Dooms Day Device: ప్రపంచ దేశాలను నాశనం చేసే రష్యా డెడ్ హ్యాండ్ సిస్టమ్.. ఎలా పని చేస్తుందంటే..!

ఉక్రెయిన్ ను కబళించేయాలన్న కసి రష్యాలో అణువణువునా కనిపిస్తోంది. రాజ్యకాంక్ష ఆ స్థాయిలో ఉంది. అందుకే ఎన్ని దేశాలు చెప్పినా పుతిన్ అస్సలు ఖాతరు చేయడం లేదు.

  • Written By:
  • Publish Date - March 6, 2022 / 10:10 AM IST

ఉక్రెయిన్ ను కబళించేయాలన్న కసి రష్యాలో అణువణువునా కనిపిస్తోంది. రాజ్యకాంక్ష ఆ స్థాయిలో ఉంది. అందుకే ఎన్ని దేశాలు చెప్పినా పుతిన్ అస్సలు ఖాతరు చేయడం లేదు. పైగా అణ్వస్త్రాల ప్రస్తావన కూడా తెస్తున్నారు. ఒకవేళ వేరే దేశాలకు కోపం వచ్చి రష్యాపై మూకుమ్మడిగా దాడి చేస్తే ఏమిటి పరిస్థితి? ఇలాంటి ఆలోచన రష్యాకు 1980ల్లోనే వచ్చింది. అందుకే అప్పుడే అణ్వస్త్రాల ప్రయోగానికి ఏ క్షణమైనా రెడీ అనుకునే వ్యవస్థను సిద్ధం చేసింది. దానిపేరే డెడ్ హ్యాండ్. దీనికి మరో పేరే పెరిమీటర్.

ఉక్రెయిన్ లోని అణురియాక్టర్ దగ్గర బాంబుదాడుల న్యూస్ విన్నవెంటనే ప్రపంచమంతా ఉలిక్కిపడింది. రష్యాకు కావలసింది కూడా అదే. శత్రువు తననేమీ చేయలేడు అన్న ధీమాతో ఉన్నప్పుడు ఇవతలివారిలో విలనిజం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు రష్యాలోనూ అదే కనిపిస్తోంది. పైగా దీనికి మరో కారణం కూడా ఉంది. అదే పెరిమీటర్. ఇతర దేశాలు రష్యాపై దాడికి గాని దిగితే.. వెంటనే ప్రతిదాడి చేసే వ్యవస్థ ఇది. మనుషులు ఆపరేట్ చేయకపోయినా సరే.. దానికదే యాక్టివేట్ అయి.. శత్రుదేశాల పనిపడుతుంది. అలాంటి టెక్నాలజీతో దీనిని తయారుచేశారు.

డెడ్ హ్యాండ్. ఇదే రష్యాకున్న బలం. రష్యాపై అణుదాడికి ఎవరైనా ప్రయత్నిస్తే.. వెంటనే ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సెన్సర్ల సాయంతో దాడిని పసిగట్టేస్తుంది. వెంటనే కమాండ్స్ ఇస్తుంది. నిర్ణీత సమయంలోపు వార్ రూమ్ నుంచి ఎవరూ స్పందించకపోతే.. వెంటనే దాడిని మొదలుపెట్టేస్తుంది. అదే ఈ సిస్టమ్ మాయ. పైగా ఇదంతా 1980ల నాటి టెక్నాలజీని ఆధారంగా చేసుకుని సిద్ధం చేసినదే. ఈమధ్య కాలంలో ఒకసారి దీనిని అప్ గ్రేడ్ చేసి… ట్రయల్ కూడా వేశారు.

సోవియట్ యూనియన్ హయాంలోనే రెడీ అయిన డెడ్ హ్యాండ్.. రష్యా కంట్రోల్ లోనే ఉంది. అందుకే ఈ దేశంపై దాడి చేయాలంటే.. ప్రత్యర్థులు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. రష్యా దగ్గర అణ్వాయుధాలను ప్రయోగించేలా 700 వాహకాలు సిద్ధంగా ఉన్నాయి. భూగర్భంలో దాచిన ఖండాంతర క్షిపణులు, స్ట్రాటజిక్ బాంబర్లు అన్నింటినీ ఏకధాటిగా ప్రయోగిస్తుంది.

ఏదైనా దేశం మరో దేశంపై అణు దాడి చేస్తే.. వెంటనే అవతలి దేశం ప్రతిదాడి చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. అంతలా ముందే దెబ్బకొట్టేస్తుంది. పైగా.. తన శత్రువు అలెర్ట్ అయ్యి.. అణుదాడికి ఆదేశాలు ఇచ్చేలా చేసే న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ను ముందే నాశనం చేయడానికీ ప్రయత్నిస్తుంది. దీనివల్ల ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది నాటి సోవియట్ యూనియన్ కు అర్థమైంది. అందుకే పెరిమీటర్ పేరుతో ఓ వ్యవస్థను సిద్ధం చేసింది. దానికి డెడ్ హ్యాండ్ అని కూడా పేరు. అమెరికాతోపాటు యూరప్ లోనూ అలాగే పిలుస్తారు. ఒకవేళ ఎప్పుడైనా శత్రువుల చేతిలో రష్యా దెబ్బతిన్నా సరే.. అప్పుడు ఈ డెడ్ హ్యాండ్ సిస్టమే.. వారిపై విరుచుకుపడుతుంది.

డెడ్ హ్యాండ్ లోని వార్ హెడ్ లో అధునాతనమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో నేల బొరియల్లో ఉన్న అణుక్షిపణులకు దీని నుంచే ఆదేశాలు వెళ్తాయి. రాడార్లు, శాటిలైట్లతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఒకవేళ రష్యాపై అణుదాడి జరుగుతుంది అనుకుంటే.. అప్పుడు దీనిని యాక్టివేట్ చేస్తారు. దీంతో ఈ సిస్టమ్.. సెస్మిక్, రేడియేషన్, గాలిలో ఒత్తిడి.. ఇలాంటి వాటన్నింటినీ సెన్సర్ల సాయంతో పసిగడుతుంది. అణుదాడి జరిగిందని అర్థమయ్యాక.. వార్ రూమ్ ను అలెర్ట్ చేస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి స్పందన లేకపోతే.. కొద్దిసేపు వేచి చూస్తుంది. అప్పటికీ ఎవరి నుంచీ స్పందన లేకుంటే.. వాళ్లు చనిపోయారని భావించి.. పెరిమీటరే అణుదాడికి ఆదేశాలు జారీచేస్తుంది.

డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఎస్ఎస్-19 బాలిస్టిక్ మిస్సైల్ ని ప్రయోగిస్తుంది. ఇది భూమికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో.. సుమారు నాలుగున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే సమయంలో దీని వార్ హెడ్ లో ఉన్న పవర్ ఫుల్ రేడియో ట్రాన్స్ మీటింగ్ సిస్టమ్ ద్వారా.. దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో ఉన్న అణు క్షిపణులకు ఆర్డర్స్ ఇస్తుంది. ఆ ఆదేశాలు రావడమే ఆలస్యం.. అప్పటికే భూగర్భంలో దాచిన ఖండాంతర అణు క్షిపణులు.. ఒక్కసారిగా గాల్లోకి లేచి.. శత్రుదేశంపైకి దూసుకుపోతాయి. ఇప్పటికే దీనిని ఓసారి టెస్ట్ చేశారు కూడా. అందుకే రష్యా జోలికి వెళ్లడానికి దాని శత్రుదేశాలు ఒకటికి వందసార్లు ఆలోచిస్తాయి.