Indian Politicians: ప్రజాసేవకు జీతాలు అవసరమా!

ప్రజా ప్రతినిధుల వేతనాల పెంపు అనేది ప్రతి సారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 04:24 PM IST

ప్రజా ప్రతినిధుల వేతనాల పెంపు అనేది ప్రతి సారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ఎడా పెడా సంపాదించుకొని కోటీశ్వరులు అవుతున్న పార్లమెంటు సభ్యులు, శాసన సభ సభ్యులకు వేతనాలు అవసరమా అని మెజారిటీ వర్గం వాదిస్తోంది. ఇందులో నిజం లేకపోలేదు, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు కనిష్టంగా తక్కువలో తక్కువగా కోటి రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక కానీ ఒక ఎమ్మెల్యే తన పదవీకాలంలో అంత డబ్బు తనకు వచ్చే వేతనం ద్వారా సంపాదించగలడా అంటే కాదనే చెప్పాలి. కానీ ఎంపీ, లేదా ఎమ్మెల్యే పదవుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు కారణం అధికారం అండతో తమ పబ్బం గడుపుకోవచ్చనే ఆశే ఆశావహులను అటు వైపు ఆకర్షిస్తోంది.

మరి యదార్థం ఇలా ఉంటే ఓ వైపు ప్రజాప్రతినిధులకు జీతాలు నైతికంగా అవసరం లేదు అనే వాదనకు బలం చేకూరుతోంది. తాజాగా ఢిల్లీ రాష్ట్రం ఎమ్మెల్యేలకు గరిష్టంగా రూ.90 వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వివాదం మొదలైంది. కానీ దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల జీతాలు ఎంతవరకూ ఉన్నాయనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే ఈ పరిశోధనలో దేశంలో అత్యధిక వేతనం పొందేది తెలంగాణ ఎమ్మెల్యేలే అని తేలింది. దీంతో తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యే నెలకు రూ.2.5లక్షల వేతనం దక్కుతుంది. తెలంగాణ తర్వాత అత్యధికంగా ఎమ్మెల్యేల వేతనం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలుస్తోంది. అక్కడ ప్రతి ఎమ్మెల్యేకు నెలకురూ.2.33 లక్షల చొప్పున వేతనంతో పాటు మిగిలిన వసతులు కల్పిస్తున్నారు. తర్వాతి స్థానంలో దేశంలోనే అతి పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నిలుస్తోంది. యూపీలో ఎమ్మెల్యేలకు ప్రతి నెలా రూ.1.87లక్షల చొప్పున జీతం అందుతోంది.

కానీ పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం ఎమ్మెల్యేలకు నెల వారీ జీతం కింద రూ.1.3లక్షలు మాత్రమే దక్కుతోంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లో రూ.1.25 లక్షలు.. గోవాలో రూ.1.17 లక్షలు, హర్యానా పంజాబ్ లో రూ.1.15 లక్షల జీతాలు ఇస్తున్నారు. ఈ లెక్కన ఢిల్లీ ఎమ్మెల్యేలకు దక్కే 90 వేలు చాలా తక్కువ అనే అర్థం వస్తోంది. కానీ నిజానికి రాజకీయాలను ఒక ప్రొఫెషన్ గా భావించి, నిజాయితీగా పనిచేసే ప్రజాప్రతినిధులకు దక్కే ఈ వేతనం తక్కువ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నిధులు కేటాయింపులు ఉండటం లేదు. ఎంపీలకు మాత్రమే ఆ అవకాశం ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రజలు ఆర్థిక సాయం కావాలంటూ వచ్చే వారి తాకిడి పెరుగుతోంది. నిజానికి ఒక నియోజక వర్గంలోని ఎమ్మెల్యేకు ఉండే అధికార పరిధి చాలా తక్కువే, గతంలో ఎమ్మెల్యేలు చాలా మంది బస్సుల్లోనూ, ఆటోలో అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు కోకొల్లలు. రాను రాను ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని అనైతిక పద్ధతుల్లో సంపాదన మార్గాలు దక్కడంతో, చాలా మంది ఆశావహులు కోట్లు ఖర్చు పెట్టి మరీ పదవులు దక్కించుకుంటున్నారు. కానీ నిజాయితీగా పనిచేసి, ప్రజాజీవితం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసే ప్రజా ప్రతినిధులకు ఎన్ని సౌకర్యాలు అయినా కల్పించవచ్చనేది మరో వాదన, ఆకర్షణీయమైన వేతనం ఉంటే రాజకీయాల్లోకి సమర్థులు, నిజాయితీపరులు తమ కెరీర్ గా ఎంచుకునే అవకాశం కూడా ఉందని ఇతర దేశాల అనుభవాలు మనకు చెబుతున్నాయి.