Paddy Politics: తెలంగాణ లో వడ్ల రాజకీయం వెనుక అసలు కథ ఇది?

రైతు పక్షపాతులం అని ప్రకటనలు. రైతుల కోసమే సంక్షేమ కార్యక్రమాలంటూ ఆర్భాటాలు. కానీ అదే అన్నదాత.. తన పంట అమ్ముడుపోక కన్నీరు పెడుతుంటే మాత్రం.. ఎవరికీ ఎందుకు పట్టడం లేదు? తెలంగాణలో వరి సాగు పెరిగింది.

  • Written By:
  • Updated On - March 27, 2022 / 11:42 AM IST

రైతు పక్షపాతులం అని ప్రకటనలు. రైతుల కోసమే సంక్షేమ కార్యక్రమాలంటూ ఆర్భాటాలు. కానీ అదే అన్నదాత.. తన పంట అమ్ముడుపోక కన్నీరు పెడుతుంటే మాత్రం.. ఎవరికీ ఎందుకు పట్టడం లేదు? తెలంగాణలో వరి సాగు పెరిగింది. అందుకే ధాన్యం ఉత్పత్తి పెరిగింది. కోటి ఎకరాల మాగాణి కల నెరవేరినట్టే అనుకున్నారు. కానీ ఇప్పుడు అవే వడ్లు అమ్ముడుపోక రైతు దిక్కులు చూస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరిసాగు పెరిగింది. 2020-21 రబీ లో వరి విస్తీర్ణం 235 శాతం పెరిగింది. మామూలుగా అయితే రబీలో 23-30 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుంది. కానీ అది కిందటి సీజన్ లో దాదాపు 55 లక్షలకు చేరింది. తరువాత మొన్నటిసారి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడిచిన వివాదం వల్ల రైతులు కొంతమేర నష్టపోయారు.

ఈసారి ఎందుకైనా మంచిదని రాష్ట్ర ప్రభుత్వమే.. వరిసాగును తగ్గించమని చెప్పింది. దీంతో వరిసాగు 36 లక్షల ఎకరాలకు పడిపోయింది. గణనీయంగా సాగు తగ్గినా.. ఇంకా వడ్లలో మిగులు ఉంది. ఎందుకంటే తెలంగాణ రోజూ మూడు పూటలా అన్నమే తిన్నా.. రాష్ట్రానికి కావలసింది దాదాపు 70 లక్షల టన్నులే. కిందటి సీజన్ లో ఈ ఉత్పత్తి కోటి టన్నులు దాటిపోయింది. ఇప్పుడైతే ఇంకా మార్కెట్ లోకి వస్తోంది. ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు కూడా పూర్తవుతాయి. అంటే చేతికొచ్చే పంట ఇంకా పెరుగుతుంది. దీనివల్ల వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సహజంగానే ఒత్తిడి పెరిగింది. కానీ కేంద్రమేమో ముడిబియ్యం మాత్రమే కొంటామంటోంది. ఆఖరికి రాష్ట్ర మంత్రులు వెళ్లి సమస్యను వివరించినా సరే.. కేంద్రం మాత్రం నిబంధనల మేరకు నడుచుంటామని తేల్చి చెప్పేసింది. మరి రైతుల పరిస్థితి ఏమిటి? వారి వడ్లను కొనేదెవరు?

వరి పంట సాగు చేసిన భూమిలో మరో పంటను వెంటనే వేయడం కష్టం. వరి సాగు.. నీళ్లు నిల్వ ఉండేలా భూమిని మార్చేస్తుందంటున్నారు నిపుణులు. వీటిలో ఇతర పంటలు పండించాలంటే కొంత కాలం పడుతుంది. అప్పటివరకు సాగు కష్టమవుతుంది. అలా పంట మార్పిడి జరిగేవరకు రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రైతులు మళ్లీ వరినే సాగు చేశారు.

