Digital Currency : ఫ్యూచర్ ఆఫ్ మనీ: సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ వస్తోందహో!!

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.డిజిటల్‌ కరెన్సీని హోల్‌సేల్, రిటైల్‌ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 08:00 AM IST

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.డిజిటల్‌ కరెన్సీని హోల్‌సేల్, రిటైల్‌ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు వెల్లడించింది. ఆర్థిక బిల్లు 2022 ఆమోదంతో ఆర్‌బీఐ చట్టం–1934లోని సంబంధిత సెక్షన్‌కు అవసరమైన సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ ఫిన్‌టెక్‌ ఈడీ అజయ్‌ కుమార్‌ చౌదరి ఫిక్కీ సదస్సులో బుధవారం తెలిపారు. బిల్లు ఆమోదం పొందడంతో పైలట్‌ ప్రాజెక్ట్‌ను నిర్వహించి డిజిటల్‌ కరెన్సీని జారీ చేసేందుకు ఆర్‌బీఐకి మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో డిజిటల్‌/వర్చువల్‌ కరెన్సీ అయిన సీబీడీసీని 2023 ప్రారంభంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సీబీడీసీని ప్రవేశపెడుతున్నట్లు 2022–23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏమిటీ డిజిటల్‌ కరెన్సీ ?

సీబీడీసీ అనేది..డిజిటల్‌/వర్చువల్‌ కరెన్సీ. ఇది ప్రైవేట్‌ వర్చువల్‌ కరెన్సీలు లేదా క్రిప్టోకరెన్సీలతో పోల్చదగినది కాదు. భౌతిక కరెన్సీకి ఎలక్ట్రానిక్ రూపం లాంటిది సీబీడీసీ.ఈ-వాలెట్లను పోలి ఉండే విధంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రతి భౌతిక కరెన్సీ నోటుకు ప్రత్యేక నెంబర్ ఉన్నట్టుగానే.. ప్రతి డిజిటల్ కరెన్సీకి యూనిట్ల రూపంలో నెంబర్లు కేటాయించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రైవేటు వాలెట్లకు.. డిజిటల్‌ కరెన్సీకి తేడా ?

ఇప్పుడు ప్రైవేటు కంపెనీల వాలెట్లు సైతం ఒక రకమైన డిజిటల్ కరెన్సీ లాంటివే. అయితే మన బ్యాంకు ఖాతాలోని నగదును ప్రైవేటు వాలెట్లలోకి మళ్లించి.. చెల్లింపులు చేస్తాం. విశ్వసనీయతలో ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి, ప్రైవేటు సంస్థల సేవలకు తేడా ఉంది. ప్రైవేటు కంపెనీ ‘ఈ-వాలెట్​’కు నగదు ట్రాన్స్​ఫర్ చేస్తే.. ఆ సంస్థ విధించే ఛార్జీలను మనం భరించాలి. ప్రైవేటు కంపెనీలు అందించే వాలెట్ సర్వీసులో.. ముందుగా మనం చేసే పేమెంట్‌లు సంస్థకు వెళ్తాయి. ఆ లావాదేవీని మన తరఫున సంస్థ పూర్తి చేస్తుంది. మన తరఫున డబ్బును నిల్వ చేసి.. చెల్లింపులు చేస్తాయి. డిజిటల్ కరెన్సీ వల్ల నగదు నిర్వహణ భారం తగ్గుతుంది. డిజిటల్ కరెన్సీకి అయ్యే ఖర్చు.. భౌతిక కరెన్సీని ముద్రించడానికి అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువ. ఈ కరెన్సీ వల్ల దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సైతం ఊతం లభిస్తుందని కేంద్రం ఆశిస్తోంది. డిజిటల్ కరెన్సీ లావాదేవీలపై సేవా రుసుము భారం కూడా పెద్దగా ఉండబోదని అంటున్నారు. ఇదే నిజమైతే భవిష్యత్ లో ప్రజలంతా డిజిటల్ కరెన్సీ వైపే మళ్ళిపోయే అవకాశం ఉంటుంది. త్వరలో రానున్న 5జీ ఇంటర్నెట్ విప్లవం కూడా డిజిటల్ కరెన్సీ సేవలకు దన్నుగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

డిజిటల్ కరెన్సీ వర్సెస్ క్రిప్టో కరెన్సీ ?

ఈ రెండింటిది డిజిటల్ రూపమే. కానీ ఇవి వేరువేరు. క్రిప్టో కరెన్సీలు, ప్రైవేటు వర్చువల్ కరెన్సీలతో మన డిజిటల్ కరెన్సీకి పోలిక ఉండదు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ కానీ, క్రిప్టో కరెన్సీని గానీ జారీ చేసేవారు ఉండరు. కాబట్టి ఓ వ్యక్తికి చెందిన రుణంగా లేదా పూచీకత్తుగా వాటిని పరిగణించలేం. అందుకే ఆర్‌బీఐ ప్రైవేటు క్రిప్టో కరెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటి వల్ల జాతీయ భద్రతో పాటు, ఆర్థిక అస్థిరతకు ముప్పు ఉంటుందని చెబుతోంది. రిజర్వ్ బ్యాంకు జారీ చేసే డిజిటల్ కరెన్సీ కి నిర్దిష్ట విలువ, పూచీకత్తు, గుర్తింపు మూడూ ఉంటాయి.

ఇతర దేశాలూ అటు వైపే..

నైజీరియా తన డిజిటల్ కరెన్సీని నైరాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వెనిజులా కూడా తన CBDC డిజిటల్‌ బొలివర్‌ ప్రారంభించాలని యోచిస్తోంది. దక్షిణ కొరియా డిజిటల్ యువాన్‌ను పప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB), యూఎస్‌, రష్యా, చైనా మరియు టర్కీలు కూడా CBDCల కోసం తమ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.