Private Satellites: భారత్ వైపు చూస్తున్న ప్రైవేటు అంతరిక్ష సంస్థలు

భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రైవేట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 08:24 AM IST

భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రైవేట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. స్కైరూట్ అనే ప్రైవేటు సంస్థ తయారుచేసిన ప్రారంభ్ అనే రాకెట్ కు శ్రీహరికోట ఇస్రో అంతరిక్ష కేంద్రం వేదికైంది. అంతరిక్ష పరిశోధనల కోసం భారతదేశం ఖర్చు చేస్తున్న నిధులు అమెరికా, చైనాలతో పోల్చితే శూన్యం అనే చెప్పాలి. గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో భారతదేశం వాటా 2 శాతం మాత్రమే. అయితే నేడు ఈ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు భారత అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం 2020 వ సంవత్సరం నుంచి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి లభించడంతో వారు రాకెట్లు, ఉపగ్రహాలను దేశీయంగా తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రైవేటు వారు తయారు చేసిన రాకెట్లను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో ప్రయోగ సౌకర్యాలను వినియోగించుకునేందుకు కూడా భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది.

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశం తన వాటాను విస్తరించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. 2 శాతం ఉన్న భారత షేర్ 8-10 శాతం వరకు పెంచాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు, ఇస్రోల మధ్య సమన్వయం చేసేందుకు ప్రభుత్వం ఇన్‌స్పేస్‌ అనే ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2019 లో 7 బిలియన్ల డాలర్ల విలువగల భారత అంతరిక్ష పరిశ్రమను 2024 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను అనుమతించిన తర్వాత ఇస్రోతో మొదటి ఒప్పందం చేసుకున్న ప్రైవేటు స్టార్టప్ సంస్థ స్కైరూట్. స్కైరూట్ తో సహా ఇప్పటికి దాదాపు 100 స్టార్టప్‌ సంస్థలు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో స్కైరూట్ రికార్డు స్థాయిలో 51 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ఇది భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో అతిపెద్ద నిధుల సమీకరణ. దాదాపు 10 ఇతర ప్రైవేట్ సంస్థలు సైతం అంతరిక్ష పరిశోధనలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇతర సంస్థలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి.

ఫిక్సెల్ అనే స్టార్టప్ మైనింగ్, విపత్తు నిర్వహణలో సహాయపడే చిత్రాలను అందించడంలో పని చేస్తోంది. బెంగుళూరుకు చెందిన దిగంతరా అనే స్టార్టప్ అంతరిక్ష వ్యర్థాలను మ్యాపింగ్ చేస్తోంది. ధృవ, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ వంటి ఇతర కంపెనీలు కూడా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రైవేటు స్పేస్ సంస్థలు అభివృద్ధి చెందితే భారతీయ యువకులు తమ కలల సాకారానికి విదేశాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేశంలోనే పని చేసుకోవడానికి వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్నేళ్లుగా ఇస్రో తక్కువ ఖర్చుతో పరిశోధనలు చేస్తూ విశ్వసనీయ భాగస్వామిగా ఖ్యాతి గడించింది. అంతేకాకుండా ఇస్రో తన సొంత పరిశోధన-ఆధారిత అంతరిక్ష ప్రయోగాలను చేయడమే కాకుండా, దాదాపు 30 దేశాలకు చెందిన 450 ఉపగ్రహాలను ప్రయోగించడంలో సహాయపడేందుకు విదేశాలతో ఒప్పందాలు చేసుకుంది.
రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కూడా భారత్‌కు మరిన్ని అవకాశాలను కల్పించిందనే చెప్పాలి. యుద్దం కారణంగా మాస్కోపై ఆంక్షల విధింపుతో రష్యా, ఇతర దేశాల రాకెట్ల ప్రయోగాలను నిలిపివేయవలసి వచ్చింది. దీంతో అనేక కంపెనీలు భారత్ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది.

భారత దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఆర్థిక మద్దతు ఉన్న లండన్‌కు చెందిన శాటిలైట్ కంపెనీ వన్ వెబ్ తన ఉపగ్రహాల ప్రయోగం కోసం భారతదేశం వైపు మొగ్గు చూపింది. ఈ ఏడాది అక్టోబరులో ఇస్రో వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. దీంతో అంతరిక్షంలో వన్ వెబ్ పంపిన ఉపగ్రహాల సంఖ్య 462కి చేరింది. మొత్తం 648 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని ప్రణాళికలు చేసుకున్న వన్ వెబ్ రష్యా ఉపసంహరణతో ఆ మిగిలిన ఉపగ్రహాలు భారత్ ద్వారా పంపాలని నిర్ణయించుకుంది. భారత్‌కు ఇది అత్యద్భుతమైన అవకాశం. మరి భవిష్యత్తులో భారత్ ఏ విధంగా ఈ మైలు రాళ్లను అధిగమిస్తుందో చూడాలి. ఒకేసారి విజయవంతగా 30-40 ఉపగ్రహాలను ప్రయోగించిన భారత్ వైపు ప్రపంచ అంతరిక్ష మార్కెట్ ఆసక్తిగా చూస్తోంది.