Death and Technology: చనిపోయాకా.. 6 గంటలు గుండె, మెదడును యాక్టివ్ గా ఉంచే టెక్నాలజీ!!

మరణం.. మనిషికి అంతు చిక్కని మిస్టరీ!! ఎంత అంతరిక్ష రహస్యాలను మానవుడు తెలుసుకోగలుగుతున్నా.. మరణ రహస్యాన్ని మాత్రం ఛేదించలేక పోతున్నాడు.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 07:45 AM IST

మరణం.. మనిషికి అంతు చిక్కని మిస్టరీ!! ఎంత అంతరిక్ష రహస్యాలను మానవుడు తెలుసుకోగలుగుతున్నా.. మరణ రహస్యాన్ని మాత్రం ఛేదించలేక పోతున్నాడు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ రహస్యాల గుట్టు విప్పే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో అతికొద్ది మేర పురోగతి కూడా సాధించగలిగాడు. తాజాగా అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త విప్లవాత్మక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్ లో వైద్య రంగానికి టర్నింగ్ పాయింట్ గా మారనుంది. అదే.. “ఆర్గాన్ ఎక్స్ టెక్నాలజీ” (OrganEx technology)!!

ఏమిటీ “ఆర్గాన్ ఎక్స్ టెక్నాలజీ”..

మనిషి మరణించగానే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల కొత్త జ్ఞాపకాలు ఉండవు. పాత జ్ఞాపకాలు నిలువవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. ఇలా మెదడులోని కణాలు మరణించే ప్రక్రియను ఎంతసేపు ఆపగలిగితే.. అంతసేపు హృదయ స్పందనలను కొనసాగించే వీలు ఉంటుంది. మెదడులోని కణాలు మరణించే కొద్దీ… మెదడు, గుండెలోని కణాలు, రక్త నాళాల్లో వాపు రావడం మొదలవుతుంది. రక్త నాళాలు పని చేయడం ఆగిపోతుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో చనిపోయిన వారి గుండెలోని రక్త ప్రసరణ వ్యవస్థను దాదాపు 60 నిమిషాల పాటు సజీవంగా, యాక్టివ్ గా ఉంచొచ్చు. సరికొత్త “ఆర్గాన్ ఎక్స్ టెక్నాలజీ” ద్వారా చనిపోయిన వారి గుండెలోని రక్త ప్రసరణ వ్యవస్థను దాదాపు 6 గంటల పాటు సజీవంగా, యాక్టివ్ గా ఉంచగలిగారు. పందులపై
యేల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.”ఆర్గాన్ ఎక్స్ టెక్నాలజీ” ద్వారా గుండె, మెదడులోని కణాలు, అణువులను తిరిగి మేల్కొలప వచ్చు. వాటిని తిరిగి చైతన్యవంతం చేసి, కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభించే శక్తిని అందించవచ్చు.

అవయవ దానానికి..కొత్త వేగం

“ఆర్గాన్ ఎక్స్ టెక్నాలజీ” భవిష్యత్ లో అవయవ మార్పిడి వైద్య విభాగాన్ని బలోపేతం చేయనుంది. చనిపోయిన వారిలో మెదడు, గుండె ఎక్కువ సమయం పాటు యాక్టివ్ గా ఉండేలా చేసేందుకు దోహదం చేయనుంది. తద్వారా సుదూర ప్రాంతాల నుంచి అవసరమైన చోట్లకు అవయవాలను తరలించేందుకు తగినంత సమయం లభిస్తుంది. అవయవ దానంతో ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయి. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “జర్నల్ నేచర్” లో ప్రచురితం అయింది.