Site icon HashtagU Telugu

Hyderabad City Metro: హైదరాబాద్ `మెట్రో` ప్ర‌యాణం న‌ర‌కం

Hyderabad Metro Trains

Metro

హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైళ్లు (Metro Trains) ఫ్రీక్వెన్స్ స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో ప్ర‌యాణీకుల‌కు న‌ర‌కం క‌నిపిస్తోంది. ఊపిరాడ‌నంత ర‌ద్దీ ఉండ‌డం కార‌ణంగా ప్ర‌యాణం న‌ర‌కాన్ని త‌ల‌పిస్తోంది. మెట్రో రైళ్లతోపాటు స్టేషన్లో (Railway Stations) నిల‌బ‌డేందుకు కూడా జాగా లేకుండా ఉంది. మెట్రో కోచ్‌ల్లో (Metro Coach) కాలు తీసి కాలు పెట్టలేనంత భ‌యాన‌క ర‌ద్దీ క‌నిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో కొంత రద్దీ తక్కువగా ఉంటున్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో ప్ర‌యాణం న‌ర‌కంగా మారింది.

నగరంలోని ఎల్‌బీనగర్‌ – మియాపూర్‌, జేబీఎ్‌స – ఎంజీబీఎస్‌, నాగోలు – రాయదుర్గం కారిడార్ల పరిధిలో రోజుకు వెయ్యి సర్వీసులను నడిపిస్తుండగా, 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నవంబర్‌ 28న 4.40 లక్షల మంది ప్రయాణించగా, రెండు రోజుల క్రితం 4.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రోవర్గాలు వెల్లడిస్తున్నాయి. మూడు కారిడార్లలో 4-5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తున్నారు. సాయంత్రం సమయంలో కాలేజీలు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న తరుణంలో రైళ్లతోపాటు స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటోంది. మియాపూర్‌, కేపీహెచ్‌బీ, రాయదుర్గం, అమీర్‌పేట్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నాగోలు, ఎల్‌బీనగర్‌ స్టేషన్లలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండగా, మిగతా సమయంలో రద్దీగా ఉంటుంది.

హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైళ్లలో (Metro Trains) పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి.. ఎల్‌అండ్‌టీ అధికారులకు ట్విట్టర్‌ ద్వారా సూచించారు. నిధులను సమీకరించి తగిన ఏర్పాట్లను చేయాలని చెప్పారు. ప్రైవేట్‌, పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) మోడల్‌లో నిర్మించిన మొదటి దశ ప్రాజెక్టులో కిలోమీటరుకు ఒక స్టేషన్‌ చొప్పున మొత్తం 57 స్టేషన్లు నిర్మించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో సుమారు 800 మీటర్ల పొడవునా ప్లాట్‌ఫారంలు కట్టారు. ఆరు కోచ్‌లు నిలిచే విధంగా నిర్మాణం జరగడంతో అదనపు బోగీలు పెంచితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. కాగా, పెరిగిన ప్రయాణికుల నేపథ్యంలో కోచ్‌లను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Also Read:  Hormone : బెల్లీ ఫ్యాట్‌ పెరుగుతుందంటే ఈ హార్మోన్‌ ఎక్కువగా ఉన్నట్లే..!

Exit mobile version