World Tribal Day 2023 : నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

ఆదివాసుల బతుకులు నేడు అడవిగాచిన వెన్నెలగా

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 11:23 AM IST

World Tribal Day 2023 : ఆదివాసులు అడవితల్లి ముద్దుబిడ్డలు. అడవితో వీరికి వీడదీయలేని బంధం.. వీరికి అత్యాశ అంటే ఏంటో తెలియదు. అమాయకత్వమే వీరికి తెలుసు.. వేటంటే ప్రాణం ఇస్తారు.. పకృతే వారి దైవం అంటారు.. అడవి జంతువులే నేస్తాలు అంటారు.. అటవీ ఫలాలే జీవనాధారం అంటారు..మా భాషే ప్రత్యేకమంటారు.. విలక్షణమైన వేషధారణే మా సొంతం అంటారు..అలాంటి ఆదివాసుల బతుకులు నేడు అడవిగాచిన వెన్నెలగా మారుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అనేకచోట్ల అడవి బిడ్డలు పురిటి కష్టాలను కూడా దాటడం లేదు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల జీవనస్థితిగతులపై ‘hashtag u ‘ స్పెషల్ స్టోరీ .

క్రీ.శ.1240-1750 మధ్యకాలంలో గొండ్వానా రాజ్యాలను ఏలిన వారు నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ… అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నారు. రోజులు మారుతున్న..ప్రభుత్వాలు మారుతున్న ఆదివాసుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికి చాల ప్రాంతాలలో తినేందుకు తిండిలేక , తాగేందుకు మంచి నీరు , వెళ్లేందుకు సరైన రోడ్డు , ఉండేందుకు గూడులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీరు కోసం మైళ్ల కొద్దీ నడిచి తెచ్చుకునే స్థితిలోనే… ప్రసవం కోసం ఆసుపత్రికి డోలి కట్టుకొని వాగులు , వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిలో వారు ఉన్నారు. ప్రతి ఏటా ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను కేటాయిస్తున్నా అవి మాత్రం ఆదివాసుల చేతికి రావడం లేదు. ఎన్నికల సమయంలో పార్టీల నేతలు వారి దగ్గరికి వెళ్లడం..ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్లడం తప్ప..వారి కష్టాలను తీర్చే వారు లేరు.

అసలు ఆదివాసులు ఎవరు?

అడవులను నమ్ముకుని, ప్రకృతి మధ్య, ఆటవిక వనరులను ఉపయోగించుకుంటూ, ఆ అడవినే దైవంగా భావిస్తూ బ్రతుకుతున్న ఆటవిక జాతులు చాలా ఉన్నాయి. సమాజంలో కుల, మత, వర్గ భేదాలు, ఆర్థిక వ్యవస్థ, అన్నిటికి మించి స్వార్థంగా ఆలోచించడం వల్ల ఇలాంటి ఆటవిక జాతులకు నేటికి సరైన న్యాయం అంటూ జరగడం లేదు. అడవులలో నివసించేవారిని ఆదివాసీలు అంటారు. గిరిజనులైన వీరు సంచారజీవితాన్ని గడుపుతూ ఉన్నచోట అనుకూలమైన వ్యవసాయం చేసుకోవడం, ప్రకృతి వనరుల మధ్య బ్రతకడం, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను దగ్గర్లోని సంతల్లో అమ్మడం చేస్తూ జీవిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు “వంద దేశాలలో” “అయిదు వేల ఆదివాసీ తెగలు” ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఒక్కో తెగ ఒక్కో భాష మాట్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆదివాసీ తెగలు “ఆరువేల ఏడువందల” భాషలు మాట్లాడుతున్నారు. మొత్తంమీద “వీరి జనాభా” చూస్తే సుమారు “నలభై కోట్లకు” పైన ఉంది. ప్రపంచ జనాభాలో వీరి జనాభా శాతం తక్కువే అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచీకరణలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది.

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం (World Tribal Day) ఎలా ప్రారంభమైంది..

1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.

ఆదివాసీల (Tribal ) జీవనశైలి వారి అలవాట్లు, సంప్రదాయాలు :

ఆదివాసీల జీవనశైలి వారి అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలను, వారి హక్కుల్ని కాపాడటం కోసం ప్రతి సంవత్సరం ఆగష్టు 9 వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1993లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలు అయిన తరువాత అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు.

చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి

నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి, అటు నిజాం రాజ్యానికీ, యిటు బ్రిటిషు పరిపాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ‌కి సరిహద్దుగా ఉన్నకృష్ణానదికి ఇరువైపులా వున్న ప్రాంతాల్లో కనిపించేవారు. చెంచులు తెలుగు కూడా మాట్లాడతారు.

ఆదివాసుల కట్టుబొట్టు..

ఆదివాసులు రింగుల జుత్తు, విశాల వదనం, చప్పిడి ముక్కు, పొడవాటి దవడతో పొట్టిగా, నల్లగా ఉంటారు. శరీరాన్ని తమ పూర్వీకులలాగా ఆకులతో చుట్టుకోవడం ఇప్పుడు లేకపోయినా, మగవాళ్ళు గోచీ మాత్రమే పెట్టుకుంటారు. ఆడవాళ్ళు నూలు రవిక, చీర కట్టుకుంటారు.

