Site icon HashtagU Telugu

Parenting Tips: పిల్లల అత్యుత్తమ పెంపకానికి 6 పాయింట్ ఫార్ములా!!

Parenting Imresizer

Parenting Imresizer

నేటి బాలలే భావి భారత పౌరులు..

పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన 3 క్లాసులు, 6 అసైన్ మెంట్లకు పరిమితమైన ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

పిల్లల పెంపకం పై పేరెంట్స్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. పుస్తకాల పురుగుల్లా మిగిలిపోతున్న పిల్లలకు.. అంతకు మించిన అసలు సిసలు ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే చాలా మంది పేరెంట్స్ తమ బాధ్యతను మర్చిపోయి దైనందిన కార్యకలాపాల్లో బిజీ అయిపోతున్నారు. పిల్లల మానసిక స్థితి ఎలా తయారవుతోంది? వారి సావాసాలు ఏమిటి? ప్రవర్తన ఎలా ఉంది ? అనే అంశాలపై దృష్టి పెట్టడం లేదు.

1.స్మార్ ఫోన్ కు టైం తగ్గించి.. ఆటపాటలకు టైం పెంచి

ఇది స్మార్ట్ ఫోన్ యుగం. గతంలో పిల్లలు అందరూ గ్రౌండ్స్ కు వెళ్లి ఆడేవారు. ఇప్పుడు ఇళ్లలోనే కూర్చొని స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతున్నారు. పిల్లలు గంటల తరబడి ఫోన్ చూస్తూ.. వాటిలో గేమ్స్ ఆడుతూ గడపడం వల్ల వాళ్లకు కంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. స్మార్ట్ ఫోన్ సమయాన్ని తగ్గించి.. ఆటపాటల్లో గడిపే సమయాన్ని పెంచేలా పిల్లల్ని సమాయత్తం చేయాలి. గ్రౌండ్ లో గేమ్స్ ఆడటం వల్ల పిల్లల శారీరక పెరుగుదల కూడా బాగా జరుగుతుంది.

2.ఏది అడిగితే అది కొనిస్తే..

పిల్లలు ఫలానా వస్తువు కావాలి అని మారాం చేయగానే.. కొందరు పేరెంట్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొనిచ్చేస్తుంటారు. ఇంత గారాబం చేస్తే.. పిల్లలు ప్రతిసారి మంకు పట్టు తో తాము చెప్పేది తీసుకు రావాలంటారు. పిల్లలు అడిగే వాటిలో “ఇప్పుడు అంత అనవసరం” అని భావించే వస్తువుల్ని కొనివ్వొద్దు. ఇప్పుడు అది అవసరం లేదని చెప్పండి. ఎప్పుడు అవసరం అనేది కూడా చెప్పండి. దీనివల్ల పిల్లలకు ఏది మంచి.. ఏది చెడు.. ఏది అవసరం.. ఏది అత్యవసరం అనే తేడాలు తెలుస్తాయి. పిల్లలు అడిగినవన్ని కొనిస్తూ పోతే మాత్రం ఈ తేడాలను వాళ్ళు తెలుసుకోలేరు.

3.ఓటమిని ఎలా డీల్ చేయాలో చెప్పండి

దాదాపు పేరెంట్స్ అందరూ పిల్లలకు గెలుపు గురించే చెబుతుంటారు. స్కూళ్లలో జరిగే కాంపిటీషన్స్ లో గెలవాలంటారు. ఒకవేళ ఓడిపోతే ఎలా డీల్ చేయాలి? అనేది చెప్పరు. దీనివల్ల ఓడిపోయిన సందర్భాల్లో పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. “ఓటమి అనేది గెలుపుకు తొలి మెట్టు.. ఈరోజు ఓడిపోయిన వాడే రేపు గెలుస్తాడు. ఓటమి అనేది మన బలహీనతలను మనకు చూపించే పాఠమే తప్ప.. బాధను మిగిల్చే చేదు జ్ఞాపకం కానే కాదు. తన బలహీనతలను గుర్తించి, వాటిని అధిగమించి.. బలం పెంచుకునే వాడే విజేతగా రూపు దిద్దుకుంటాడు” అని పిల్లలకు చెప్పాలి.

4.ఇతరులతో పోల్చొద్దు..

అందరు పిల్లలు ఒకలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో తరహా సామర్ధ్యం ఉంటుంది. ఒక్కో తరహా గుణగణాలు ఉంటాయి. ఈవిషయాన్ని పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలో కూడా ఒకే రకమైన ట్యాలెంట్స్ ఉండవు. కాబట్టి ఒక పిల్లవాడిని, మరో పిల్లవాడితో పోల్చొద్దు. ఇతరులతో పోల్చి పిల్లల మనసును చిన్నబుచ్చోద్దు. ” ఎవరికి వారే వెరీ డిఫరెంట్.. పిల్లల్ని వెన్నుతట్టి ప్రోత్సహించండి”.

5.కోప్పడొద్దు.. అర్ధం చేసుకోండి

పిల్లలకు ఇంటి వద్ద హోమ్ వర్క్ చేయించే క్రమంలో చాలామంది పేరెంట్స్ విసుక్కుంటూ ఉంటారు. పిల్లలు ఏదైనా రాయలేకపోయినా.. హోమ్ వర్క్ లోని ఆన్సర్ గుర్తుంచుకోలేకపోయినా పేరెంట్స్ తిడుతుంటారు. ఇది సరికాదు.. ఆ టాపిక్స్ ఎందుకు అర్ధం కావడం లేదు? అనేది కూల్ గా తెలుసుకొని కూలంకషంగా విడమర్చి చెప్పాలి. ఒకే రోజులో కాకుండా రెండు, మూడు రోజుల్లో కొంచెం కొంచెంగా ఆ టాపిక్ ను అర్ధమయ్యేలా వివరించాలి. దీంతో పిల్లలు ఆ టాపిక్ పై అవగాహన కు వస్తారు.

6.సహనం.. నేర్పించండి

ఈతరం పిల్లలకు పేరెంట్స్ తప్పకుండా నేర్పించాల్సిన ఒక అంశం “సహనం” , “ఓపిక”. గెలుపు ఆలస్యమైనప్పు సహనం.. విజయం దూరంగా ఉన్నప్పుడు సహనం.. బాధల్లో సహనం.. కష్టంలో సహనం.. సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు సహనం.. ఎవరైనా తిట్టినప్పుడు/కొట్టినప్పుడు సహనం.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సహనం ఉండాల్సిందే. సహనం అనేది మనిషిని మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్ లక్ష్యం దిశగా కదిలే బలాన్ని ఇస్తుంది.

Exit mobile version