Sri Lanka Crisis: లంకా ‘దహనం’

అందంగా, ఆనందంగా ఉండే శ్రీలంక ఇప్పుడు భగ్గుమంటోంది. అధికారంలో ఉన్న నేతలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి.

  • Written By:
  • Updated On - May 10, 2022 / 11:24 AM IST

అందంగా, ఆనందంగా ఉండే శ్రీలంక ఇప్పుడు భగ్గుమంటోంది. అధికారంలో ఉన్న నేతలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి. పోలీసులు కూడా స్టేషన్లను వదిలి.. ఇళ్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. ఎలాంటి శ్రీలంక ఇలా ఎందుకు అయిపోయింది. రావణాసురిడి కాలంలో స్వర్ణమయంగా శోభిల్లిన లంక ఎక్కడ? అంతర్గత ఆందోళనలతో అట్టుడికిపోతున్న నేటి శ్రీలంక ఎక్కడ? అసలు ఎక్కడ తేడా జరిగింది? ఎప్పుడు తప్పుటడుగు పడింది? శ్రీలంకను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టేశాయి. అప్పు తీర్చడానికి ఆపసోపాలు పడుతోంది. కానీ ఈలోపే దేశమంతా జరుగుతున్న ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తినడానికి తిండి లేదు.వేసుకోవడానికి మందులు లేవు. తిరగడానికి ఇంధనం లేదు. అసలు ఇంట్లో ఉందామంటే కరెంట్ లేదు. దీంతో లంక వాసుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ప్రస్తుత పాలకులే దీనికి నిదర్శనమంటూ ఆందోళనలకు దిగారు. గతిలేని పరిస్థితుల్లో ప్రధాని రాజపక్సే రాజీనామా చేయాల్సి వచ్చింది.

గత 20 ఏళ్లలో లంక అప్పు 5,630 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇందులో చైనా వాటా 10 శాతం. మన దేశ వాటా 2 శాతం. ఆ దేశ జీడీపీ కన్నా అప్పులు వేగంగా పెరిగాయి. లంకలో విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు కేవలం 231 కోట్ల డాలర్లే ఉన్నాయి. దీనివల్ల పంచదార, చమురు, పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసరాలకు కటకట తప్పలేదు. అమెరికా డాలర్ తో పోలిస్తే.. లంక రూపాయి విలువ ఈ నాలుగు నెలల్లో 50 శాతం తగ్గిపోయింది. అంటే ఒక డాలరును చెల్లించడానికి జనవరిలో 200 శ్రీలంక రూపాయిలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు 300 శ్రీలంక రూపాయిలు ఇవ్వాల్సి వస్తోంది. మన రూపాయి విలువతో పోల్చినా.. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల మధ్య 31.6 శాతం క్షీణించింది. బియ్యం ధర 60 శాతం మేర పెరిగింది. ఉల్లిపాయలు 79 శాతం, బంగాళాదుంప 66 శాతం పెరిగాయి. కోడిగుడ్లు రేటు 93 శాతం పెరిగింది.

దేశ జీడీపీలో 10 శాతానికి పైగా వాటా పర్యాటకానిదే. కానీ, 2019లో బాంబుపేలుళ్లు, తరువాత కొవిడ్ దెబ్బతో లంక పర్యాటకం దెబ్బతింది. దీంతో ఆర్థిక కష్టాలు పెరిగాయి. వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల నిషేధంతో వరి, చెరకు దిగుబడులు దారుణంగా తగ్గిపోయాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 1600 కోట్ల డాలర్లు. 2020లో కేవలం 54.8 కోట్ల డాలర్లు. దీనివల్ల సమస్యలు పెరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంకలో పెట్టుబడులు పెట్టడానికి ఏ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చే అవకాశం లేదు. దీంతో లంకకు ఇప్పట్లో కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావంతో ముడిచమురు, సన్ ఫ్లవర్ నూనె, గోధుమల ధరలు పెరగడంతో వాటిని కొనడానికి లంక కష్టపడుతోంది. మొత్తంగా చూస్తే లంకను అప్పులే ముంచేశాయని అర్థమవుతోంది. దీనికి గత పాలకుల నిర్లక్ష్యంతోపాటు.. ప్రస్తుత పాలకులకు కూడా ముందు చూపు లేకపోవడంతో అప్పుల కుప్ప పెరిగిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. శ్రీలంక దహనం వెనుక ఇలా అనేక కారణాలు ఉన్నాయి.