Reservation : రిజర్వేషన్.. రివల్యూషన్

రిజర్వేషన్ (Reservation) అనే ఒకే ఒక్క పోరాటం సాధించిన విజయమే అఖండంగా అమేయంగా అద్వితీయంగా అద్భుతంగా కనిపిస్తుంది

  • Written By:
  • Updated On - November 13, 2023 / 11:07 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Reservation.. Revolution : పాతికేళ్ల క్రితం మాట. నా మొదటి కవితా సంపుటి ‘కలనేత’లో రిజర్వేషన్ అనే శీర్షికతో ఒక కవిత ఉంది. ఈ దేశంలో బడుగు బలహీన జాతులు ఆత్మగౌరవంతో విద్యా ఉద్యోగాలలో చట్టసభలలో అడుగులు పెట్టిన పరిణామ క్రమం వెనుక అనేకానేక పోరాటాల నేపథ్యం ఉందని చెబుతూ ‘ఈ దేశంలో రిజర్వేషన్ (Reservation) ని మించిన రెవల్యూషన్ ఉందా’? అనే ప్రశ్నతో కవిత ముగుస్తుంది. నా గుండెల నిండా కమ్యూనిజం ఆవహించి ఉంది. కానీ ఈ దేశ ప్రత్యేక పరిస్థితుల రీత్యా కుల సమస్య పరిష్కారం కాకుండా వర్గ సమస్య పరిష్కారం కాదని, అసలు ఈ దేశంలో వర్గం అంటే కులమేనని అంబేద్కర్ అవగాహనను అర్థం చేసుకున్నాక, నా పరిశీలన, నా పరిశోధన ఆ వైపుగా సాగింది. అంబేద్కర్ అన్నట్టు ఈ దేశంలో ఒకవేళ సోషలిజం సాధించినప్పటికీ అటుతిరిగి ఇటుతిరిగి ఎవరైనా కులం దగ్గరకు రావాల్సిందే. అందుకే ఇక్కడ వర్గ పోరాటం కంటే కుల పోరాటం ముందుకు మునుముందుకు సాగుతోంది.

We’re Now on WhatsApp. Click to Join.

అంబేద్కర్ కంటే ముందే ఫూలే, పెరియార్ మొదలైన సంఘసంస్కర్తలు ప్రారంభించిన ఉద్యమాల వెలుగులో ఈ దేశ చరిత్రను పరిశీలించినప్పుడు, వర్గ పోరాటాలు ఎన్ని జరిగినా అవి సాధించిన విజయాల కంటే రిజర్వేషన్ (Reservation) అనే ఒకే ఒక్క పోరాటం సాధించిన విజయమే అఖండంగా అమేయంగా అద్వితీయంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఏ రక్తపాతం లేకుండా ఏ ఆయుధాలూ పట్టకుండా నిశ్శబ్దంగా ఈ దేశంలో ఒక విప్లవం జరుగుతుందని, ఆ విప్లవమే రిజర్వేషన్ అని, అది ఎప్పటికైనా ఈ దేశంలో కొనసాగిన వేల సంవత్సరాల కులాధిపత్య అణచివేత లెక్కలను తేల్చివేస్తుందని అప్పట్లో నా అంచనా. ఇప్పటికీ అదే నా అవగాహన. అప్పటి నా అంచనా తప్పు కాదని అది నిజమవుతున్నట్టుగా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. లాల్ నీల్ నినాదం ఇస్తున్న కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఈ అవగాహనకు వస్తున్నట్టు అర్థమవుతోంది.

మండల కమిషన్ అమలు కోసం బీసీలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. విపి సింగ్ లాంటి అగ్రవర్ణ నాయకుల ఏలుబడిలోనే మండల కమిషన్ అమలులోకి వచ్చింది. ఒకప్పుడు బీసీల ఊసే ఎత్తడానికి కూడా భయపడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బహిరంగంగా బీసీ నామ జపం చేస్తోంది. మహిళా రిజర్వేషన్ (Reservation) బిల్లు అమలులో బీసీలకు న్యాయమైన చోటు దక్కాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరో పక్క నితీష్ కుమార్ బీహార్ లో కులాధార జనగణన చేసి దాని ఆధారంగా కులాల వారీగా ఆర్థిక సర్వే చేయించి, దేశంలో మరో చారిత్రక మహా విప్లవానికి తెర తీశారు. అంతేకాదు, సుప్రీంకోర్టు ఆదేశాల మాట అటుంచి, బీహార్ లో కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని ప్రకటించడమే కాకుండా బీహార్లో 65% రిజర్వేషన్ల బిల్లును (Reservation Bills) ప్రవేశపెట్టి సర్వామోదంతో దాన్ని పాస్ చేశారు. దీనితో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క్యాస్ట్ సర్వే, ఆర్థిక సర్వే చేయిస్తామని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్షాలూ ముక్తకంఠంతో ప్రకటిస్తున్నాయి.

