Darling : మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే : హైకోర్టు

Darling : ‘‘పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుంది’’ అని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది. 

  • Written By:
  • Updated On - March 3, 2024 / 01:34 PM IST

Darling : ‘‘పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుంది’’ అని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది.  ‘‘కావాలని.. పరిచయం లేని వారు.. అమ్మాయిలను డార్లింగ్ అని పిలిస్తే.. వారి ఫిర్యాదు మేరకు మాత్రమే 354 ఏ, 509 సెక్షన్ల కింద నిందితులుగా భావించొచ్చు’’ న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా కానిస్టేబుల్  పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గా పూజ జరిగే ప్రదేశం వద్ద ట్రాఫిక్ డ్యూటీ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి  గలాటా చేస్తుండగా నిలువరించేందుకు మహిళా కానిస్టేబుల్ వెళ్లారు. ఆ వ్యక్తిని  మహిళా కానిస్టేబుల్  అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలోనే నిందితుడు మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడాడు. ‘‘డార్లింగ్ నాకు ఫైన్ వేస్తావా’’ అంటూ పిచ్చికూతలు కూశాడు. దీంతో సదరు మహిళా కానిస్టేబుల్ కోర్టును ఆశ్రయించారు. డార్లింగ్ అని పిలిచినట్టు తన వద్ద అన్ని ఆధారాలున్నాయని ఆమె న్యాయస్థానానికి తెలిపారు.  అప్పటికే కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు తన తప్పుని ఒప్పుకోవడం వల్ల శిక్షను నెల రోజులకు న్యాయస్థానం తగ్గించింది.

We’re now on WhatsApp. Click to Join

పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్లు పిలిచే స్థాయికి భారత్ ఇంకా దిగజారలేదని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా ఈసందర్భంగా కామెంట్ చేశారు. ‘‘కానిస్టేబుల్ అనే కాదు. తెలియని మహిళను ఎవరు డార్లింగ్ (Darling) అని పిలిచినా అది కచ్చితంగా నేరమే. అలా పిలిచిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నా లేకపోయినా అది నేరమే అవుతుంది. ఇలాంటి వాళ్లకి శిక్ష పడాల్సిందే. ఇలాంటి పదాలతో సంబోధించడం అంటే లైంగికంగా వేధించడమే’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో జస్టిస్ సేన్‌గుప్తా తీవ్ర అసహనానికి లోనయ్యారు.

Also Read : TS Model Schools : మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. రూల్స్ తెలుసుకోండి

మహిళా న్యాయమూర్తిపైనే లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌‌లోని ఓ మహిళా న్యాయమూర్తికి పనిప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తనతో పనిచేస్తున్న కొందరు సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గతేడాది డిసెంబరులో బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సీజేఐ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సివిల్‌ జడ్జి రాసిన ఓ లేఖ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘‘సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన నేను.. ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు’’ అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ‘‘దీని గురించి ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. తమ బాస్‌కు వ్యతిరేకంగా వారు సాక్ష్యం చెప్పగలరని నేను ఎలా నమ్మగలను? అందుకే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశా. కానీ, సెకన్ల వ్యవధిలో నా అభ్యర్థనను కొట్టివేశారు. గత ఏడాదిన్నరగా నేనో జీవచ్ఛవంలా బతుకుతున్నా. నేను బతికుండి ప్రయోజనం లేదు. గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతినివ్వండి’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ లేఖ తన దృష్టికి రావడంతో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ చర్యలు చేపట్టారు. దీనిపై తక్షణమే తనకు నివేదిక కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ అతుల్ ఎం కుర్హేకర్‌ను ఆదేశించారు.