Fishing Cat : బావురు పిల్లులు అంత‌రించ‌క త‌ప్ప‌దా?

ల‌క్ష‌ల సంవ‌త్స‌రాలుగా త‌న‌కు ఆవాసాన్ని క‌ల్పించిన భూగోళాన్ని మ‌నిషే స్వ‌యంగా నాశ‌నం చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో అనేక వేల జంతు జాతులు న‌శించిపోయాయి.

  • Written By:
  • Publish Date - November 24, 2021 / 12:29 PM IST

ల‌క్ష‌ల సంవ‌త్స‌రాలుగా త‌న‌కు ఆవాసాన్ని క‌ల్పించిన భూగోళాన్ని మ‌నిషే స్వ‌యంగా నాశ‌నం చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో అనేక వేల జంతు జాతులు న‌శించిపోయాయి. ఎన్నో వంద‌ల జాతులు అంత‌రించిపోతున్నాయ‌ని హెచ్చ‌రికలు వినిపిస్తున్నాయి. ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో మేలు చేసే బావురు పిల్లులు కూడా అంత‌రించే జంతువుల జాబితాలో చేరిపోయాయి. ఇప్ప‌టి ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే కొన్ని సంవ‌త్సరాల్లో ఉన్న కొద్దిపాటి పిల్లులు కూడా అంత‌రించిపోతాయ‌ని ప్రమాదస్థితిలో ఉన్న జాతులు, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఆసియా ఖండంలోని 11 దేశాల్లో మాత్ర‌మే ఉన్న బావురు పిల్లుల్ని ఫిషింగ్ క్యాట్ అని కూడా అంటారు. మ‌న ఇళ్ళ‌లో పెరిగే మామూలు పిల్లుల కంటే పెద్ద‌విగా..చిరుత పులి కంటే చిన్న‌గా సుమారు 8 కిలోల‌కు అటూ ఇటూగా బ‌రువుండే బావురు పిల్లుల‌కు మ‌నుషులే శ‌త్రువులుగా మారారు. ఇవి స‌ముద్ర తీరంలోని మ‌డ అడ‌వుల్లో, న‌దులు, ప్ర‌వాహాల తీరాల్లో చేప‌ల్ని వేటాడుతూ బ్ర‌తుకుతాయి. మ‌డ అడ‌వులు న‌రికివేయ‌డం, న‌దీతీరాల్లో వ్య‌వ‌సాయం, చిత్త‌డి నేల‌ల్ని పాడుచేయ‌డం, ప‌ట్ట‌ణీక‌ర‌ణ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల బావురు పిల్లులు అంత‌రించిపోతున్నాయి. ప్ర‌పంచం మొత్తం మీద ఇవి 1500 నుంచి 2 వేల వ‌ర‌కు మాత్ర‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read : ప్రమాదం లో గజరాజులు!

మ‌న‌దేశంలో తూర్పు తీరంలో బెంగాల్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉన్న స‌ముద్ర తీరాన గ‌ల మ‌డ అడ‌వులు, చిత్త‌డి నేల‌ల్లో బావురు పిల్లులు క‌నిపిస్తాయి. ఏపీ వ‌ర‌కు చూస్తే జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల‌లు, మ‌డ అడ‌వులు, కాకినాడ ద‌గ్గ‌రున్న కోరింగ అభ‌యార‌ణ్యంలోనూ ఇవి క‌నిపిస్తాయి. స‌ముద్రంలోనూ, న‌దీ ప్ర‌వాహాల్లోనూ చేప‌ల్ని వేటాడే బావురు పిల్లుల వ‌ల్ల మత్స్య సంప‌ద పెరుగుతుందే గాని త‌ర‌గ‌దు. ఎందుకంటే చేప‌ల గుడ్ల‌ను తినే క్యాట్ ఫిష్ వంటివాటినే ఇవి ఎక్కువ‌గా వేటాడ‌తాయి. మ‌నుషులు తినే చేప‌ల‌కు హాని క‌లిగించేవాటినే తిన‌డం వ‌ల్ల మ‌త్స్య‌కారుల‌కు ఇవి మేలు చేస్తాయి. అయితే అనేక‌సార్లు వేట‌గాళ్ళు, మ‌త్స్య‌కారులు కూడా వీటిని వేటాడుతున్నారు. మాంసం కోసం కూడా వీటిని వేటాడుతున్నారు. అంత‌రించిపోయాయ‌ని అనుకున్న బావురుపిల్ల‌ల్ని 2015లో కోరింగ అభ‌యార‌ణ్యంలో క‌నుగొన్నారు. అప్ప‌టి నుంచి వీటిని కాపాడేందుకు ప్ర‌త్యేక ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. అడవుల్లో కెమెరాలు ఏర్పాటు చేసి వాటి సంఖ్య‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

బెంగాల్ లోని సుంద‌ర్బ‌న్స్ అడ‌వుల్లో వీటి సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. బెంగాల్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉన్న‌మ‌డ అడ‌వులు, అభ‌యార‌ణ్యాల్లో కొన్ని వంద‌లు మాత్ర‌మే ఉండ‌టం ప‌ర్యావ‌ర‌ణానికి ఏమాత్రం మంచిది కాద‌ని పిషింగ్ క్యాట్ ప్రాజెక్టు నిర్వాహ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. బావురు పిల్లుల్ని కాపాడ‌ట‌మంటే మ‌న‌కు మ‌నం మేలు చేసుకోవ‌డ‌మే అంటారు ఈ సంస్థ ప‌రిశోధ‌కులు. దేశంలో చిత్త‌డి నేలల్ని కాపాడాల‌నే చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ స్థానిక ప్ర‌భుత్వాలు వాటిని ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో చిత్త‌డి నేల‌ల‌న్నీ ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతున్నాయి. మ‌డ అడ‌వుల్ని కొట్టేయ‌డం వ‌ల్ల‌, తుఫాన్లను నిలువ‌రించగ‌ల ఆధారాన్ని మ‌నిషి కోల్పోతున్నాడు. ఎన్నో జీవులు అంత‌రించిపోతున్నాయి. న‌దీ తీరాల్లో విచ్చ‌ల‌విడిగా ఇసుక‌ను తవ్వేడ‌యం వ‌ల్ల నీటి ప్ర‌వాహాలు త‌గ్గుతున్నాయి. ఆక్వా క‌ల్చ‌ర్ వ‌ల్ల కూడా బావురు పిల్లుల‌కు ప్ర‌మాదం వ‌చ్చిప‌డింది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు మేలుకుని అంత‌రించిపోతున్న బావురు పిల్లుల్ని కాపాడి, ప్ర‌కృతిని త‌ద్వారా మాన‌వ స‌మాజాన్ని కాపాడుకోవాల‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు కోరుతున్నారు.