Site icon HashtagU Telugu

Nigar Shaji: ఆదిత్య L1 విజయం వెనుక మహిళా సైంటిస్ట్

Nigar Shaji

Compressjpeg.online 1280x720 Image 11zon

By: డా. ప్రసాదమూర్తి

Nigar Shaji: మొన్న చంద్రయానం, ఇప్పుడు సూర్యయానం. ఇది భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సాధించిన విజయ ప్రయాణం. దీని వెనుక యావత్ ప్రపంచంలోనే సాగిన శాస్త్ర వైజ్ఞానిక పరిశోధనల బలం ఉంది. భారత సైంటిస్టులు తరాల వైజ్ఞానిక ప్రగతిని మరింత ముందుకు సాగించే దిశగా ఇప్పుడు ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో ధీటుగా ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ వైజ్ఞానిక అద్భుతాల వెనక సాధించిన ప్రగతి వెనక స్త్రీ శక్తి ఎంతో ఉందన్నదే ఆ విశేషం.

చంద్రయాన్ 3 విజయం వెనక ఎందరో మహిళా సైంటిస్టుల కృషి ఉన్న విషయం తెలిసిందే. అయితే శనివారం నాడు సూర్యుని దగ్గరకు శ్రీహరికోటలో సతీష్ ధావన్ పరిశోధన కేంద్రం నుంచి బయలుదేరిన ఆదిత్య L1 (Aditya-L1) ప్రయోగం వెనక ఎందరో సైంటిస్టుల సాంకేతిక నిపుణుల కృషి ఉన్నప్పటికీ, ఒకే ఒక్క మహిళ మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఆమె నిగర్ షాజీ (Nigar Shaji). ఆదిత్య యల్ వన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఈమె ప్రారంభం నుంచి, విజయవంతంగా ప్రయోగం జరిగేంతవరకు అతి ముఖ్య భూమిక పోషించారు. ఎవరు ఈమె? ఇంత పెద్ద వైజ్ఞానిక మహా విప్లవానికి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన ఈ మహిళ ఎవరు? తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. ఆదిత్య యల్ వన్ సూర్యశక్తిని పరిశోధించడానికి భారతదేశం చేసిన మొదటి సఫల ప్రయత్నం. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ గా నిగర్ షాజీ అనే మహిళా సైంటిస్టు సాగించిన కృషి అద్భుతం.

Also Read: Jump From Space : ఆకాశం నుంచి దూకేసిన మొదటి యోధుడు ఇతడే !

ఈమె తమిళనాడులోని ఒక మారుమూల గ్రామంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచి చురుకైన విద్యార్థినిగా ప్రతిభను ప్రదర్శించి, ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని, యువ సైంటిస్ట్ గా బెంగళూరు అంతరిక్ష పరిశోధన కేంద్రంలో పనిచేసి అనేక బాధ్యతలు నిర్వహించారు. తరువాత శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోలో ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టి, అంచలంచలుగా ఎదిగారు. చివరికి భారతదేశం ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్న ఆదిత్య యల్ వన్ ప్రాజెక్టుకే డైరెక్టర్ గా ఆమె ఆశేతు హిమాచలం ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆదిత్య ఎల్ వన్ విజయవంతంగా ప్రయోగించిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ విజయం తన టీం మొత్తం సాధించిన ఉమ్మడి కృషి ఫలితం అని ఎంతో నిగర్వంగా చెప్పారు. ఈ ప్రాజెక్టులో తనకు సహకరించిన ఇస్రో సారధులకు, తోటి ఉద్యోగినీ ఉద్యోగులకు, సమస్త సాంకేతిక సిబ్బందికి ఆమె ధన్యవాదాలు చెప్పుకున్నారు. మీకు ఈ ప్రాజెక్టు సందర్భంగా ఎలాంటి అవరోధాలు కలగలేదా అని మీడియా అడిగినప్పుడు, అడ్డంకులు ఎన్నో వచ్చాయి అని, కానీ అవి ఏవీ అధిగమించలేని అవరోధాలు కాదని ఆమె చెప్పిన విధానం భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉత్తేజపరితంగా ఉన్నాయి.

ఒక సాధారణ ముస్లిం కుటుంబం నుంచి వచ్చి భారత అంతరిక్ష పరిశోధనల్లో అతికేలక పాత్ర పోషించే స్థాయి దాకా ఎదిగిన నిగర్ షాజీ జీవితం, ఆమె సాధించిన ఈ విజయం దేశానికే ఎన్నో పాఠాలు చెప్తుంది. మహిళలకు అవకాశం చిక్కితే అది ఎలాంటి రంగమైనా, అందులో పురుషులతోపాటు సమానంగా ప్రతిభాపాటవాలను వారు ప్రదర్శించగలరన్న సత్యం అందరూ ఒప్పుకొని తీరాల్సిందేనని నిగర్ కాజీ నిరంతర కృషి నిరూపించింది. చూశారా, శివ శక్తి కంటే బలమైంది స్త్రీ శక్తి అని అర్థం కావడం లేదా? ఆడపిల్లలకు అవకాశాలు ఇవ్వడంలో లింగ భేదంతో పాటు కుల మత భాషా ప్రాంత బేధాలు అడ్డు రాకూడదని ఈ మహిళా సైంటిస్టు దేశానికే సందేశాన్ని ఇస్తుంది. వినాలి. విని తీరాలి.