Chandrayaan-3 : చంద్రయాన్‌ -3 తో భారత్ చరిత్ర సృష్టించబోతోంది

చంద్రయాన్ -3 (Chandrayaan-3) కి ఎలాంటి భంగం లేకుండా ల్యాండర్ సెఫ్‌గా చంద్రునిపై దిగితే ఇది కేవలం భారతీయులకే కాదు..

  • Written By:
  • Updated On - August 22, 2023 / 05:56 PM IST

జాబిల్లిపై చంద్రయాన్‌ – 3 (Chandrayaan-3) దిగబోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్ర యాత్ర ఇది మూడవది. చంద్రయాన్-2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది.

ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. రేపు( ఆగస్టు 23 న) రోవరు చంద్రునిపై దిగబోతుంది.

ప్రస్తుతం చంద్రుడు (Moon), చంద్రయాన్‌-3 (Chandrayaan-3) మధ్య దూరం ఎంతోలేదని జస్ట్ 25 కి.మీ లే అని ఇస్రో ప్రకటించింది. ‘రెండవ మరియు చివరి డి-బూస్టింగ్‌ ఆపరేషన్‌ పూర్తయింది. నిర్దేశించిన ల్యాండింగ్‌ సైట్‌లో సూర్యోదయం కోసం వేచి ఉండాలి. పవర్డ్‌ అవరోహణ ఆగష్టు 23, 2023న సుమారు 17:45కి ప్రారంభమవుతుందని భావిస్తున్నాం ” అని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుని కక్ష్యలో ఆటోమేటెడ్‌ మోడ్‌లో దిగుతోంది. తన విధులను ఎలా నిర్వర్తించాలో స్వయంగా నిర్ణయించుకుంటుందని పేర్కొంది. ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుండి గురువారం విజయవంతంగా విడిపోయిన సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే సమయంలో ముందుగా చంద్రయాన్-2 ఆర్బిటర్కి సందేశం ఇవ్వనుంది.

చంద్రయాన్ ల్యాండర్ లో ఇస్రో పెట్టిన కెమెరా ఇప్పుడు 70 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడి ఫొటోలు తీసి పంపింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవం ఎలా ఉందో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇవాళ ఎప్పటికప్పుడు చంద్రయాన్-3 మిషన్ అప్ డేట్స్ ఇస్తున్న ఇస్రో.. ఈ ఫొటోల్ని కూడా విడుదల చేసింది. వీటిని చూస్తే వాస్తవంగా చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. మట్టిలో వర్షపు చుక్కలు పడితే ఎలా ఉంటుందో అలా ఉన్న చంద్రుడి ఉపరితలం ఇందులో కనిపిస్తోంది.

ఇక చంద్రయాన్-3 ల్యాండింగ్ (chandrayaan-3 Landing) అపూర్వ ఘట్టాన్ని దేశం అంత ప్రత్యక్ష ప్రసారం (Chandrayaan-3 Landing Live) ద్వారా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ ఇస్రో రిక్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో దేశం మొత్తం ఈ ఘట్టాన్ని చూసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ చంద్రయాన్ -3 కి ఎలాంటి భంగం లేకుండా ల్యాండర్ సెఫ్‌గా చంద్రునిపై దిగితే ఇది కేవలం భారతీయులకే కాదు..ప్రపంచానికి ఇదొక అద్భుతమైన రోజు అవుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటిసారిగా అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.

ఇప్పటికే చంద్రునిపై అమెరికా, చైనా, రష్యా దేశాలు విజయవంతంగా తమ ల్యాండర్‌ను దింపాయి. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సురక్షితంగా దిగిన నాలుగో దేశంగా రికార్టు నెలకొల్పుతుంది.

Read Also : Chandrayaan-3: చంద్రుడి సమీప కక్ష్యలో చంద్రయాన్-3.. ఇస్రో వీడియో