Police Complaint : వాట్సాప్ ద్వారా పోలీస్ కంప్లయింట్.. ఎలాగో తెలుసా ?

దేశంలో కొత్త నేర, న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి.

  • Written By:
  • Updated On - July 2, 2024 / 06:00 PM IST

Police Complaint : దేశంలో కొత్త నేర, న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. వీటివల్ల పోలీసుశాఖలో డిజిటల్ టెక్నాలజీ  వినియోగం గణనీయంగా పెరగనుంది. ఇకపై మనం అత్యవసర పరిస్థితుల్లో వాట్సాప్, ఈ-మెయిల్‌ ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఎస్‌ఎంఎస్, సామాజిక మాధ్యమ వేదికలు, వెబ్‌సైట్లు తదితర డిజిటల్‌ రూపంలో కూడా బాధితులు కంప్లయింట్స్ ఇవ్వొచ్చు. వీటిని పోలీసులు తమ జనరల్‌ డైరీలో నమోదు చేస్తారు. ఆ తర్వాత మూడురోజుల్లోగా బాధితుడు పోలీసు స్టేషనుకు వచ్చి కంప్లయింట్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తే ఎఫ్‌ఐఆర్‌‌ను నమోదు చేస్తారు. కంప్లయింట్ చేయదల్చిన వారు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్‌హెచ్‌వో అధికారిక ఈ-మెయిల్, ఫోన్‌ నెంబరుకు ఫిర్యాదును(Police Complaint) పంపిస్తే సరిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join

కేసును నమోదు చేసిన తర్వాత బాధితులకు లేదా ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఫ్రీగా ఇవ్వాలి. కేసు నమోదైన తర్వాత నేర బాధితుడికి 90 రోజుల్లోగా దర్యాప్తు పురోగతిని అధికారులు డిజిటల్‌ రూపంలో పంపించాలి. ఒకవేళ డిజిటల్ రూపంలో ఈ నివేదికను ఇవ్వలేకపోతే.. ఏదైనా ఇతర విధానంలో కచ్చితంగా నివేదికను ఇవ్వాలి. కేసు దర్యాప్తు 90 రోజుల్లో పూర్తికాకపోయినా అప్పటి పరిస్థితి ఏమిటో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి. ఏదైనా కేసులో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయితే..  ఎలక్ట్రానిక్‌ విధానంలో మెజిస్ట్రేటు దగ్గర దాఖలు చేసిన నివేదిక ప్రతిని బాధితులు అందరికీ పంపాలి. దర్యాప్తు అధికారి బాధ్యులపై ఏం చర్య తీసుకున్నారో సమాచారం ఇచ్చిన వ్యక్తికి కచ్చితంగా తెలియజేయాలి.

Also Read :Mangosteen : పండ్లకు రాణి ‘మ్యాంగోస్టీన్’.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్

ఫిర్యాదు తీసుకోకపోతే ఏం చేయాలి?

ఏదైనా అన్యాయం లేదా దాడి లేదా వేధింపు జరిగినప్పుడు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు తప్పకుండా ఫిర్యాదును స్వీకరించాలి. బీఎన్‌ఎస్‌స్‌ సెక్షన్‌ 173 సబ్‌ సెక్షన్‌ ప్రకారం.. పోలీసులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఫిర్యాదును తీసుకోనప్పుడు బాధితుడు నేరుగా న్యాయమూర్తిని కలిసి చెప్పొచ్చు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం జాతీయ స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం.. బాధితులు ఏ రాష్ట్రంలో ఫిర్యాదు చేసినా సంబంధిత పరిధి స్టేషన్​కు దాన్ని పంపుతారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 2 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కొత్త చట్టం చెబుతోంది.

Also Read :UP Stampede : యూపీలో తొక్కిసలాట.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య