UCC Vs Communities : యూనిఫామ్ సివిల్ కోడ్.. ఏ మతంపై.. ఏ ప్రభావం ?

UCC Vs Communities : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ).. ఇప్పుడు దేశమంతటా దీనిపైనే హాట్ డిబేట్ జరుగుతోంది.

  • Written By:
  • Updated On - July 7, 2023 / 12:27 PM IST

UCC Vs Communities : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ).. ఇప్పుడు దేశమంతటా దీనిపైనే హాట్ డిబేట్ జరుగుతోంది. దేశంలోని అన్ని మతాల, కులాలు, తెగల వారి వ్యక్తిగత చట్టాల స్థానంలో తీసుకొస్తున్న ఉమ్మడి ఏకీకృత చట్టమే యూసీసీ. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, సంరక్షకత్వాన్ని నియంత్రించేందుకు సంబంధించి ప్రస్తుతం ఒక్కో మతానికి ఒక్కో విధమైన చట్టాలు ఉన్నాయి. యూసీసీ ద్వారా ఆ వేర్వేరు చట్టాల స్థానంలో మతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ వర్తించేలా.. ఒక్కో అంశానికి ఒక్కో చట్టాన్నే అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఏ మతాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే(UCC Vs Communities) దానిపై ఫోకస్..

హిందూ అవిభాజ్య కుటుంబం

హిందూ అవిభాజ్య కుటుంబానికి (హెచ్ యూఎఫ్) పెద్దగా ఒక పురుషుడు ఉంటాడు. అతడి నుంచే ఇతరులకు వారసత్వ బదిలీ జరుగుతుంటుంది. ఇందులో ఆ కుటుంబీకులు అందరూ సభ్యులుగా ఉంటారు. హిందువులతో పాటు బౌద్ధ, జైన, సిక్కు కుటుంబాలు.. హిందూ అవిభాజ్య కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థను సృష్టించడం ద్వారా లభించే మొత్తం ఆదాయంపై పన్ను ఆదాను పొందే సౌలభ్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. యూసీసీకి ఒకవేళ ఆమోదం లభిస్తే.. అది భారతదేశ ఆదాయపు పన్ను నియమాలు, వారసత్వ కేటాయింపు ఏర్పాట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చట్ట ప్రకారం చేకూరే ఆదాయపు పన్ను ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూసీసీ అమల్లోకి వస్తే.. హిందూ అవిభాజ్య కుటుంబం అనే కాన్సెప్ట్ కు కాలం చెల్లినట్టేనని అంటున్నారు.

ఇస్లాం

ముస్లిం పర్సనల్ (షరియా) అప్లికేషన్ యాక్ట్ 1937 ప్రకారం.. వివాహం, విడాకులు, మెయింటెనెన్స్ వంటి ప్రక్రియలన్నీ షరియత్ లేదా ఇస్లామిక్ చట్టం ప్రకారం నిర్వహించబడతాయి. యూసీసీ అమల్లోకి వస్తే బహు భార్యత్వాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించే అవకాశం ఉంది. అంటే.. ఒకటికి మించి పెళ్లిళ్లపై బ్యాన్ అమల్లోకి రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. షరియత్ చట్టం ప్రకారం ప్రస్తుతమున్న వివాహ కనీస వయస్సును కూడా సవరించే ఛాన్స్ ఉంది.

Also read : Passport: విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త.. 7 రోజుల్లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్..!

సిక్కు

“1909 ఆనంద్ వివాహ చట్టం” అనేది సిక్కులకు సంబంధించిన వివాహ చట్టాలను నియంత్రిస్తుంది. అయితే దీని ప్రకారం విడాకులు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ సందర్భంలో హిందూ వివాహ చట్టం ద్వారా సిక్కుల విడాకుల వ్యవహారాలను నియంత్రిస్తుంటారు. ఒకవేళ యూసీసీ అమలులోకి వస్తే.. ఆనంద్ చట్టం కింద నమోదైన అన్ని సంఘాలు, వివాహాలకు యూసీసీ నిర్దేశించే ఉమ్మడి నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది.

క్రైస్తవం

వారసత్వం, దత్తత వంటి అంశాలతో ముడిపడిన క్రైస్తవ వ్యక్తిగత చట్టాలు యూసీసీ ద్వారా ప్రభావితమవుతాయి. అయితే క్రైస్తవ వివాహం, విడాకులు తీసుకోవడాన్ని క్యాథలిక్ చర్చి తిరస్కరించడం వంటి అంశాలపై మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

పార్సీ

1936 నాటి పార్సీ వివాహం, విడాకుల చట్టం ప్రకారం.. ఏ స్త్రీ అయినా వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే పార్సీ వేడుకలు, ఆచారాలపై అన్ని హక్కులను కోల్పోతారు.  ఒకవేళ యూసీసీ అమలులోకి వస్తే ఈ నిబంధనను తొలగించే అవకాశం ఉంది. దత్తత తీసుకున్న కుమార్తెలకు పార్సీలలో ఎటువంటి హక్కులు కూడా ఇవ్వరు. కానీ తండ్రి అంత్యక్రియలను నిర్వహించేందుకు దత్తత తీసుకున్న కుమారుడికి అనుమతి ఇస్తారు. యూసీసీ అమల్లోకి వస్తే.. అన్ని మతాలకు కలిపి ఒకే విధమైన గార్డియన్ షిప్, కస్టోడియన్ చట్టాలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దత్తత ప్రక్రియలో వివక్షకు తావు లేకుండా సవరణలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.