Delhi : కొత్త పార్లమెంట్ కు ఏ పేరు పెట్టారు..పాత పార్లమెంట్ ను ఏంచేయబోతున్నారు..?

అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందించనుంది. పాత పార్లమెంట్ భవనానికి సోమవారం సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 11:59 AM IST

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌కి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా” (Parliament House Of India)గా నామకరణం చేసారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందించనుంది. పాత పార్లమెంట్ భవనానికి సోమవారం సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం 96 ఏళ్ల నాటి పాత పార్లమెంట్ భవనానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్ సభ, 2:15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి.

ఇక కొత్త పార్లమెంట్ భవనం (Parliament New Building)లో చాల ప్రత్యేకలు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీల మైక్‌లన్నీ ‘ఆటోమేటెడ్‌ వ్యవస్థ’ సాయంతో పని చేస్తాయని సమాచారం. అంటే ఎవరైనా ఎంపీ మాట్లాడేందుకు స్పీకర్‌ సమయం కేటాయిస్తే.. ఆ నిర్దేశిత సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. కొత్త పార్లమెంటులో బయోమెట్రిక్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఆటోమెటెడ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. తమ ప్రసంగాలు పూర్తి కాకముందే.. ప్రభుత్వాలు మైక్రోఫోన్‌లను ఆపేసి, తమ గొంతును నొక్కేస్తుందని ప్రతిపక్ష ఎంపీల నుంచి ఆరోపణలు వచ్చాయి. అందుకే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.

అలాగే సమావేశాలు జరిగే సమయంలో కొందరు సభ్యులు తమ ఆవేశం కోల్పోయినప్పుడు వెల్‌లోకి దూసుకొచ్చి, నిరసనలు తెలుపుతుంటారు. అయితే.. కొత్త భవనంలో అందుకు వీలు లేకుండా బాగా కుదించేశారు. బయోమెట్రిక్ వ్యవస్థని సైతం ఏర్పాటు చేశారు. ఈ కొత్త భవనంలో ఇకపై పేపర్‌లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంటే.. ఇకపై పేపర్ల అవసరం లేకుండా ప్రతీ ఎంపీకి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ కంప్యూటర్‌ని ఇస్తారు. ఇక జర్నలిస్టుల కోసం కఠినమైన ప్రవేశ నిబంధనలూ ఉంటాయి. ఈ పార్లమెంట్‌లో మరో ఆకర్షణీయ విషయం ఏమిటంటే.. ఆరు ద్వారాలు. వీటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అనే పేర్లు కేటాయించారు.

Read Also : Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడం ఫై జనసేనధినేత హర్షం

ఈ పాత పార్లమెంట్ భవనానికి (Old Parliament Building) ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో భగత్ సింగ్ రిగిల్చిన పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం పాత పార్లమెంట్ భవనం. ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో తీపి అనుభూతులు.. చేదు ఘటనలు.. బాంబు దాడులు.. నిరసనలు.. గొడవలు.. కొట్లాటలు..ఇలా ఎన్నో పాత పార్లమెంట్‌లో జరిగాయి. ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ “హెర్బర్ట్ బేకర్” 1912-13 లో డిజైన్ చేశాడు. 1921 నుండి ఆరేళ్ళ పాటు దీని నిర్మాణం కొనసాగింది. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు.

96 ఏళ్ల ఘన చరిత్ర పాత పార్లమెంట్ సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్‌ గా నిలిచింది. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ భవనం భవిష్యత్తు ఏంటి..? కొత్త బిల్డింగ్ లోకి పార్లమెంట్ మారిన నేపథ్యంలో పాత భవనాన్ని ఏంచేయనుంది..? కూల్చేస్తుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పాత బిల్డింగ్ కు అవసరమైన మరమ్మతులు పూర్తిచేసి ఇతర అవసరాలకు వాడతామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గతంలో రాజ్యసభలో వెల్లడించారు.