Congress: కాంగ్రెస్ హస్తవ్యస్తమేనా!

137 ఏళ్ల ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరు. అప్పట్లో ఏ రాష్ట్రంలో చూసినా ఆ పార్టీదే హవా. కానీ ఇదంతా గతం.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న హస్తం నేతలకు ఊహించని షాక్ తగిలింది.

  • Written By:
  • Updated On - March 13, 2022 / 01:06 PM IST

137 ఏళ్ల ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరు. అప్పట్లో ఏ రాష్ట్రంలో చూసినా ఆ పార్టీదే హవా. కానీ ఇదంతా గతం.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న హస్తం నేతలకు ఊహించని షాక్ తగిలింది. 403 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో అత్యంత దారుణంగా కేవలం రెండంటే రెండు సీట్లకే పరిమితమైంది. ఐదురాష్ట్రాల్లోకి గోవాలోనే కాస్త ఫరవాలేదనిపించింది. మిగతా రాష్ట్రాల్లోనూ అడ్రస్ లేకుండా పోయింది.

ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలు రెండే రెండు. ఒకటి రాజస్థాన్, రెండోది ఛత్తీస్గఢ్. ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని జారవిడుచుకుంది. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష స్థానంలో కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ ను చూసి భయపడిన పార్టీలు… పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడిన ప్రాంతీయ పార్టీలు… ఇప్పుడు దాన్ని లెక్కచేసే పరిస్థితిలో లేవు. దీనికి కారణం గత పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని మూటగట్టుకోవడమే. మరి దీనికి కారణం ఏంటి? పార్టీని నడిపే లీడర్ల కొరతనా? క్యాడర్ లేకనా?

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను అర్ధాంతరంగా వదిలేశారు. సోనియాగాంధీ తాత్కాలిక బాధ్యతలు చూస్తున్నా… పూర్తి కాలం అధ్యక్షులు ఎవరు? ఇదే విషయం అటు పార్టీ నేతలకు, ఇటు క్యాడర్ కు అంతుచిక్కడం లేదు. రాహుల్ వచ్చాక యువరక్తానికి ప్రాధాన్యత దక్కుతుందని భావించినా… నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్ లో కీలకమైన యువనేత జ్యోతిరాదిత్య సిందియాను పార్టీ దూరం చేసుకుంది. రాజస్థాన్ లోనూ ఎన్నికల్లో పార్టీని నడిపించిన సచిన్ పైలట్ కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చినా… ఆ తర్వాత సర్దుకుంది. పార్టీని అధినాయకత్వం పట్టించుకోవడంలేదంటూ పార్టీలోని 23 మంది సీనియర్లు గళం విప్పారు. వారిపై అసమ్మతి నేతలుగా, జీ-23 నేతలుగా ముద్రపడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూశాక కడుపు మండిన జీ-23 నేతలంతా మరోసారి గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశమై పార్టీ పరిస్థితిని చూసి బావురుమన్నారట. కొంతమంది నేతలు ఇప్పటికీ గాంధీ కుటుంబం చేతిలోనే పార్టీ పగ్గాలు ఉండాలని పట్టుబడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడానికి ఒప్పుకోవడం లేదు. ప్రియాంక గాంధీయే పార్టీకి దిక్కని భావించినా… ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాక పార్టీ నేతలకు ఆ నమ్మకం కూడా పోయింది. గాంధీ కుటుంబం నుంచి ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ఆశ సోనియాగాంధీ. కానీ ఆమె వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పార్టీకి పూర్వవైభవం తెస్తారని ఇన్నాళ్లు భావించిన హస్తం నేతల్లో ఇప్పుడు ఆ నమ్మకం సడలుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు కావల్సింది క్యాడర్ లో జోష్ నింపే లీడర్. ఈ విషయాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు… తమ బలహీనతను కప్పిపుచ్చుకోడానికి… బీజేపీ హిందూ-ముస్లిం కార్డును వాడుకుని ఓట్లు రాబట్టుకుంటోందని ఆరోపిస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వారి అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది. జీ-23 నేతల మీటింగ్ లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధానంగా రెండు సమస్యలను ఎదుర్కొంటోంది. ఒకటి అస్తిత్వ సంక్షోభం. మరోటి అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవడం. ఇవి సరిపోవన్నట్లు కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త ముప్పు ముంచుకొస్తోంది. బీజేపీ ఎలాగూ బలంగా ఉంది. దాని ఓటు బ్యాంకు దానికుంది. ఎటొచ్చీ కాంగ్రెస్ ఓట్లకే మిగతా పార్టీలు గండి కొడుతున్నాయి. అలాంటి పార్టీల్లో కీలకమైనవి రెండు. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ. రెండు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… తన రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకునిపోయేలా చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్ అడ్రస్ ను గల్లంతు చేసిన… ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్… పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని లాగేసుకున్నారు. పంజాబ్ లోని 117 సీట్లలో ఏకంగా 92 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుందంటే… ఆ పార్టీ కాంగ్రెస్ ను ఏ స్థాయిలో దెబ్బకొట్టిందో అర్థమవుతుంది. ఆప్ నుంచి కాంగ్రెస్ కు మరిన్ని రాష్ట్రాల్లో నష్టం తప్పేలా లేదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనైతే ఐసీయూలో ఉందని చెప్పాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాక… దూకుడు కనబరుస్తున్నారు. కానీ అధికార టీఆర్ఎస్ ను, మరోవైపు జోరుమీదున్న బీజేపీని ఢీకొట్టి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. తమిళనాడులో డీఎంకేతో పొత్తుపెట్టుని ఫరవాలేదనిపించింది. కర్ణాటకలో అధికారాన్ని చేజార్చుకుంది. కేరళలో కామ్రేడ్ల ప్రభావాన్ని తట్టుకుని పార్టీ స్వతంత్రంగా ఎదుగుతుందా అనేది కూడా అనుమానమే.

అంపశయ్యపై ఉన్న హస్తం పార్టీకి వెంటనే చికిత్స చేయక తప్పదా? లేదంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడం కష్టమేనా? పార్టీ ఇప్పటికే చాలామంది సీనియర్ లీడర్లను చేజేతులా వదులుకుంది. కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా పార్టీ దూరం చేసుకుంది. రాహుల్ కు సన్నిహితుడిగా పేరొందిన జ్యోతిరాదిత్య సిందియా, ప్రస్తుత అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రి, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ లను పార్టీ దూరం చేసుకుందంటారు విశ్లేషకులు. వీరంతా ప్రతిభావంతులు. ఇతర పార్టీల్లో సత్తా చాటుతున్నారు. మరి కాంగ్రెస్ వీరి టాలెంట్ ను గుర్తించలేదా?

పార్టీలో ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ లాంటి ట్రబుల్ షూటర్లు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే పార్టీకి మరో ఆపద రాబోతోంది. ఇన్నాళ్లు రాజ్యసభలో బీజేపీ దూకుడును అడ్డుకోడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది చివరి వరకు రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గబోతోంది. డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని నిర్ణయించబోతున్నాయి.