంతిమంగా అధికారం పరమావధిగా సాగే రాజకీయ క్రీడలో కమ్యూనిస్టులు ఇటు గెలవలేక, అటు ఆట ఆపలేక, అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయారా? ఇలాంటి సందేహాలు ఎన్నో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఎవరికైనా కలుగుతాయి. తెలంగాణ (Telangana)లో సిపిఐ, సిపిఎం పార్టీలు మొదట బీఆర్ఎస్ వైపు ఆశగా ఎదురుచూశాయి. వారి ఎదురుచూపులు ఫలించలేదు. సరి కదా అధికార బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనీసం కమ్యూనిస్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇది కమ్యూనిస్టులకు ఆశాభంగామే కాదు పరాభవం కూడా. సరే కేసిఆర్ వద్దనుకుంటే ఏం చేస్తామని కమ్యూనిస్టులు ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ వైపు ఎర్రజెండా సాక్షిగా ఎన్నికల సర్దుబాటు కోసం చేతులు చాచారు.

రోజులు వారాలు నెలల తరబడి చర్చలు, సంప్రదింపులు, సమావేశాలు జరిగాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టుల కలయికతో లాభనష్టాల గణాంకాలు తీసి పెదవి విరిచినట్టుగా అర్థమవుతుంది. సిపిఎం తెలంగాణ (Telangana) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అంటే అటు అధికార బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండూ కమ్యూనిస్టులకు మొండి చేయి చూపించినట్టే అర్థం చేసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join.

తాము తప్ప మిగతా పార్టీలన్నీ బూర్జువా పార్టీలని, వాటితో పొత్తు తాత్కాలికమైనదే అని కమ్యూనిస్టులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అది సరేగాని ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా అధికారం చేపట్టే స్థితికి చేరుకున్న వైభవ చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఒకటి రెండు స్థానాలకు కూడా అదే బూర్జువా పార్టీల పంచన చేరాల్సి రావడం ఆ పార్టీలకే కాదు, కమ్యూనిస్టు అభిమానులకు సానుభూతిపరులకు కూడా చాలా బాధాకరం. కానీ వాస్తవం మాత్రం ఇదే. అయితే ఆ పార్టీ, లేకుంటే ఈ పార్టీ ఏదో ఒక పార్టీ. వారు అంటున్న బూర్జువా పార్టీ అయినప్పటికీ వాటి సహాయ సహకారాలు లేకుండా తాము రెండు మూడు సీట్లు సాధించుకోలేని పరిస్థితి కమ్యూనిస్టులకు వచ్చిందని అర్థమవుతుంది.

తాము రాష్ట్రంలో చాలా బలంగా ఉన్న నియోజకవర్గాలున్నాయని, వాటిలో గణనీయమైన తమ సానుభూతిపరులు ఉన్నారని, తమ ఆసరా ఆ బుజువా పార్టీలకు అవసరమవుతుందని గట్టిగా నిరూపించే సత్తాని కూడా కమ్యూనిస్టులు కోల్పోయారా అనిపిస్తుంది. అటు బిఆర్ఎస్ గాని ఇటు కాంగ్రెస్ గాని కమ్యూనిస్టులతో చేతులు కలపడానికి సిద్ధంగా లేరంటే, వారు అడిగే రెండు మూడు సీట్లు ఇవ్వడానికి కూడా వారు సుముఖంగా లేరంటే కమ్యూనిస్టుల ప్రభావం పెద్దగా ఉండదని వారు భావిస్తున్నట్టుగానే అనుకోవాలి. అంటే అటు బంధుత్వానికే కాదు, శత్రుత్వానికి కూడా కమ్యూనిస్టులు సమ ఉజ్జీ కాదని ఈ సో కాల్డ్ బూర్జువా పార్టీలు భావిస్తున్నాయని స్పష్టమవుతుంది.

కమ్యూనిస్టుల ఓట్లు ఎటువైపు?

మరి ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో కొన్ని జిల్లాల్లోనైనా విస్తృతమైన ప్రజాబలం, సానుభూతిపరులు ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఒక ప్రశ్న చిహ్నంగా మన ముందున్నది. కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా చెబుతున్నది బిజెపికి తాము బద్ధ వ్యతిరేకులం అని. తెలంగాణలో బిజెపి కూడా ఎన్నికల బరిలో ప్రధానంగా ఉంది. ఈ సమయంలో బిజెపికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్పనిసరిగా నిలబడాలి. అయితే ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితి రీత్యా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దానికి చాలా చోట్ల మూడో స్థానంతో సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మిగిలిన అధికార బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తాము సొంత బలంతో గెలిచే అవకాశాలు లేకపోయినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో వారు పోటీ చేస్తారు. అక్కడ బిజెపి కూడా రంగంలో ఉంటుంది. అలా జరిగే చతుర్ముఖ పోటీలో కమ్యూనిస్టులు నెగ్గుకు రావాల్సి ఉంటుంది.

బిజెపిని, అధికార బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంత బలమైన పోటీ మధ్య ఏ ఒక్క సీటులోనైనా కమ్యూనిస్టులు గెలుస్తారా అనేది తేల్చి చెప్పడం కష్టం. అయితే వారు పోటీ చేయని తమకు సానుభూతిపరులు విశేషంగా ఉన్న నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న. బిజెపికి వ్యతిరేకంగా గెలిచేవారికే తాము మద్దతు ఇస్తామని కమ్యూనిస్టు పార్టీలు చెబుతున్నాయి. కానీ 90 శాతం పైగా సీట్లలో కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుంది. ఆ సందర్భంలో కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకా లేక అధికార బిఆర్ఎస్ పార్టీకా? ఇది కమ్యూనిస్టు పార్టీలు తేల్చి చెప్పడం లేదు. బిజెపిని ఓడించే పార్టీకి ఓటు వేయమని తమ సానుభూతిపరులకు చెబుతామని కమ్యూనిస్టు నాయకులు అంటున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా ప్రకారం, జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రకారం, ఈ ఎన్నికల్లో ప్రస్తుతానికి పరోక్షంగా.. ఎన్నికల అనంతరం ప్రత్యక్షంగా బిజెపి, అధికార బీఆర్ఎస్ కు మధ్య బాంధవ్యం బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బిజెపి బంధం గురించి కాంగ్రెస్ నాయకులు చెబుతున్న విషయం ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది. మరి ఇలాంటప్పుడు కమ్యూనిస్టులు బిజెపిని దూరంగా ఉంచాలి అంటే వారు ఎవరిని ఎంచుకోవాలి? అనివార్యంగా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.

కానీ కమ్యూనిస్టుల మాటలు చూస్తే అలా కనిపించడం లేదు. తమ టార్గెట్ బిజెపి అంటున్నారు గానీ బీజేపీ బరిలో లేనప్పుడు టార్గెట్ ఎవరు అనేది తేల్చి చెప్పాల్సి ఉంది. అది తమ సానుభూతిపరుల నిర్ణయానికే వారు వదిలేయవచ్చు. మొత్తానికి తెలంగాణ (Telangana)లో కమ్యూనిస్టుల పరిస్థితి కక్కలేక మింగలేక ఉన్నట్టుగా అయిపోయింది. తమకు రెండు మూడు సీట్లు కూడా ఇవ్వడానికి నిరాకరించి మొండి చేయి చూపించిన పార్టీల వైపే అనివార్యంగా తమ సానుభూతిపరులను నడిపించాల్సిన అయోమయ స్థితిలో కమ్యూనిస్టు పార్టీలు పడిపోయాయి. అయితే ఒక మతంలోని ఓటర్లు తమ మతపెద్ద చెప్పినట్టు ఓట్లు వేస్తారు, కానీ కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయని చోట నాయకులు చెప్పినట్టుగా వారి సానుభూతిపరులు అదే పార్టీకి ఓటు వేస్తారన్న గ్యారెంటీ లేదు. స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలాబలాలు, వారి గెలుపోటములు, మంచి చెడులు బేరీజు వేసుకొని కమ్యూనిస్టు సానుభూతిపరులు అటో ఇటో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో జరిగే త్రిముఖ పోటీలో కమ్యూనిస్టుల ముఖాలు ఎటువైపు తిరుగుతాయో కాలమే తేల్చాలి.

Also Read:  TS RTC : అయ్యప్ప భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్