India G20 Summit 2023 : పేద దేశమైనా మనది పెద్ద మనసండోయ్..!

భద్రతా ఏర్పాట్ల వరకు సమస్తం ప్రపంచ దేశాలు విస్తుపోయే రీతిలో సన్నాహాలు చేసింది భారత్ (India). సరే వేడుక ముగిసింది.

  • Written By:
  • Updated On - September 12, 2023 / 05:53 PM IST

By: డా. ప్రసాదమూర్తి

India G20 Summit 2023 : అప్పుచేసైనా ఇంటికి వచ్చిన అతిథులకు పప్పుకూడు పెట్టి పంపించమని మన పెద్దలు చెప్పారు. మరి 20 దేశాల అగ్రనేతలు మన దేశానికి విచ్చేసినప్పుడు మనం సాదాసీదా సత్కారం చేసి పంపితే ఎలా కుదురుతుంది? అందుకే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన భారత్ (India) అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దేశాల అతిరథ మహారథులకు న భూతో న భవిష్యతి అన్న రీతిలో అత్యంత ఆర్భాటంగా అట్టహాసంగా స్వాగతం పలికింది. అతిథుల విడిది కేంద్రాల నుంచి విందు వరకు, వారి విహారాలకు వినియోగించిన వాహనాల నుంచి వారి రక్షణకు నియమించిన భద్రతా ఏర్పాట్ల వరకు సమస్తం ప్రపంచ దేశాలు విస్తుపోయే రీతిలో సన్నాహాలు చేసింది భారత్. సరే వేడుక ముగిసింది. వచ్చిన అతిథులు జరిగిన ఏర్పాట్లకు మహా సంతోషాన్ని వ్యక్తం చేసి భేష్ భేష్ అని మనల్ని మెచ్చుకొని ఏది ఏమైనా భారత్ (India) భారతే అని ప్రశంసల జల్లు కురిపించి వచ్చిన దారిన వెళ్లిపోయారు. అంతా అయిపోయింది సమావేశాలు జరుగుతున్న సమయంలోనే దేశమంతా భయంకర వర్షాలు ధారాపాతంగా అల్లకల్లోలం సృష్టించాయి. అంతా సద్దుమణిగాక ఇప్పుడు తీరుబడిగా మన వాళ్లు లెక్కలు చూసుకుంటున్నారు.

జీ20 శిఖరాగ్ర సమావేశం నిర్వహించడానికి 990 కోట్లు ఖర్చు అవుతుందని మొదట అంచనా వేశారు. అయితే సంబరం ముగిశాక ఖర్చుల చిట్టాపద్దులు తిరగేసి చూసుకుంటే అది 4వేల కోట్లకు పైగా ఖర్చు తేలింది. ఇక ఇప్పుడు దీనిమీద అనేక రకాల విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత ఖర్చు చేశాం మనకేంటి? అని అడిగితే ఆ సమాధానం చెప్పడానికి దేశాధినేతల దగ్గర ఇప్పటికిప్పుడు రెడీమేడ్ జవాబు ఉండదు. ఉన్నదల్లా ఒకటే. అమెరికా, బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాలతో మనం చేసుకున్న అనేక ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మనకు లక్షల కోట్ల లాభం జరగవచ్చని ఏలిన వారు చెప్పవచ్చు. కానీ ప్రశ్న భవిష్యత్తులో మనకు ఏం ఒరుగుతుందని కాదు, ఇప్పుడు ఈ ఖర్చు ఇంత అవసరమా అనేదే. లెక్కలు తీసి మరీ కొందరు అడుగుతున్నారు. ఈ సమావేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి సర్కార్, ఈ వేదికను ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా వాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. మరి ఇక్కడకు విచ్చేసిన పెద్ద పెద్ద దేశాల పెద్దలు మనల్ని మెచ్చుకుంటే ఆ మెచ్చుకోళ్ళు దేశానికి వినిపిస్తాయి కదా. తద్వారా వాళ్లే కాదు, మన వాళ్ళు కూడా మన నాయకుల్ని భేష్ అంటారు కదా. అంతరార్థం ఏమున్నా, వేల కోట్లు కుండపోతగా కురిసిన వర్షంలో కొట్టుకుపోయాయి.

జీ20 దేశాల సమావేశాల క్రమంలో మన దేశం 18వ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 19 దేశాలు, యూరోపియన్ దేశాలతో కలిపి 20 దేశాలు. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఆర్థిక పరిస్థితుల బాగోగుల గురించి చర్చించడం అనే కీలక అంశంతో పాటు, గ్లోబల్ వార్మింగ్, పరస్పర వాణిజ్య ఒప్పందాలు ఇతర అంశాలను కూడా చేర్చారు. ఇప్పుడు మన దేశంలో నిర్వహించిన ఈ సమావేశం మనం కావాలంటే వచ్చేది కాదు, వద్దంటే పోయేది కాదు. ఇప్పటికే 17 దేశాలు సమావేశాలని నిర్వహించాయి. తదుపరి దేశంగా మన దేశం వంతు వచ్చింది. ఈ సందర్భంగా మరి ఇతర దేశాలు కూడా ఇంత ఆర్భాటంగా అట్టహాసంగా వేలకోట్లు ఖర్చుపెట్టి ఈ పండగ చేశాయా అనేది ఆరా తీస్తే ఆ లెక్కలు ఆశ్చర్యంగా ఉన్నాయి. రష్యా ఫ్రాన్స్ జర్మనీ మొదలైన దేశాలు చాలా తక్కువ ఖర్చుతో ఈ సమావేశాలు నిర్వహించినట్లు అందుబాటులో ఉన్న వివరాల ద్వారా అర్థమవుతుంది.