ఆదివాసుల ఆస్తిపాస్తులు ఇవే ..

విల్లంబులు, ఒక కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని చింకిపాతలు – ఇవి ఆదివాసుల సమస్త ఆస్తిపాస్తులు.

ఆదివాసుల ఆకాశదేవుణ్ణి పూజిస్తారు

ఆదివాసుల వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్న భావనలు బలంగా కనిపిస్తాయి. ఆదివాసుల వేటనూ, అడవి పండ్లనూ ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. హిందువులు పరమాత్మగా పూజించే భగవంతుడిలో కొన్ని లక్షణాలతో సారూప్యం ఉన్న ఒక “ఆకాశదేవుణ్ణి” కూడా ఆదివాసులు పూజిస్తారు. జీవితం దేవుడి వరప్రసాదమేననీ, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడనీ, ఆదివాసులు బలంగా నమ్ముతారు. హిందూ సమాజ సంపర్కం వల్లే ఈ విశ్వాసాలన్నీ ఆదివాసులు ఆలోచనా విధానాల్లోకి ప్రవేశించాయి.

ఆదివాసుల ఆటపాటలు ..

ఆదివాసులు అప్పటికప్పుడే ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వీరి ఆటల్లో సింగి సింగడు ప్రధాన పాత్రధారులు, నాయికా నాయకులు. డప్పుకు తగినట్టుగా గంతులేస్తారు. ఇప్పపువ్వు సారా తాగితే మైమరచి కుప్పిగంతులేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి. ఆదివాసుల కథలు కూడా పూర్వం ప్రసిద్ధి చెందిన జానపద కళల్లో ఒకటి.

ఆదివాసీలు నివసించే ముఖ్య రాష్ట్రాలు..

ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులు.

తెలుగు రాష్ట్రాలలో ఆదివాసులు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే..

ఆదివాసులు ప్రధానంగా నల్లమలలోనే కనిపిస్తారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొంతమంది ఆదివాసులు నివసిస్తున్నప్పటికీ 80 శాతానికిపైగా నల్లమలలోని నాలుగు జిల్లాల అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్నారు.

ఆదివాసుల ముఖ్య పండ‌గ‌లు చూస్తే..

మేడారం సమ్మక్క సారక్క జాతర మ‌రియు ఆదిలాబాద్ నాగోబా జాత‌రల‌ను వీరు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.

అలాగే నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత.

నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగో బా జాతర ఆచార, వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమవుతాయని గిరిజనుల నమ్మకం.

ఆదివాసుల హక్కులు అమల్లోకి రావడం లేదు..

ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో సుమారు 40 కోట్ల మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తించాలని 1994 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్‌ పేర్కొంది. ప్రపంచం నలుమూలలా ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆదివాసీల హక్కులను గుర్తించడానికి మాత్రం ప్రభుత్వాలు నేటికీ నిరాకరిస్తున్నాయి. భారత దేశంలో 10 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు జీవిస్తున్నారు. 700 వందల ఆదివాసీ, 75 ఆదిమ జాతి తెగల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.

ఆదివాసులను అంతం చేయాలనే కుట్ర :

ఉప్పుతో కూడా కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న దిగ్గజ వ్యాపార అధినేతల మనసులో ఆదివాసులు అంతరించిపోతే ఎంతో ఆటవిక భూములు, అక్కడ ఉత్పత్తులతో వ్యారసామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

భారత రాజ్యాంగం 5, 6 షెడ్యూల్‌ ప్రాంత అడవులలో నివసిస్తున్న ఆదివాసీలకు అక్కడి సహజ వనరులపై హక్కు కల్పించింది. ఆదివాసీలకు, గ్రామ సభలకు సర్వ అధికారాలు కల్పించింది. అయితే ఆదివాసీ ప్రాంతంలో అటవీ భూముల కోసం, ఆ భూముల్లో ఖనిజాల కోసం, ఇతర ఉత్పత్తుల కోసం, విలువైన కలప కోసం ఆశపడి పూర్తిగా ఆదివాసులని అంతం చేయాలని నేటి సమాజం ప్లాన్ చేస్తుంది.

ఆదివాసీ ప్రాంతంలో ప్రవేట్‌ బడా సంస్థల ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులపై ఉన్న హక్కులను తొలగించింది. దీనివలన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటివరకూ ఆదివాసీలు సహజ సిద్ధంగా అటవీ ఫలసాయం పొందేవారు. ఇప్పుడది నేరం అవుతుంది. ఆదివాసీల అడవులు, భూమి, సహజ వనరులకు రక్షణగా ఉన్న గ్రామసభకు అటవీ హక్కులు, 1/70 తదితర చట్టాల అధికారాలు లేకుండా చేసింది. తక్షణమే ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులు, భూమి, సహజ వనరులపై హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆలా చర్యలు తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పడితే అదే నిజమైన ‘ఆదివాసీ గిరిజన దినోత్సవం’.