HIjab: హిజాబ్ వివాదం చిచ్చు

హిజాబ్ చాలా సున్నితమైన అంశం. మత ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించినది.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 07:15 AM IST

హిజాబ్ చాలా సున్నితమైన అంశం. మత ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించినది. కర్ణాటకలో మొదలైన వివాదం ఈ రోజు దేశమంతటికీ వ్యాపించింది. ఇది పెద్ద మత సమస్యగా పరిణమించింది. ప్రభుత్వాలు, మతాల మధ్య చిచ్చుకు దారితీసింది. సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా భిన్నమైన తీర్పు ఇచ్చింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ జూనియర్ కాలేజీకి ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత కాలేజీలో హిజాబ్ ధరించిన వారిని తరగతులకు అనుమతించలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఏకంగా కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఈ వివాదం మరింత ముదిరింది. కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. నిరసనలు హోరెత్తాయి. అది తమ మత ఆచారమని ముస్లింల వాదన.

ఇది మతానికి సంబంధించిన అంశమైనప్పటికీ, వివాదం మాత్రం మతాల మధ్య కాకుండా రెండు వర్గాల మధ్య జరిగిందిగానే భావిస్తున్నారు. రెండు వర్గాల వారూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల సస్పెన్షన్, ధర్నాలు, ఆందోళనలు, పోలీస్ కేసులు, అరెస్టులు.. పెద్ద దుమారమే చెలరేగింది. హిజాబ్ ధరించడం తమకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని కొందరు విద్యార్థినులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని మార్చి 15న సంచలన తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇరు మతాల వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. దీనిని సుప్రీం కోర్టులోని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 10 రోజులు విచారించింది.

ఈ ధర్మాసనం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ నెల 13న భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ జస్టిస్ ధూలియా తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు.చివరకు ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు నివేదించారు. ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం రెండు మతాల మధ్య చిచ్చుకు దారి తీసింది. ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం కోర్టువైపే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఉంది.