Site icon HashtagU Telugu

CDS India : దేశానికి కొత్త CDS ఎవరు ? నియామకంలో జాప్యం ఎందుకు ?

modi and army

modi and army

‘ మన దేశ వాయు సేన, నౌకా దళం, సైన్యం మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని.. నేను ఈ రోజు ఎర్రకోట నుంచి ప్రకటిస్తున్నాను . మన దేశానికి ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ఉంటారు’ అని 2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన 4 నెలల తర్వాత 2020 జనవరిలో భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. దురదృష్టవశాత్తు 2021 డిసెంబరు లో చోటుచేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందారు. నాటి నుంచి దాదాపు 6 నెలలుగా CDS పోస్టు ఖాళీగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది ? అనే దానిపై జాతీయ మీడియాలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఒకవేళ CDS పోస్టును భర్తీ చేయాలని భావిస్తే దానికి అర్హతలు ఏమిటి ?దాన్ని భర్తీ చేయడానికి ఇంకా ఎన్ని నెలల సమయం పడుతుంది ? బిపిన్ రావత్ మృతి తర్వాత CDS పోస్టును భర్తీ చేయకుండా వదిలి వేయడానికి కారణం ఏమిటి ? అనే అంశాలపై రక్షణ రంగ పాత్రికేయులు విభిన్న రకాల విశ్లేషణలు అందిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ ప్రకటనతో ఏర్పడిన CDS పోస్టును భర్తీ చేసే విషయంలో జాప్యం జరుగుతుండటం వల్లే .. దానిపై సర్వత్రా చర్చ జరుగుతోందని అంటున్నారు. ఏప్రిల్ 30 వరకు ఆర్మీ చీఫ్ గా సేవలు అందించిన జనరల్ నరవనే ను CDS గా నియమించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడినప్పటికి అలా జరగలేదు. కొత్త CDS ఎవరు ? అనే దానిపై ఎప్పుడు స్పష్టత వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈపోస్టు భర్తీ చేయకుండా రాష్ట్రపతి విశేషాధికారాల్లో దీన్ని కలిపేసే సూచనలు కూడా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ CDS పోస్టును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. అందుకోసం కొంతమంది పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. ఈజాబితాలో ప్రస్తుత vice CDS బీ.ఆర్.కృష్ణ కూడా ఉన్నారు. ఆయన దక్షిణాదికి చెందినవారు కావడం విశేషం.

CDS పోస్టుతో ప్రయోజనం ఇదీ..

CDS పోస్టు వల్ల త్రివిధ దళాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. సైన్యంలో మొత్తం 17 సింగిల్ సర్వీస్ కమాండ్లు ఉన్నాయి. వాటిలో చెరో 7 ఆర్మీ, వాయుసేనలకు చెందినవి కాగా, మరో మూడు నేవీకి చెందినవి. జనరల్ బిపిన్ రావత్ CDS గా నియమితులు కాగానే.. వీటన్నింటిని 4 సమీకృత థియేటర్ కమాండ్స్ గా విభజించే పనిని మొదలుపెట్టారు. ప్రతి థియేటర్ కమాండ్ పరిధిలో అక్కడి త్రివిధ దళాలు కలిసి పనిచేసేలా ఆయన వ్యవస్థను రూపొందించారు. ఈ నాలుగు థియేటర్ కమాండ్స్ లో 2 పదాతి దళాల కమాండ్స్ ఉంటాయి ఇవి పాకిస్థాన్, చైనాల సరిహద్దులపై ఫోకస్ తో పనిచేస్తాయి. మిగితా రెండు థియేటర్ కమాండ్స్ జాబితా లో.. నౌకాదళ థియేటర్ కమాండ్, వాయుసేన థియేటర్ కమాండ్ ఉన్నాయి. అయితే జనరల్ బిపిన్ రావత్ అకాల మరణంతో థియేటర్ కమాండ్ ల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ పడింది. మళ్లీ కొత్త CDS నియమితులు అయితేనే.. మన దేశ త్రివిధ దళాల సమన్వయ వ్యవస్థ ఏర్పాటు ఒక కొలిక్కి వస్తుంది. ఫలితంగా ఎంతో ఆర్థిక దుబారాకు కూడా చెక్ పడుతుంది. పాక్, చైనా వంటి దేశాలను త్రివిధ దళాలు ఏకకాలంలో ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను అందించే దిక్సూచిలా CDS మార్గదర్శనం చేస్తారు.

CDS పోస్టు ఆలోచన ఎక్కడిది ?

పాకిస్థాన్ తో భారత్ కార్గిల్ యుద్ధం చేసిన సందర్భంలో సైనికపరమైన వ్యూహ రచనల్లో పొరపాట్లు జరిగాయి. త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు సాగి ఉంటే.. ఆ యుద్ధాన్ని చాలా త్వరగా ముగించే అవకాశాలు ఉండేవని అంటారు. ఈనేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కార్గిల్ రివ్యూ కమిటీ వేసింది. సైనిక వ్యూహాలు, త్రివిధ దళాల సమన్వయంపై అది అధ్యయనం చేసి కీలక సిఫార్సు చేసింది. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం CDS పోస్టు ను సృష్టిస్తే బాగుంటుందని సూచించింది. 20 ఏళ్ల క్రితం చేసిన ఆ సిఫార్సును ప్రధాని మోడీ 2019 ఆగస్టు 15న సాకారం చేశారు. అయితే ఆ పోస్టు భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Exit mobile version