Also Read:  IT Raids : మంత్రి సబిత బంధువుల ఇళ్లు.. ఓ ఫార్మా కంపెనీపై ఐటీ రైడ్స్

అలాగే ఆ సర్వేల ఆధారంగా విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో సమస్త రంగాల్లో రిజర్వేషన్ల (Reservation) నిష్పత్తిని సరిదిద్దుతామని పార్టీలు వాగ్దానం కూడా చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇలా రిజర్వేషన్ల బాట పట్టిన తర్వాత ఈ రేసులో తాము ఎక్కడ వెనకబడిపోతామో అని బిజెపి ఇప్పుడు సామాజిక న్యాయం అంటూ, బీసీలు, ఎస్సీలు అంటూ బహిరంగ సభలు పెడుతూ మహాసరంభం చేస్తోంది. మొన్న బీసీ ఆత్మగౌరవ సభ, నిన్న మాదిగ రిజర్వేషన్ల ఎస్సీ వర్గీకరణ సభ బిజెపి ప్రదర్శిస్తున్న హడావిడికి ఒక నమూనా. ప్రధాని తన వాక్చాతుర్యంతో మందకృష్ణ మాదిగ నా తమ్ముడు అని, నేను మాదిగల పక్షాన పోరాటంలో ముందుంటానని ఆయన చేసిన ప్రకటన, ఎన్నికల తర్వాత ఎంతవరకు నిలబెట్టుకుంటారో తెలియదు కానీ ప్రధాని నోట ఆ మాట రావడానికి ఎంతో చారిత్రక రిజర్వేషన్ విప్లవ పరిణామం ఉంది.

రిజర్వేషన్ (Reservation) ఒక చారిత్రక దశ:

చూశారా పార్టీ ఏదైనా దాని నాయకత్వం ఎవరిదైనా ఎట్టకేలకు అందరూ రిజర్వేషన్ల దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎస్సీలు, బీసీలు ఒకే పార్టీ గొడుగు కింద లేకపోయినా, వారందరూ అన్నిచోట్లా తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను దక్కించుకునే ఒక అనివార్య పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది. ఈ దేశంలో ఇక ముందు జరిగే సమస్త రాజకీయాలూ ఈ రిజర్వేషన్ పునాది మీదే కొనసాగుతాయి. వర్గ పోరాటాలు ప్రస్తుతం ఈ రూపంలో జరుగుతున్నట్టుగా భావించాలి. దేశంలో శతాబ్దాల తరబడి ఆధిపత్య కులాల అణచివేతకు గురైన ప్రతి ఒక్క జాతి కులం వర్గం చైతన్యవంతమై ఎవరి హక్కు వారు పొందే ఒక చారిత్రక దశలోకి ఇప్పుడు మనం ప్రవేశించాం. ఈ దేశంలో అన్ని లెక్కలూ రిజర్వేషన్ వెలుగులో తేలాల్సిందే. ఆ లెక్కలు పూర్తిగా తేలిన తర్వాత అప్పటితోనే ఈ దేశంలో విప్లవం పరిపూర్తి కాదు.

ఆ తరువాతే కమ్యూనిజం అవసరం పడుతుంది. అప్పుడే అసలైన వర్గ పోరాటం మొదలవుతుంది. దీనికి తారీకులు తిథులు నక్షత్రాలు ఉండవు. వర్గ పోరాటం సంపూర్ణ రూపంలో మొదలు కావడానికి ఇప్పుడు జరుగుతున్న కుల పోరాట, రిజర్వేషన్ పోరాట దశ మొత్తాన్ని ఆ వర్గ పోరాట వర్తమాన రూపంగా భావించాలి.అసలు ఏ విప్లవమూ ఎప్పటికీ పూర్తికాదు. మానవజాతి ప్రగతికి ఒక ఎండ్ కార్డు లేదు. విప్లవం ఒక నిరంతర ప్రవాహం. అందుకే నేను పాతిక సంవత్సరాలు క్రితం చెప్పిన మాట మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఈ దేశంలో రిజర్వేషన్ ని మించిన రివల్యూషన్ లేదు.

Also Read:  Modi Election Strategy : మాదిగలకు మోడీ హామీ ఎన్నికల వ్యూహమేనా?