Income Tax Refund:ఐటీఆర్ ఫైల్ చేసినా ట్యాక్స్ రీఫండ్ రాలేదా? కారణాలివే..

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 11:51 AM IST

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను  చెల్లించేందుకు జులై 31తో గడువు ముగిసింది. 45 రోజులు గడిచిపోయాయి. అర్హులైన ట్యాక్స్ పేయర్స్ కు రీఫండ్ చేసే ప్రక్రియను
ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ప్రారంభించింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు రూ.1.19 లక్షల కోట్ల రీఫండ్ జరిగింది. అంతకుముందు సంవత్సరం కంటే ఇది 65.29 శాతం ఎక్కువ. ఈనేపథ్యంలో ఇంకా రీఫండ్ పొందని వారిని ఎందుకు అలా జరిగింది ? గడువు తేదీలోగా ఐటీ రిటర్న్ ఫైల్‌ చేసినా రీఫండ్‌ ఎందుకు రాలేదు?అనే సందేహాలు ఎంతోమందిని చుట్టుముట్టింది. ఇంకమ్ ట్యాక్స్ విభాగం అధికారిక వెబ్‌సైట్‌ సర్వీసుల ద్వారా రీఫండ్‌ కాకపోవడానికి కారణాలను తెలుసుకోవచ్చు. అక్కడ కనిపించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చు.

అప్పుడు మాత్రమే రీఫండ్..

ఒక వ్యక్తి ITR ప్రాసెస్ అయిన తర్వాతే రీఫండ్‌ అందుతుంది. ఆదాయ పన్ను రిటర్న్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తి రీఫండ్‌కు అర్హులని పన్ను శాఖ నిర్ధారిస్తే, అప్పుడు మాత్రమే రీఫండ్ అందుతుంది. ఆదాయ పన్ను రీఫండ్‌ ఇంకా రాకపోతే, డిపార్ట్‌మెంట్ ఐటీఆర్‌ను ప్రాసెస్ చేసిందో లేదో చెక్ చేయండి.

స్టేటస్‌ చెకింగ్ ఇలా..

ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా అసెస్సీలు ఆన్‌లైన్‌లో ట్యాక్స్‌ రీఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ‘స్టేటస్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ రీఫండ్స్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పేమెంట్‌ మోడ్‌, రిఫరెన్స్ నంబర్, స్టేటస్‌, రీఫండ్‌ స్టేటస్‌ తేదీని తెలియజేస్తూ ఓ మెసేజ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) – tin.tin.nsdl.com ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో కూడా స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

* రీఫండ్‌ ఇష్యూడ్‌

రీఫండ్‌ ఇష్యూ చేసిన పేమెంట్‌ మోడ్‌, రీఫండ్ మొత్తం, రీఫండ్ క్లియరెన్స్ తేదీ వివరాలు కనిపిస్తాయి.

* రీఫండ్‌ ఫెయిల్యూర్‌

రీఫండ్‌ ఫెయిల్యూర్‌ కావడానికి కారణం, కమ్యూనికేషన్ తేదీ, సంబంధిత ఈమెయిల్ ID కనిపిస్తాయి.

* రీఫండ్‌ కెప్ట్‌ ఆన్‌ హోల్డ్‌

అవుట్‌ స్టాండింగ్‌ డిమాండ్‌ స్పందన కోసం ‘రీఫండ్ కెప్ట్‌ ఆన్‌ హోల్డ్‌’ అని చూపిస్తుంది. కమ్యూనికేట్ చేసిన తేదీ, రిజిస్టర్డ్ ఈమెయిల్ ID వివరాలు కనిపిస్తాయి. రీఫండ్ అభ్యర్థన విఫలమైతే, ఆదాయపన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆదాయపన్ను రీఫండ్‌ను తిరిగి జారీ చేయడానికి అభ్యర్థనను అందజేయాలి. ఒకవేళ ‘నో రికార్డ్స్ ఫౌండ్’ అని కనిపిస్తే, పన్ను వాపసు వివరాలను I-T డిపార్ట్‌మెంట్ ఇంకా జారీ చేయలేదని గుర్తించాలి.

* అవుట్‌స్టాండింగ్‌

ట్యాక్సెస్‌ చెల్లించాల్సిన ట్యాక్స్‌ను తప్పుగా లెక్కించిన కారణంగా రీఫండ్‌ అభ్యర్థనను తిరస్కరించి ఉండే అవకాశం ఉంది. చెల్లించాల్సిన అవుట్‌ స్టాండింగ్‌ ట్యాక్స్‌ వివరాలను తెలియజేస్తూ పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వస్తాయి. అలాంటి సమయాల్లో తిరిగి అన్ని పత్రాలను సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది.

* మరోసారి ఫైల్‌ చేసుకొనే అవకాశం

చెల్లించిన ట్యాక్స్‌, చెల్లించాల్సిన ట్యాక్స్‌, రీఫండ్‌ను తిరిగి లెక్కించాలి. మీరు అందజేసిన వివరాలు అన్నీ సక్రమంగానే ఉంటే.. మీరు రీఫండ్‌ కోసం మరోసారి ఫైల్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఏవైనా వివరాలలో తప్పులు దొర్లి ఉంటే.. నిర్ణీత వ్యవధిలోపు బకాయి ఉన్న ట్యాక్స్‌ మొత్తాన్ని చెల్లించాలి.

* ఖాతాకు పాన్‌ లింక్‌ అయిందా? 

బ్యాంకు ఖాతా వివరాలు మారితే.. రీఫండ్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌లోని ప్రాథమిక వివరాలతో ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ సరిపోలాలి. బ్యాంకు ఖాతాలో పేర్కొన్న వివరాలనే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌లోనూ పొందుపరచాలి. PAN బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉందో లేదో తనిఖీ చేయాలి.