AIIMS Server Hack : ఎయిమ్స్ స‌ర్వ‌ర్లు హైజాక్‌, రంగంలోకి యాంటీ టెర్రర్ ఏజెన్సీ, ఎన్ఐఏ!!

ప్ర‌తిష్టాత్మ‌క ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స‌ర్వ‌ర్ల మీద భారీ సైబ‌ర్ నేర‌గాళ్లు హైజాక్ చేశారు.

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 12:42 PM IST

ప్ర‌తిష్టాత్మ‌క ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స‌ర్వ‌ర్ల మీద భారీ సైబ‌ర్ నేర‌గాళ్లు హైజాక్ చేశారు. హాక‌ర్లు క్రిప్టోకరెన్సీ రూపంలో రూ.200 కోట్లు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. సైబ‌ర్ దాడుల ఫ‌లితంగా గ‌త ఆరు రోజులుగా ఎయిమ్స్ సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఆ మేర‌కు అధికారిక వ‌ర్గాలు ధ్రువీక‌రించాయి.

సైబ‌ర్ దాడి కార‌ణంగా మూడు నుంచి నాలుగు కోట్ల మంది రోగుల డేటాపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సర్వర్ డౌన్ కావ‌డంతో ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ , లేబొరేటరీ విభాగాలలో పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్‌గా నిర్వ‌హిస్తున్నారు. ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN), ఢిల్లీ పోలీస్, హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ransomware దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. సైబ‌ర్ నేర‌గాళ్ల‌పై సైబర్ టెర్రరిజం కేసును నవంబర్ 25న ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్ నమోదు చేసింది.
దర్యాప్తు సంస్థల సూచనల మేరకు ఆసుపత్రిలోని కంప్యూటర్లలో ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

AIIMS సర్వర్‌లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్‌లు, న్యాయమూర్తులతోపాటు పలువురు వీఐపీల డేటాను భద్రపరిచారు. ఇంతలో, ఇ-హాస్పిటల్ కోసం NIC ఇ-హాస్పిటల్ డేటాబేస్ , అప్లికేషన్ సర్వర్లు పునరుద్ధరించబడ్డాయి. NIC బృందం AIIMSలో ఉన్న ఇతర ఇ-హాస్పిటల్ సర్వర్‌ల నుంచి ఇన్‌ఫెక్షన్‌ను స్కాన్ చేసి శుభ్రపరుస్తుంది. ఇ-హాస్పిటల్ సేవలను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన నాలుగు భౌతిక సర్వర్లు డేటాబేస్‌లు, అప్లికేషన్‌ల కోసం సిద్ధం చేశారు. అలాగే, AIIMS నెట్‌వర్క్ శానిటైజేషన్ పురోగతిలో ఉంది. సర్వర్‌లు, కంప్యూటర్‌ల కోసం యాంటీవైరస్ మార్గాలను ఎంచుకున్నారు. సుమారు 5,000 కంప్యూటర్ల ఉండ‌గా 1,200 కంప్యూటర్లలో యాంటీ వైర‌స్ ఇన్‌స్టాల్ చేయబడింది. 50 సర్వర్‌లలో ఇరవై వ‌ర‌కు క్లియ‌ర్ చేయ‌డం జ‌రిగింది. యుద్ధ ప్రాతిప‌దిక‌న సైబ‌ర్ అటాక్ నుంచి ఎయిమ్స్ ను కాపాడే ప్ర‌య‌త్నం టెక్కీ నిపుణులు చేస్తున్నారు. ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, లేబొరేటరీ మొదలైన సేవలతో సహా పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్ మోడ్‌లో ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్నారు.