Honour Killings: కన్నపేగును తెంచడమే పరువా?

అహంకారాన్ని ఎదిరించినందుకు కన్నపేగు అని కూడా చూడకుండా హతమార్చడమే పరువు హత్య. ఇక్కడ కులం, మతం, ప్రాంతం, జాతి అనే తేడాలు ఉండవు.

  • Written By:
  • Publish Date - May 23, 2022 / 07:00 AM IST

అహంకారాన్ని ఎదిరించినందుకు కన్నపేగు అని కూడా చూడకుండా హతమార్చడమే పరువు హత్య. ఇక్కడ కులం, మతం, ప్రాంతం, జాతి అనే తేడాలు ఉండవు. ఒకే కులం వ్యక్తులు ప్రేమించుకున్నా సరే కన్నబిడ్డలను కర్కశంగా నలిపేస్తున్నారు. ఇంటి ఆడపిల్ల మనతో ఉన్నంత వరకే పరువు. ఎదిరించి పెళ్లి చేసుకుని గడప దాటి పడక పంచుకోవడం అంటే పరువుపోవడం. ఇదీ సమాజంలో ఉన్న లెక్క. ఒకవిధంగా ఆడపిల్ల విషయంలో పరువు అంటే ఆమె శరీరమే. తాను నిర్ణయించిన పెళ్లి చేసుకుంటేనే పరువు. తన జీవితాన్ని తాను నిర్దేశించుకోగల అమ్మాయి సొంతంగా నిర్ణయం తీసుకుంటే పరువు పోవడం. ఇందుకోసం ఎంతకు తెగించడానికైనా, ప్రాణం తీయడానికైనా వెనకాడడం లేదు. హంతకుడు అనిపించుకోవడం వీరి దృష్టిలో పరువు. జైల్లో చిప్పకూడు తినడం వీళ్లకు పరువు. బయటికొచ్చిన తరువాత సమాజం ఛీత్కరించుకోవడం వీళ్లకు పరువు. నిజంగా అదే పరువు అని బతకగలరా? మారుతిరావు ఏమయ్యాడు. కూతురు మరో సామాజికవర్గం వ్యక్తిని, తన తాహతకు తక్కువైన అబ్బాయిని పెళ్లి
చేసుకుందని సుపారీ ఇచ్చి మరీ చంపించాడు. ఆ తరువాత రెండు కుటుంబాల్లోనూ మన:శ్శాంతి కరువైంది. వాళ్ల జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి. చివరికి మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

మొన్న సరూర్ నగర్ పరువు హత్యలోనూ మిగిలింది పరువు కాదు శూన్యమే. చెల్లి కోసం అన్న చేసిన చెత్త పనికి ఆ కుటుంబం మొత్తం బజారున పడింది. ఓ కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన నీచమైన పనికి మొత్తం ముస్లిం సమాజంపైనా నిందవేసి మాట్లాడుతున్నారు. అటు ఒక్కగానొక్క కొడుకుపై ఆధారపడిన అబ్బాయి కుటుంబం రోడ్డున పడింది. జీవితాంతం తోడుంటాడనుకున్న వాడు దూరమవడంతో ఆ అమ్మాయి ఒంటరిది అయింది. ఇలాంటి పరువు హత్యల తరువాత గర్వంగా నిలబడిన కుటుంబం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

సమాజంలో పదే పదే సామాజికవర్గం ప్రస్తావన తీసుకురావడం కూడా పరువు హత్యలకు కారణం. ఫలానా సామాజికవర్గంలో పుట్టడం మన ప్రమేయం లేకుండా జరిగేది. అది ఎవ్వరికైనా ఒక్కటే. ఈ విషయం మరిచి తనదే అగ్రకులం, తనదే గొప్ప కులం అని బతకడం, చిన్నప్పటి నుంచి నూరిపోయడం ఇప్పుడు జరుగుతున్న పరువు హత్యలకు ప్రధాన కారణం. మతం విషయంలోనూ అంతే. మనిషిగా పుట్టిన తరువాతే మతం అంటుకుందన్న విషయం మరిచి ప్రవర్తిస్తున్నారు. ధనం కూడా ఇలాంటి హత్యలకు ప్రధాన కారణం. తన ఆస్తి, అంతస్తులకు తగిన వారితో కలవకపోతే.. పరువు తీసినట్టేనన్న భావన ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోయింది. ఇలాంటి హత్యలను పరువు హత్యలు అనడం సమంజసం కాదు. అహంకార హత్యలు అనడమే కరెక్ట్. ఏదో వెనకబడిన ప్రాంతాల్లో మాత్రమే ఈ పట్టింపులు ఎక్కువగా ఉంటాయి.
ఆధునిక జీవితాన్ని గడుపుతున్న సమాజంలో, వారి కుటుంబాల్లో ఇవేం పట్టించుకోరు అనేవి శుద్ధ అబద్ధం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనూ ఈ పరువు హత్యలు లెక్కకు మించి ఉన్నాయి.

మేజర్లు అయిన వాళ్ల నిర్ణయాలను గౌరవించడం తెలియాలి. ఏం చదవాలి, ఏం డ్రస్ వేసుకోవాలి, ఎవరితో ఉండాలి, ఎలా మాట్లాడాలి అని 18 ఏళ్ల పాటు అన్నీ నిర్దేశించారు కదా. ఇంకా పెత్తనం కావాలా? ముందు తల్లిదండ్రులు ఆ మైండ్ మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. ఏడు తరాలు చూసి చేసిన పెళ్లిళ్లు సైతం నిలబడడం లేదన్న వాస్తవాన్ని గ్రహించాలి. ప్రేమించి పెళ్లిచేసుకుని జీవితాంతం సుఖంగా గడిపిన వారు సమాజంలో మన చుట్టుపక్కలే ఉన్నారన్న వాస్తవం గుర్తించాలి. హత్య చేస్తే వచ్చేది పరువు కాదన్న చిన్న లాజిక్ ను గుర్తుంచుకోవాలి.