Farmers Protest : రైతుల పోరు.. ఢిల్లీలో హోరు.. ఫొటో ఫీచర్

Farmers Protest : రైతుల ఢిల్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 06:30 PM IST

Farmers Protest : రైతుల ఢిల్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు ఢిల్లీ అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు డ్రోన్లతో పలు రౌండ్ల టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి ఘగ్గర్ నది వంతెనపై నుంచి వెళ్లేందుకు రైతులు(Farmers Protest)  యత్నించగా పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

కొందరు రైతులు కూడా ట్రాక్టర్ల సాయంతో సిమెంటు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. బారికేడ్‌లకు దూరంగా ఉండాలని హర్యానా పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ, చాలా మంది నిరసనకారులు బారికేడ్‌ల మీదుగా వెళ్లారని అధికారులు తెలిపారు.

అయితే ఒక గంట తర్వాత శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్ల దగ్గర భారీ సంఖ్యలో రైతులు గుమిగూడడంతో, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మళ్లీ టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారని వారు తెలిపారు. కొంతమంది నిరసనకారులు సమీపంలోని పొలంలోకి ప్రవేశించడంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించారు.

టియర్ గ్యాస్ షెల్స్ వేయడానికి, నిరసనకారులపై నిఘా ఉంచడానికి డ్రోన్ కూడా ఉపయోగించారు. టియర్‌గ్యాస్ షెల్‌ల నుండి వెలువడే పొగ ప్రభావం నుండి తమను తాము రక్షించుకోవడానికి రైతులు తడి జనపనార సంచులను మోసుకెళ్లడం ఓ వీడియోలో కనిపించింది.

రైతన్నలు మరోసారి ఎందుకు ఆందోళనకు సిద్ధమయ్యారు? 

  • రైతుల డిమాండ్లలో ప్రధానమైనది.. పంటకు కనీస మద్దతు ధర (MSP). మార్కెట్‌ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా..  ఎమ్‌ఎస్‌పీ భరోసా కల్పిస్తూ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఇద్దరు కేంద్ర మంత్రులతో రైతు సంఘాలు జరిపిన చర్చల్లో దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు.
  • ఎమ్‌ఎస్‌పీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీకి సంబంధించి చట్టపరమైన హామీలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేస్తామని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనకు రైతు సంఘాల నాయకులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
  • 2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. నిన్న జరిగిన చర్చల్లో దీనికి కేంద్రం అంగీకరించింది. అలాగే, అప్పటి ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం అందించాలని కోరారు. దీనికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ, వీటిపై కేంద్రం రెండేళ్లక్రితమే హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • వివాదాస్పద విద్యుత్‌ చట్టం 2020ని రద్దు చేయడం. దీనివల్ల కేంద్రం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే.. తమకు అందే రాయితీని కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • వీటితోపాటు భూసేకరణ చట్టం 2013ని పునఃవ్యవస్థీకరించడం, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను కేంద్రం ముందుంచారు.