MI vs GT: సూర్యా భాయ్ వన్ మ్యాన్ షో… గుజరాత్ ను చిత్తు చేసిన ముంబై

ఐపీఎల్ ముంబై తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఫస్టాఫ్ లో వరుస ఓటములతో సతమతమై.. సెకండాఫ్ లో చెలరేగి ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్ళడం ఆ జట్టుకు ఎప్పుడూ అలవాటే.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 11:33 PM IST

MI vs GT: ఐపీఎల్ ముంబై తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఫస్టాఫ్ లో వరుస ఓటములతో సతమతమై.. సెకండాఫ్ లో చెలరేగి ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్ళడం ఆ జట్టుకు ఎప్పుడూ అలవాటే. ఇదే అలవాటును 16వ సీజన్ లోనూ రిపీట్ చేస్తోంది. తాజాగా సొంతగడ్డపై మరోసారి భారీస్కోరు సాధించిన ముంబై డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. కీలక మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో గుజరాత్ పై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఆటే హైలైట్. మరోసారి వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడు సూర్యా భాయ్. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ముంబైకి ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. అయితే రోహిత్ 29, ఇషాన్ కిషన్ 31 పరుగులకు వెంటవెంటనే ఔటవడంతో ముంబై కష్టాల్లో పడినట్టు కనిపించింది.

గత మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన వధేరా కూడా త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విష్ణు వినోద్ సపోర్ట్ తో స్కోర్ బోర్డును టాప్ గేర్ లో పరిగెత్తించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 65 పరుగులు జోడించారు. వినోద్ 20 బంతుల్లో 30 పరుగులకు ఔటవగా.. సూర్యకుమార్ మాత్రం తన జోరు కొనసాగించాడు. చివరి మూడు ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్య 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి సిక్సర్ తో శతకం సాధించాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. స్కై జోరుతో ముంబై 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ముంబై చివరి 3 ఓవర్లలో 54 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు.

వాంఖేడే స్టేడియంలో ఎక్కువసార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలవడంతో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ తో హోరాహోరీ పోరు ఖాయమని అంతా భావించారు. అయితే ముంబై బౌలర్లు హోంగ్రౌండ్ లో చెలరేగిపోయారు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పైనా చక్కగా రాణించారు. రెండో ఓవర్లోనే సాహా, మూడో ఓవర్లో హార్థిక్ పాండ్యా, నాలుగో ఓవర్లో శుభ్ మన్ గిల్ ను ఔట్ చేసి పట్టుబిగించారు.

తర్వాత విజయ్ శంకర్ కాసేపు మెరుపులు మెరిపించినా చావ్లా బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ , తెవాటియాతో కలిసి ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సాధించాల్సిన రన్ రేట్ క్రమంగా పెరిగిపోతుండడంతో భారీ షాట్లకు ప్రయత్నించిన మిల్లర్ , తెవాటియా ఔటవడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది. అయితే రషీద్ ఖాన్ ముంబైకి చెమటలు పట్టించాడు.

వరుస సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో రషీద్ ఖాన్ ఒంటరి పోరాటం వృథా అయింది. రషీద్ ఖాన్ కేవలం 32 బంతుల్లో 10 సిక్సర్లు , 3 ఫోర్లతో 79 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. గుజరాత్ 191 పరుగులు చేయగలిగింది.ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 3 , పియూశ్ చావ్లా 2, కుమార్ కార్తికేయా 2 వికెట్లు పడగొట్టారు. నిజానికి బ్యాటింగ్ కు పూర్తి అనుకూలంగా ఉండే వాంఖేడే పిచ్ పై ముంబై బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారనే చెప్పాలి. తేమ కూడా ఇబ్బందిపెట్టినా గుజరాత్ బ్యాటింగ్ ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసులో మరోసారి ముందుకు దూసుకొచ్చిన ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. కాగా ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంటుందనుకున్న గుజరాత్ కు ఈ సీజన్ లో ఇది నాలుగో ఓటమి.

Also Read: Cosmic Explosion: ఖగోళంలో భారీ విస్ఫోటనం.. సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు