Site icon HashtagU Telugu

Hindi Controversy: 20 శాతం హిందీని.. 80 శాతం భాషలపై రుద్దుతారా?

Hindi Language

Hindi Language

వందల భాషలు ఉన్న భారతదేశంలో ఒక్క హిందీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం సమంజసమేనా? దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడే భాషను దేశవ్యాప్తంగా రుద్దడం సహేతుకమేనా? 20 శాతం ప్రాచుర్యంలో ఉన్న భాషను తీసుకొచ్చి దేశంలోని మిగతా 80 శాతం మంది ప్రజలు మాట్లాడాల్సిందేననడంలో అర్ధం ఉందా? హిందీ అంటే ఉత్తర, మధ్య భారతదేశంలో మాట్లాడే ఒక భాష మాత్రమే. పైగా అందరూ భ్రమపడుతున్నట్టు హిందీ మనదేశ జాతీయ భాష కానే కాదు.

హిందీని దేశ్ కీ భాష అనడమంత అర్ధరహితం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఫలానాది దేశ్ కీ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. హిందీ జాతీయ భాషే. కాని, హిందీ ఒక్కటే జాతీయ భాష కాదు. దేశంలోని 22 భాషలను జాతీయ భాషలుగా గుర్తించింది ఈ రాజ్యాంగం. అలాంటప్పుడు హిందీ మాత్రమే దేశ భాష ఎలా అవుతుంది. ఈ దేశంలో నివసించే ఎవరైనా సరే.. తాను వ్యక్తపరచాలనుకున్న విషయాన్ని ఏ భాషలోనైనా చెప్పేందుకు స్వేచ్ఛ ఉంది. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. చిన్నప్పుడు స్కూళ్లల్లో ఏమని ప్రార్థన చేసే వాళ్లమో గుర్తుందా.

‘సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పుకోలేదా? మరి ఎవరి భాష వారికి వారసత్వ సంపద కాదా? పైగా హిందీ భాష వయసు చాలా చాలా తక్కువ. తెలుగు, తమిళానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. కొన్ని ప్రాంతీయ భాషలతో పోల్చితే హిందీ ఏమంత ప్రాచీన భాష కాదు. ఈ లెక్కన చూసుకున్నా హిందీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం.

హిందీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. ఒకరినొకరు హిందీలోనే పలకరించుకోవాలని, ఇంగ్లిష్‌లో సంభాషించుకోవడానికి వీల్లేదంటూ చెప్పడం ఇతర భాషలను అవమానించడమే. హిందీకి మద్దతిచ్చే వారు.. హిందీ రానివారు అసలు భారతీయులే కాదు, హిందీని నిరాకరించడమంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేననే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నినాదం అయిన హిందూ-హిందీ-హిందుస్తాన్‌ను వీలైనంత వేగంగా అమలు చేసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. హిందీలో మాట్లాడకపోతే దేశ ఐకమత్యం దెబ్బతింటుందట? ఇంత అర్థంలేని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి.

హిందీకి, దేశ సమగ్రత, ఐకమత్యానికి అసలు సంబంధం ఏంటి? అందుకే, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఘాటు విమర్శలు వస్తున్నాయి. హిందీని గౌరవించాల్సిందే.. కాని హిందీని తప్పనిసరి అంటే మాత్రం ఎంతవరకైనా పోరాడతానని కమల్ హాసన్ హెచ్చరించారు. ఏ.ఆర్. రెహమాన్ కూడా తమిళనాడు అటానమస్‌ అంటూ తన మాతృభాషపై ప్రేమను చూపుతూ అమిత్ షా కామెంట్లకు కౌంటర్ వేశారు. కేవలం దక్షిణాది నుంచే కాదు. ఈశాన్య రాష్ట్రాలు కూడా హిందీని వ్యతిరేకిస్తున్నాయి.

పదో తరగతి వరకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని అసోం సాహిత్య సభ ఏనాడో తప్పుబట్టింది. హిందీని తప్పనిసరిగా చేయడానికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ఒప్పుకున్నాయని కేంద్రం చేసిన ప్రకటనపై ఆయా రాష్ట్రాలు మండిపడ్డాయి. సో, ఇప్పటికైనా హిందీపై రగడను ఉత్తరాది రాష్ట్రాలు ఆపితే మంచిది.