CM KCR: దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతోంది: దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్!

రాష్ట్ర సచివాలయంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో CM KCR పాల్గొని తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 06:34 PM IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఏవిధంగా ఏర్పడింది? తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? గుణాత్మక మార్పుల కోసం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతోంది? లాంటి అంశాలపై అనర్గళంగా మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ స్పీచ్ లో ప్రధాన అంశాలివే..

మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైంది. 1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం (Central Govt) గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు నడుమ నడుమ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. “ఇంకెక్కడి తెలంగాణ” అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైంది.

అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యావంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్థులూ, మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైంది. ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ నేడు పదో వసంతంలో (Ten Years) అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటినుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను.

అటు పోరాటంలోనూ, ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తినీ, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషినీ మననం చేసుకుందాం. దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశదిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం. తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రజల ఆశయం జయించి, 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తుచేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే. అంతటా అలుముకున్నది గాఢాంధకారమే. అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం. తెలంగాణ (Telangana) ఏయే రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షా పూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. ‘‘తెలంగాణను పునరన్వేషించుకోవాలి, తెలంగాణను పునర్నిర్మించుకోవాలి’’ అనే నినాదంతో ముందడుగు వేసింది.తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలను రూపకల్పన చేసుకున్నది.

తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు ప్రణాళికలు, మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం. 2014 జూన్ 2న పరేడ్ గౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొక వాగ్దానం చేశాను. తెలంగాణ రాష్ట్రాన్నిచూసి దేశం నేర్చుకొనే విధంగా, భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు. ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేళ్ళ అనతికాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసింది.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేళ్ళ కాలం వృధాగానే పోయింది. ఇక మిగిలిన ఆరేళ్ళ స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది.
ఇప్పుడు ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకుంటున్నది. అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణమని సవినయంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దింది. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాదు, ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాలపట్ల ఆకర్షితులై, తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మనకు ఎంతో గర్వంగానూ ఆనందంగానూ అనిపిస్తున్నది.

‘‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’’ అనే నినాదంతో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగింది. పదేళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచింది. 2014లో రాష్ట్ర జీఎస్.డి.పి విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్.డి.పి 12,93,469 కోట్లకు పెరిగింది. అంటే కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, దశాబ్ది ముంగిట నిలిచింది తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయి. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి, ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది. ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడుభూములన్నీ తరిభూములైనాయి. మిషన్ భగీరథ తెలంగాణ తాగునీటి వ్యథలకు చరమగీతం పాడింది. వృత్తి పనులవారికి ఆర్ధిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగినాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయి. ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేకరంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వృత్తి పనుల వారికి ఆర్ధిక ప్రేరణ
దశాబ్ది ఉత్సవాల కానుకగా బి.సి కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందిస్తున్నామని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నా. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది.
అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుంది.

పోడు భూములకు పట్టాలు
తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నది. జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది.

పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తుంది.

24 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానివెనుక ఉండేది మానవీయ కోణమే. పేదలు అనుభవించే ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగానే ప్రభుత్వం యొక్క ప్రతి ప్రయత్నమూ కొనసాగుతున్నది. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం కోసం, గర్భస్థశిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నది.
ఇప్పటికే ఈ పథకం 9 జిల్లాల్లో ప్రారంభమై మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

గృహలక్ష్మి పథకం ప్రారంభం
సొంతస్థలం ఉండి కూడా ఇళ్ళు నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళల పేరిట అమలు చేసే ఈ పథకాన్ని జూలై నెలలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలను మూడు దశల్లో అందించడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నది.

ఉద్యమంలా దళితబంధు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో “దళితబంధు” అనే విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని నూరుశాతం గ్రాంట్ గా అందిస్తున్నది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. ఈ ధనంతో దళితులు తమకు నచ్చిన, ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని, ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నది.
దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకూ 50 వేల మంది లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించుకున్నం. రెండవ విడత లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందించుకుంటున్నం. హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు పరిచాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి ప్రస్తుతం అందిస్తున్నాం. దళితులు పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత ముందుకువచ్చి ప్రగతి సాధించాలన్నది నా ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా లాభసాటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులలో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నది. ఫర్టిలైజర్ షాపుల కేటాయింపులో, హాస్పిటల్ హాస్టల్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలవుతున్నది. ఇటీవల రాష్ట్రంలో కేటాయించిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. దళితుల గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకూ విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా ఖర్చుగాని పక్షంలో ఈ చట్టంప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది.

మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ. తెలంగాణ భూ భౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాళాల్లా తయారయినాయి. చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయగా నేను స్వయంగా నామకరణం చేసాను. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలను పటిష్టపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, పూడిక తొలగించిన ఫలితంగా నేడు రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిపోయింది. 5,350 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతోపాటు, విరివిగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. ఫలితంగా, నేడు దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల వరి సాగు అయితే.. అందులో 56 లక్షల ఎకరాలు యాసంగిలో తెలంగాణలోనే సాగు అయ్యింది. నేడు దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉబికిఉబికిపైకి వస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.

సురక్షిత జలాల మిషన్ భగీరథ
మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు ఇవ్వలేకపోతే, బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే కడగండ్లను నివారించకుంటే, నేను ప్రజలను ఓట్లు అడగనని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే నేను ప్రతిజ్ఞ చేసిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాను. నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను. ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ అట్టడుగు స్థానంలో ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. మనం ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్రప్రభుత్వం “హర్ ఘర్ జల్ యోజన” అనే పథకాన్ని అమలుచేస్తోంది కానీ అదింకా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ భగీరథ నీటిని పరీక్షలు నిర్వహించి రూపొందించిన వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం… ఒక్క తెలంగాణలోనే 99.95 శాతం నల్లానీళ్లలో కలుషిత కారకాలు లేవని నిర్థారించింది. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డుల తో సహా, పలు అవార్డులు, ప్రశంసలు మిషన్ భగీరథకు లభించాయి. ఇప్పుడు తాగునీటి కోసం మండుటెండలో బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్ళకుమైళ్ళ దూరం నడిచే దృశ్యాలు లేవు, ఖాళీ బిందెలతో ప్రజల ధర్నాలు లేవు, ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఫ్లోరోసిస్ బారినపడి ప్రజలు వికలాంగులుగా మారిన దృశ్యాలు మచ్చుకు కూడా నేడు కానరావు. నేడు రాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నది కేంద్రంతో సహా అందరూ అంగీకరించిన వాస్తవం.

విద్యుత్తు విజయం
అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవికాదు. జనజీవితంలో జనరేటర్లు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. పటాకల వలె ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఆవరించి ఉండేది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధురమవుతుందని, తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. శాపనార్ధాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది. తెలంగాణ రైతుకు కరెంటు లేక నీళ్ళు ఆగిపోతాయనే రంది లేదు. మోటర్ కాలిపోతదన్న భయం లేదు. చివరి మడి దాకా తడి ఒక్కతీరుగ అందుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తుంటే దశాబ్దిలో అడుగుపెడుతున్న పసికూన తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు. అందుకే ఇవాళ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడది 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగాం. రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది.

తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ పెంచుకున్నది. పంపిణీలో నష్టాలను నివారించుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్దా నుంచి హైదరాబాద్ కు 765 కె.వి. డీసీ లైను నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య పి.జి.సీ.ఐ.ఎల్. ఆధ్వర్యంలో కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది. రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి 1800 మెగావాట్ల విద్యుత్తును అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్.జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకున్నది.. త్వరలోనే ఈ ప్లాంట్ ఫలితాలు మనకు అందనున్నాయి. ఉత్పత్తితోపాటు సరఫరాను మెరుగు పరచడంలో కూడా తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 22,502 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. నేడు తలసరి విద్యుత్తు వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందున్నది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 69 శాతం ఎక్కువ.

సాగునీటి రంగంలో స్వర్ణయుగం
తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప, తెలంగాణ పొలాలకు ఏనాడూ సాగునీరు లభించలేదు. తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలుకా ఎడారీ అని దీనంగా పాడుకున్న పాటల సాక్షిగా.. తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చితీరాలనే పట్టుదల ఉద్యమకాలం నుంచే నా మనసును ఆవహించింది. సాగునీటి రంగంలో సాధించ వలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, నాగార్జు సాగర్, నిజాంసాగర్, శ్రీరాం సాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునికీకరించడం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకొని, పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగింది. సమైక్య రాష్ట్రంలో మూలకుపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేసింది. దీంతో వలసల జిల్లాగా పేరుబడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతున్నది. గతంలో పొట్ట చేతబట్టుకొని వలసవెళ్ళిన జనం సొంత ఊళ్లకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాసాను. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతం పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 20లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి కేవలం మూడున్నరేళ్ళ స్వల్ప కాలంలో పూర్తిచేసారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20 కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. తెలంగాణ ఏర్పడిన తొలిదశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసన సభలో నేనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను. ఈ విధానం ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల, సుఫల, సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతోంది. రాష్ట్రంలో 1 కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుంది.