1995లో పౌరసరఫరాల వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల వరి సేకరణ వికేంద్రీకరణ జరిగింది. దీంతో అప్పటివరకు పంజాబ్, హర్యానా నుంచి మాత్రమే బియ్యాన్ని సేకరించే విధానం మారింది. ఇక రాష్ట్రాలే వడ్లు సేకరించాలి. వారి అవసరాలకు పోను.. మిగిలింది కేంద్రానికి పంపించాలి. ఇప్పటికే కేంద్ర గోడౌన్లలో అవసరానికి మించి బియ్యం నిల్వలు ఉన్నాయి. దీనివల్ల ఉచిత రేషన్ బియ్యం పథకం అయిన.. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. ఇప్పుడు మాత్రం నిబంధనలు ప్రకారం మాత్రమే బియ్యాన్ని సేకరిస్తామంటోంది కేంద్రం. కానీ దీనిపై రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు.

వరి పంటమీద లభించే రాయితీ వేరే పంట మీద రాదు. ఎందుకంటే పంజాబ్ లో ఎకరాకు దాదాపు 29వేల రూపాయిల సబ్సిడీని అందిస్తున్నారు. అదే తెలంగాణలో చూస్తే.. సుమారుగా 24 వేల రూపాయిల సబ్సిడీని ఇస్తున్నారు. అందుకే వరిసాగును వదిలివేయడానికి రైతులు అంగీకరించడంలేదు. పర్యావరణం పరంగా చూస్తే.. వరి సాగును తగ్గించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. రైతుల బాధను అర్థం చేసుకునేదెవరు?

తెలంగాణ ఏర్పాటు తరువాత 2014-2020 మధ్యలో సాగునీటి లభ్యత పెరిగింది. దీంతో ఎక్కువమంది వరి సాగుకు మొగ్గు చూపారు. దీనికి ఉచిత విద్యుత్ సరఫరా కూడా కలిసొచ్చింది. అందుకే 2020 రబీ సీజన్లో భారత ఆహార సంస్థ సేకరించిన మొత్తం 83 లక్షల టన్నుల వరి ధాన్యంలో 63 శాతం.. అంటే 52.23 లక్షల టన్నుల వరి ఒక్క తెలంగాణ నుంచే వచ్చింది. మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 37 శాతం వరిని సమకూర్చాయి. దీనిని బట్టి చూస్తే.. దేశానికే అన్నపాత్రగా తెలంగాణా మారింది.

రైతుల బాధలు రైతులకు ఉన్నాయి. వర్షాలు పడితే.. ధాన్యం తడిచి మొలకలు వస్తాయి. వర్షాల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరిగితే.. ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే.. 17 శాతం కన్నా ఎక్కువ తేమ ఉంటే ఆ ధాన్యాన్ని కొనబోమని అధికారులు అంటారు. మరి రైతులేం కావాలి. ప్రస్తుతానికి ఎండాకాలం కాబట్టి ఈ సమస్య లేకపోయినా.. సీజన్ వారీ సమస్యలు ఎలాగూ తప్పవు.

దేశంలో ఆహార భద్రతా చట్టం ప్రకారం.. కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. అంటే ఎఫ్.సి.ఐ. ఏడాదికి రెండుసార్లు యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తుంది. దీని ప్రకారం కొనుగోళ్ల ప్రక్రియ ఉంటుంది. కానీ ఈసారి వడ్లను కొనాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చెబుతున్నా.. కేంద్రం మాత్రం బియ్యమే కొంటామంటోంది. కిందటిసారీ ఇదే సమస్య ఎదురవ్వడంతో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధర్నాచౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను కానీ కొనకపోతే రైతుల పరిస్థితి ఏమిటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. నిజానికి కిందటి సీజన్ లోనే ఇలాంటి దుస్థితి ఎదురవ్వడంతో.. యాసంగిలో మళ్లీ సేమ్ ప్రాబ్లమ్ రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తపడతాయిలే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సో.. ఇప్పుడు పంటను ప్రైవేటు మిల్లర్లు కొంటారని అనుకున్నా.. వారు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం కష్టం. పైగా ధర కూడా చాలావరకు తగ్గించేస్తారు. దీనివల్ల రైతులు దారుణంగా నష్టపోయే ప్రమాదముంటుంది. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరముంది.