78 Year Imprisonment : ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్‌కు 78 ఏళ్ల జైలు

78 Year Imprisonment : 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక ప్రకటన చేసింది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 01:22 PM IST

78 Year Imprisonment : 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక ప్రకటన చేసింది. హఫీజ్ ప్రస్తుతం పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడని, 78ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని వెల్లడించింది. ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తున్నందుకు 7 కేసుల్లో అతడు దోషిగా తేలాడని తెలిపింది. 2020 ఫిబ్రవరి 12 నుంచి హఫీజ్ జైలులోనే ఉన్నాడని చెప్పింది. హఫీజ్ సయీద్‌‌ను ఐక్యరాజ్యసమితి 2008 సంవత్సరంలో ఉగ్రవాదిగా ప్రకటించింది. లేటెస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సవరించిన జాబితాలో ఈమేరకు కొత్త వివరాలను చేర్చింది. లష్కరే తైబా వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్ సలామ్ భుట్టావి మరణించాడని ప్రస్తావించింది. ఉగ్రవాద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ గతేడాది మేలో పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ జైలులో అబ్దుల్ సలామ్ చనిపోయాడని తెలిపింది. హఫీజ్‌ను తమకు అప్పగించాలని ఇటీవలే పాక్‌ను భారత్ అభ్యర్థించింది. ఈ తరుణంలో హఫీజ్‌కు పడిన 78 ఏళ్ల జైలుశిక్ష అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించడం గమనార్హం.తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కమాండర్ మౌలానా ఫజులుల్లా 2018 జూన్ 13న మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరించింది. ఫజులుల్లా 2007 నుంచి 2009 వరకు పాకిస్తాన్ వాయవ్య లోయ స్వాత్‌లో TTPకి నాయకత్వం వహించారు.  2013 నవంబర్ నుంచి TTP కమాండర్‌గా(78 Year Imprisonment) వ్యవహరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల విడుదలైన పాకిస్థాన్‌లోని మాజీ భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పుస్తకం సంచలనం క్రియేట్ చేస్తోంది. దీని పేరు.. ‘యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లమాటిక్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్థాన్’. దాని ప్రకారం.. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి జరిగింది. 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. అనంతరం ఫిబ్రవరి 26న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. వైమానిక దాడి చేసే క్రమంలో పట్టుబడిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ కస్టడీలో ఉండగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌పైకి తొమ్మిది క్షిపణులను భారత్ ఎక్కుపెట్టింది. ఈవిషయం సైన్యం ద్వారా తెలియడంతో 2019 ఫిబ్రవరి 27న రాత్రివేళ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడేందుకు నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యత్నించారు. కానీ మాట్లాడేందుకు మోడీ నో చెప్పారు. తర్వార అమెరికా, బ్రిటన్ దౌత్యవేత్తల ద్వారా పాకిస్తాన్ రాయబారం నడిపింది. దీంతో పాక్ వైపు ఎక్కుపెట్టిన మిస్సైళ్లను భారత్ వెనక్కి తీసుకుంది. ఈ పరిణామం నేపథ్యంలో 2019 మార్చి 1న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు పాక్ తిరిగి అప్పగించింది.

Also Read: Adani Drone : హైదరాబాద్‌లో ‘అదానీ డిఫెన్స్’ డ్రోన్ రెడీ.. ప్రత్యేకతలివీ..