5G Farming: ఫ్యూచర్ అగ్రికల్చర్ : వ్యవసాయానికి 5జీ రెక్కలు!!

5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాధ్యమైనంత త్వరగా దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు షురూ అవుతాయి.

  • Written By:
  • Updated On - July 24, 2022 / 11:18 PM IST

5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాధ్యమైనంత త్వరగా దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు షురూ అవుతాయి. వీటివల్ల వ్యవసాయ రంగం రూపురేఖలు కూడా మారబోతున్నాయి. అగ్రికల్చర్ కు టెక్ రెక్కలు రానున్నాయి. ఈ టెక్నాలజీని రైతులు పొలంలో వినియోగించేలా దోహదపడే కీలక అస్త్రంగా 5జీ మారనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనలిటిక్స్..

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. వ్యవసాయ రంగం కోసం హైటెక్ యంత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లతో పంటచేలను త్రీడీ ఫొటోలు తీయొచ్చు. ఆ చిత్రాలను సెన్సార్లతో పరీక్షించి మొక్కల ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. చీడపీడలను స్పష్టంగా గుర్తించే వీలుంటుంది. అలాగే, ఆ మొక్కలకు ఎలాంటి పోషకాలు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సాంకేతికత రానున్న కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
పారిశ్రామిక, సాంకేతిక సేవల రంగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనలిటిక్స్… వ్యవసాయ రంగం లోనూ కీలకంగా మారుతున్నాయి.

రోబో ఫార్మర్స్..

వ్యవసాయంలోకి రోబో ‘రైతులు’ ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు రోబోల పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. రోబోలు పొలంలో కలుపు మొక్కలను గుర్తించి, తొలగించడం మొదలుకుని.. పంట కోత వరకు అన్ని పనులూ చేయగలవని నిపుణులు అంటున్నారు.
ఈ రోబోలు పంట పొలాల్లో తిరుగుతూ తన కెమెరాలతో మొక్కలను చిత్రీకరిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ ఫొటోలను విశ్లేషించి మొక్కల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తాయి.ఇవి అందుబాటులోకి వస్తే రైతు పొలానికి వెళ్లాల్సిన పనుండదు. ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్‌తో కమాండ్ ఇచ్చి రోబోలతో పంటలను పర్యవేక్షించొచ్చు.

వర్చువల్ రియాలిటీ

వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఒక మొక్కలోని ప్రతి అణువణువునూ పరీక్షించి, దాని ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడే వీఆర్ సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో చాలా అగ్రి టెక్ కంపెనీలు నిమగ్నం అయ్యాయి.

పుప్పొడి రేణువులను చల్లే డ్రోన్లు

మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా తేనెటీగలు, సీతాకోక చిలుకల్లాంటి ఎన్నో కీటకాలు అంతరించి పోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట దిగుబడుల మీద తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. పంట చేల మీద 10 అడుగుల ఎత్తులో తిరుగుతూ పుప్పొడి రేణువులను చల్లే డ్రోన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 15 నుంచి 20 లీటర్ల ట్యాంకులతో పంటలపై ఎరువులను, పురుగుమందులను పిచికారీ చేసే డ్రోన్లు కూడా రెడీ అవుతున్నాయి.