Whatsapp Calls: వాట్సాప్ కాల్స్ కూ ఛార్జీలు రాబోతున్నాయా?

వాట్సాప్ త్వరలో వీడియో కాల్‌లను నియంత్రించాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి అప్పగించినట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 07:30 AM IST

ఇంట‌ర్నెట్ విప్లవం పుణ్యమా అని ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ చేరింది.

ఇదే క్రమంలో వాట్సాప్ వినియోగం రాకెట్ వేగంతో పెరిగింది. వాట్సాప్ వీడియో, ఆడియో కాలింగ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా జూమ్ అయింది.

సామాన్య ప్ర‌జ‌లూ ఈ స‌దుపాయాన్ని విప‌రీతంగా ఉప‌యోగిస్తున్నారు. ఇక వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ లో ఉన్న ఉద్యోగులు వీటి ఆధారంగానే ముందుకు సాగుతూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా వీటి మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి. ఈ త‌రుణంలో వీటిపై కేంద్ర సర్కారు క‌న్ను ప‌డింది. త్వ‌ర‌లోనే వాట్సాప్ వీడియో కాల్స్ ను రెగ్యులేట్ చేయ‌డానికి యోచిస్తోంది.ఈ పనిని టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి కేంద్ర సర్కారు అప్పగించిందని టాక్.

ఏం చేస్తారు ? చార్జీల సంగతేంటి?

ఇప్ప‌టి వ‌ర‌కూ ట్రాయ్ రెగ్యులేట‌రీ పరిధిలో టెలికాం కంపెనీలున్నాయి. టెలికాం కంపెనీలు ఎలాగైతే ట్రాయ్ కు లైసెన్స్ ఫీజులు చెల్లిస్తూ ఉన్నాయో.. ఇదే త‌ర‌హాలో వాట్సాప్ వీడియో కాలింగ్ టూల్ పై లైసెన్స్ ఫీజు వసూలు చేసే ఛాన్స్ ఉంది. వాట్సాప్ వీడియో కాలింగ్ టూల్ కు లైసెన్స్ ఫీజును కడితే ఊరుకుంటుందా? దాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈక్రమంలో ప్రతినెలా వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ కోసం సబ్ స్క్రిప్షన్ ఛార్జీని నిర్ణయిస్తుంది. ఇవి నెల, మూడు నెలలు, 6 నెలలు, 12 నెలలు లెక్కన ఉండొచ్చు.వాట్సాప్ తో పాటు గూగుల్ ద్యుయో, ఐమో, సిగ్నల్ వంటి ఇతరత్రా వీడియో కాలింగ్ సేవలను అందించే కంపెనీలు కూడా ఈవిధంగా చార్జీలను వసూలు చేసే శకం మొదలు కావచ్చు.

కారణం ఇది..

ఇంటర్నెట్‌ కాలింగ్‌ విషయంలో టెలికాం ప్రొవైడర్లకు వర్తించే నియమాలే కమ్యూనికేషన్‌ యాప్స్‌నకూ వర్తింపజేయాలని టెలికాం సంస్థలు ఎప్పట్నుంచో ప్రభుత్వానికి కోరుతున్నాయి. తమ లాగే లైసెన్స్‌ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా 2016-17 సంవత్సరంలో నెట్‌ న్యూట్రాలిటీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన వేళ టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్‌ కాలింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయినా ప్రభుత్వం ఆయా యాప్స్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

అప్పుడు వద్దని.. ఇప్పుడు కావాలని..

వాట్సాప్‌, సిగ్నల్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌తో చేసే ఇంటర్నెట్‌ కాలింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీటిని నియంత్రించే విషయంలో నిబంధనలను రూపొందించేందుకు అభిప్రాయాన్ని వెల్లడించాలని టెలికాం నియంత్రణ సంస్థ ని టెలికాం విభాగం అభిప్రాయం కోరింది. గతంలో ఇదే విషయంపై ట్రాయ్‌ కొన్ని సిఫార్సులు చేసింది. ఆయా యాప్స్‌ ఇంటర్‌ యూసేజ్‌ ఛార్జీలు చెల్లించాలని ట్రాయ్‌ పేర్కొంది. అయితే, ఆ సిఫార్సులను డాట్‌ పక్కనపెట్టింది. అనంతర కాలంలో ఈ ఛార్జీల భారం నుంచి టెలికాం కంపెనీలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పుడు మళ్లీ డాట్‌ దృష్టి పెట్టడం ఆసక్తిగా మారింది. సాంకేతిక దుర్వినియోగం అవుతోందన్న కారణంతోనే డాట్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రాయ్‌ నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ఏం చేయబోతోందన్నది ఆసక్తిగా మారింది.