పండుగ వలె సాగుబడి.. భూమికి బరువయ్యేంత దిగుబడి
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతుబిడ్డది తీరని దుఃఖం. ఆనాటి బాధలు గుర్తొస్తే ఇప్పటికీ కడుపు తరుక్కు పోతుంది. సాగునీరు లేదు. విద్యుచ్ఛక్తి లేదు, ఎండిన బోర్లు, బీటలు వారిన పంట పొలాలు ఒకవైపు, మరోవైపు పంట పెట్టుబడి లేక, అప్పులపాలై, దళారుల చేతిలో చితికిపోయి, గతిలేక, దిక్కుతోచక దీనులైన రైతులు విధిలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో వారి కుటుంబాలకు తీరని దుఃఖం మిగిలింది. ప్రభుత్వం అందించే అరకొర సాయంకోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న అపవాదును కూడా తెలంగాణ రైతుబిడ్డ ఆనాడు భరించవలసి వచ్చింది. నేనూ ఒక రైతుబిడ్డనే. రైతులు ఎదుర్కొంటున్నఈ కష్టాలు,నష్టాలు నా స్వానుభవంలో ఉన్నవే. అందుకే, ఒక రైతు బిడ్డగా ఆలోచించి సాగునీరు ఒక్కటే అందిస్తే సరిపోదని, రైతుకు పెట్టుబడి సాయం కూడా అందించినప్పుడే సాగు సుసాధ్య మవుతుందని ఆలోచించాను. రైతు సంక్షేమం దిశగా ఎవరూ కలలో కూడా ఊహించని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రం ఆవిర్భవించిన వెనువెంటనే రైతును తక్షణం ఆదుకోవాలి, వారిలో భరోసా నింపాలి, వ్యవసాయం దండగకాదు పండగని నిరూపించాలనే పట్టుదలతో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి, లక్ష్య సాధనలో సఫలీకృతమైంది.

రైతుకు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని 2018లోనే ప్రారంభించుకున్నం. ఈ పథకం ప్రవేశపెట్టి ఇప్పటికి ఐదేళ్ళు పూర్తయింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ పది విడతల్లో 65 లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా 65 వేల కోట్ల రూపాయలకు పైగా నగదు జమచేయడం ఎవరూ ఊహించని చరిత్ర. భూరికార్డులను డిజిటలైజ్ చేయడం వల్ల రైతుల భూముల వివరాలపై వచ్చిన స్పష్టత ఆధారంగా రైతుబంధు నగదును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపించగలుగుతున్నది. దేశంలో ఏ రాష్ట్రమూ రైతులకు ఇంత భారీగా పెట్టుబడి సాయం అందించలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ పథకం వ్యవసాయం దిశను, రైతుదశను మార్చివేసింది. ఇప్పుడు పంట పెట్టుబడి కోసం రైతు ఎదురుచూడాల్సిన పనిలేదు. తల తాకట్టుపెట్టి అధికవడ్డీల అప్పుకోసం చెయ్యిచాచాల్సిన అవసరం లేదు. పంటలు వేసే తరుణంలోనే ఎకరానికి 10 వేల రూపాయల వంతున రెండు విడతలలో క్రమం తప్పకుండా రైతు బంధు సాయం అందివస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా రైతు సోదరులకు పెట్టుబడి నిధులను సమకూర్చిన ఘనత తెలంగాణా ప్రభుత్వానికే దక్కింది. రైతుబంధు పథకం కేంద్ర పాలకుల కళ్ళను సైతం తెరిపించింది. వాళ్లు కూడా మన రైతుబంధు పథకాన్ని అనుసరించక తప్పలేదు. ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల క్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తలకెత్తుకున్నది. విధివశాత్తూ ఒక రైతన్న తనువు చాలిస్తే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏమిటి ? అప్పటివరకూ అన్నదాతగా ఉన్న ఆ కుటుంబం అన్నమో రామచంద్రా అని వీధిపాలు కావల్సిందేనా? ఈ దిశలో గత ప్రభుత్వాలేవీ ఆలోచించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది.
ఏ కారణంచేతనైనా సరే రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తున్నది. అరగుంట భూమి ఉన్న రైతుకూడా ఈ బీమాకు అర్హుడేనని ప్రభుత్వం విస్పష్టంగా నిర్దేశించింది. బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని వందశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

Also Read: Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!

Follow us