Agnibaan : మన స్పేస్ స్టార్టప్ విప్లవం.. మార్చి 22నే ‘అగ్నిబాణ్’ ప్రయోగం

Agnibaan : మన దేశంలో అంతరిక్ష పరిశోధనా రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.

  • Written By:
  • Updated On - March 20, 2024 / 11:08 AM IST

Agnibaan : మన దేశంలో అంతరిక్ష పరిశోధనా రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రంగంలోనూ స్టార్టప్‌లు విప్లవాత్మకంగా దూసుకుపోతున్నాయి. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘అగ్నికుల్ కాస్మోస్’ ఈ శుక్రవారం రోజున (మార్చి 22) ‘అగ్నిబాణ్ SOrTeD’ అనే 3డీ ప్రింటెడ్ రాకెట్‌ను పరీక్షించనుంది. దీని బరువు  580 కిలోగ్రాములు. ఈ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. తొలిసారి ఈ రాకెట్(Agnibaan) భూమి నుంచి 20 కిలోమీటర్ల ఎత్తు వరకే వెళ్లనుంది. ఆ ప్రయాణం ముగిసిన వెంటనే నింగి నుంచి నేల వైపుగా దూసుకొచ్చి బంగాళాఖాతంలో పడిపోనుంది. అగ్నిబాణ్ రాకెట్‌కు 7 కిలోల పేలోడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎప్పుడూ తమ రాకెట్లలో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను  వాడలేదు. కానీ  శుక్రవారం జరిగే రాకెట్ ప్రయోగంలో తొలిసారిగా ‘అగ్నికుల్ కాస్మోస్’ ఆ తరహా ఇంజిన్‌ను వాడబోతోంది. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ అనేది.. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం లేదా కిరోసిన్ లేదా మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌తోనూ పనిచేయగలదు. 2022 సంవత్సరంలో శ్రీహరికోట నుంచే ఘన ఇంధనంతో కూడిన సౌండింగ్ రాకెట్‌ను స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పరీక్షించింది. అదే బాటలో అగ్నికుల్ ఇప్పుడు కొత్త ప్రయోగానికి తెరతీసింది.

We’re now on WhatsApp. Click to Join

  • ‘అగ్నికుల్ కాస్మోస్’ స్టార్టప్ విశేషం ఏమిటంటే ఇది 2017లో ఐఐటీ మద్రాస్‌ కేంద్రంగా ఏర్పాటైంది.
  • ఇద్దరు ఏరో స్పేస్ ఇంజినీర్లు శ్రీనాథ్‌ రవిచంద్రన్‌, మొయిన్‌ ఎస్‌పీఎం కలిసి దీన్ని స్థాపించారు.
  • ఒకవేళ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం  సక్సెస్ అయితే.. రానున్న రోజుల్లో 30 నుంచి 300 కిలోగ్రాముల బరువుండే చిన్నతరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే వర్క్స్‌ను చేపట్టాలని అగ్నికుల్ భావిస్తోంది.
  • అగ్నికుల్ ఇప్పటికే రూ.332 కోట్ల పెట్టుబడిని ఆకర్షించింది.
  • ఈ స్టార్టప్‌లో ప్రస్తుతం 250 మంది సభ్యుల బృందం ఉంది.
  • అగ్నికుల్‌లో పనిచేస్తున్న  ఉద్యోగుల సగటు వయస్సు 23 సంవత్సరాలు మాత్రమే.

Also Read :MNP : ‘సిమ్ స్వాప్’ మోసాలకు చెక్.. ‘మొబైల్ నంబర్ పోర్టింగ్’ ​కొత్త రూల్

శ్రీనాథ్‌ రవిచంద్రన్‌, మొయిన్‌ ఎస్‌పీఎం ఇద్దరూ ఏరోనాటికల్‌ ఇంజినీర్లు. అంతులేని ఆకాశాన్ని చూస్తూ.. అంతరిక్షం గురించి బోలెడు కబుర్లు చెప్పుకొనేవారు. అప్పుడే, అంబరమంత ఆలోచన వచ్చింది. బుర్రలో ఐడియా తళుక్కుమనడమే ఆలస్యం.. చెన్నై కేంద్రంగా అగ్నికుల్‌ కాస్మోస్‌ కంపెనీని స్థాపించారు. తొలిదశలో శ్రీనాథ్‌, మొయిన్‌ వివిధ మార్గాల్లో నిధులు సేకరించారు. మైక్రో, నానో ఉపగ్రహాల ప్రయోగం కోసం పక్షం రోజుల్లోనే రాకెట్లను తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వారి ప్రణాళికలు సక్సెస్ కావాలని ఆశిద్దాం..