ఇంతకుముందు 2022లో ఇండోనేషియా నిర్వహించిన జి20 సమావేశానికి కేవలం 364 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే అర్జెంటీనా 931 కోట్లు, జర్మనీ 642 కోట్లు, ఫ్రాన్స్ 72 కోట్లు, రష్యా 170 కోట్లు ఇలా అతి తక్కువ ఖర్చులోనే పెద్ద పెద్ద దేశాలు ఈ సమావేశాలను నిర్వహించి మమ అనిపించుకున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు మాత్రం 2000 కోట్లు పైబడి ఖర్చు పెట్టాయి. గత చరిత్ర అంతా తిరగేసి చూస్తే ఒక్క చైనా తప్ప మిగిలిన దేశాలన్నీ ఈ సమావేశాలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినా, ఖర్చు విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేశాయి. కేవలం చైనా రాజధాని బీజింగ్ లో కాకుండా వేరే భద్రతా కారణాలతో హాంగ్జూలో ఈ సమావేశాలను నిర్వహించడం వల్ల నాలుగు వేలకు పైగా కోట్లను ఖర్చు పెట్టిందట. మరి చైనా కంటే తగ్గేదేలే అనుకున్నారేమో మనవాళ్లు.

చూశారా, హిందీలో ఒక సామెత ఉంది. దుప్పటి ఎంత పొడవైనదో అంత మేరకే కాళ్లు చాపుకోవాలని ఆ సామెత అర్థం. అంటే నీ స్తోమతకు తగినట్టు నీ స్థాయికి తగినట్టు ఏ ఖర్చైనా పెట్టాలి. అంతేగాని ముందు ఖర్చుపెట్టి తర్వాత అప్పుల పాలు అయినందుకు ఎంత రోదించినా ఏం ఫలం? అతిథులు బంగారు పళ్ళాల్లో భోజనం పెట్టినా తింటారు. అరిటాకుల్లో భోజనం పెట్టినా తింటారు. బంగారు గ్లాసుల్లో వెండి గ్లాసుల్లో మంచినీళ్లు ఇచ్చినా తాగుతారు. గాజు గ్లాసుల్లో నీళ్లు ఇచ్చినా తాగుతారు. మనం వారిని గౌరవించుకునే పద్ధతిలో, మన ప్రేమ స్నేహం, వారి పట్ల మన మమకారం వ్యక్తం కావాలి. కానీ అవి మనం పెట్టే ఖర్చులో వ్యక్తం కావాలని చూడకూడదు. ఇప్పుడు ఇదే జరిగింది.

కేవలం ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి జి20 ఏర్పడింది. పశ్చిమ దేశాలూ అరబ్బదేశాల మధ్య ఘర్షణతో ఏర్పడిన ఆయిల్ సంక్షోభాన్ని తట్టుకోవడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, వెస్ట్ జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ముందు జి-6గా ఏర్పడి తర్వాత కెనడాతో కలిపి జి-7 గా కూటమి కట్టాయి. ఆ తరువాత 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చైనా ఇండియా బ్రెజిల్ రష్యా తదితర దేశాలతో 1999లో జి-7, జి-20 గా ఆవిర్భవించింది. ఈ కూటమి ప్రధాన లక్ష్యం ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను ఆదుకోవడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరినొకరు ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం అనేది. ఎంతవరకు ఈ లక్ష్యం నెరవేరింది అనేది ఏమోగానీ, రాను రాను ఈ సమావేశంలో ఇతర అంశాలను కూడా చర్చించడం ప్రారంభించారు. చర్చలు, డిక్లరేషన్లు, సంయుక్త సమావేశాలు, విందులు, వీడ్కోలు ఇలాగే గడుస్తూ వస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఇండియా ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చి వేల కోట్లు ఖర్చుపెట్టి వచ్చిన అతిథులకు వీడ్కోలు చెప్పింది.

అంతా సరేగాని ఇంత ఖర్చు అవసరమా అనేదే ప్రశ్న. ఈ కూటమిలో ఉన్న ఒక్కో దేశానికి ఎంతెంత లాభం సమకూరుతుందో, మన దేశానికి ఎంత ఉపయోగమో తెలియదు గానీ, చూశారా.. మేము గనుక ఇంత చరిత్రాత్మకంగా సమావేశాలు నిర్వహించామని చెప్పుకోవడానికి మోడీకి ఒక సందర్భం మిగిలింది. ఒక ఆసామి లక్షలు ఖర్చు చేసి కూతురు పెళ్లి చేశాడు. వచ్చిన చుట్టాలు, పెళ్లి వారు జరిగిన సత్కారానికి, ఆరగించిన విందుకు సంతోషించి బ్రేవ్ బ్రేవ్ అంటూ వెళ్ళిపోయారు. ఆసామి మాత్రం ఒంటరిగా పెళ్లిపందిరిలో కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. ఖర్చు కోసం చేసిన ఆపు ఎలా తీరుతుందా అని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు భారతదేశం (India) పరిస్థితి కూడా అలాగే ఉంది మరి.

Also Read:  Chandrababu Arrest : Jr ఎన్టీఆర్ ఫై టీడీపీ శ్రేణుల ఆగ్రహం…!