Site icon HashtagU Telugu

Hunger Index : ఆకలి ఇండెక్స్ లో అడుగున ఉన్నాం..

We Are At The Bottom Of The Hunger Index

We Are At The Bottom Of The Hunger Index

By: డా. ప్రసాదమూర్తి

Bottom of the Hunger Index : స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమృతోత్సవాలను జరుపుకుంటున్న దేశం మనది. కానీ ఈ 75 సంవత్సరాల్లో ఏ రంగంలో మనం ఏం సాధించామో గాని పసిపిల్లల ఆరోగ్యం, భద్రత విషయంలో మాత్రం మనం ఎంత వెనుకబడి ఉన్నామో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో బయటపడింది. ఆకలి ఇండెక్స్ (hunger index) లో మన దేశం 111వ స్థానంలో ఉందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) 2023 సర్వే ప్రకారం 125 దేశాలలో బాలల ఆరోగ్యం, పౌష్టికాహార లోపం, భద్రత వంటి అంశాల్లో మన దేశం 111వ స్థానంలో ఉంది. అక్టోబర్ 12వ తేదీన ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు. దీనిమీద భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా స్థానాన్ని నిర్ధారించడంలో సర్వే చేసిన సంస్థలు సరైన విధానాలు పాటించలేదని, ఆ సర్వే ఫలితాలు అన్నీ తప్పుల తడకలేనని భారత మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ విమర్శించింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రశంసలైతే స్వీకరించడం, విమర్శలయితే తిరస్కరించడం మన వాళ్లకు అలవాటే. ఈ సర్వే చేసిన సంస్థలకు భారతదేశం మీద ప్రత్యేకించి ద్వేషం గాని ప్రేమ గాని ఉండడానికి అవకాశం లేదు. ఇలాంటి సర్వేలు దేశాల మీద అభిమానంతోనో, కక్షతోనో చేసేవి కావు. ఈ సర్వేలను ఆయా దేశాలు ఛాలెంజ్ గా తీసుకొని వాస్తవాలను అర్థం చేసుకొని తమను తాము మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటాయి. అంతే తప్ప సర్వేలు చేసిన వాళ్ళు నిజాలు చెప్పినా, అవి తమకు అనుకూలంగా లేకపోతే వారు తమ శత్రువులేనని భావించడం ఏ దేశానికీ సమర్థనీయం కాదు. ఈ సర్వేలో తేలిన కొన్ని ఘోరమైన నిజాలు మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. ఆకలి ఇండెక్స్ (hunger index) లో మనకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక మెరుగైన స్థానంలో ఉన్నాయని తేలింది. పాకిస్తాన్ 102 స్థానంలో, బంగ్లాదేశ్ 81వ స్థానంలో, నేపాల్ 69వ స్థానంలో, శ్రీలంక 60వ స్థానంలో ఉన్నాయి. 2022వ సంవత్సరంతో పోలిస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన స్థానం మరింత దిగజారింది.

భారతదేశం మాత్రం ఈ సర్వే ఫలితాలను తప్పుపడుతుంది. ఈ సర్వే కోసం ఉపయోగించిన నాలుగు ఇండికేటర్లలో మూడింటిని కేవలం పిల్లల ఆరోగ్య విషయానికి మాత్రమే పరిమితం చేశారని, ఆ సర్వే మొత్తం జనాభాను రిప్రజెంట్ చేయదని మన దేశం విమర్శిస్తుంది. ఇక నాలుగో ఇండికేటర్ పౌష్టికాహార లోపానికి సంబంధించినది. దీన్ని మూడు వేల మంది జనాభా నుంచి తీసిన ఒపీనియన్ పోల్ ఆధారంగా నిర్ధారించారు. కాబట్టి ఇదంతా తప్పులు తడకగా ఉందని మన మహిళా శిశు సంక్షేమ శాఖ విమర్శించింది. అయితే ఈ ఆకలి ఇండెక్స్ రిపోర్టు (hunger index report)ను జర్మన్, ఐరిష్ దేశాలకు చెందిన ఎన్జీవో సంస్థలు రెండు కలిపి రూపొందించాయి. ఈ సంస్థలు చేసిన సర్వేలో బాలల ఆరోగ్య నిర్లక్ష్యం ఇండియాలో మరింత ఘోరంగా ఉందని తేలింది.

ఇండియాలో పౌష్టికాహార లోపం 16.6% ఉంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాల రేటు మన దేశం 3.1% ఉంది. కాగా ఆకలి ఇండెక్స్ లో దక్షిణాసియా, ఆఫ్రికా సబ్ సహారా ప్రాంతాల్లో ఆకలి విలయతాండవం చేస్తోందని ఈ సర్వే చెప్తుంది. ప్రతి సంవత్సరం విడుదలయ్యే ఇలాంటి సర్వేలు ఎన్నో నిజాలు చెబుతున్నా, ప్రపంచంలో ఆకలిని అంతమొందించే చర్యలు చేపట్టి అందులో పురోభివృద్ధిని సాధించడంలో అన్ని దేశాలూ, ముఖ్యంగా దక్షిణాసియా ఆఫ్రికా దేశాలు విఫలమవుతున్నాయి.. సత్యాలు తెలుసుకొని సరిదిద్దుకోవాలి గాని ఆ సత్యాలు చెప్పిన వాళ్లలో తప్పులు ఎంచడం సమంజసం కాదు. రానున్న సంవత్సరాల్లోనైనా ఆకలి ఇండెక్స్ లో ఆఖరి స్థానం నుంచి మెరుగైన స్థానంలోకి రావడానికి మన దేశం ప్రయత్నిస్తుందని ఆశిద్దాం.

Also Read:  Gold Medal To Indian Army : ఇండియా ఆర్మీకి గోల్డ్ మెడల్.. ‘కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్’ అంటే ?