403 Deaths : విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మృతి.. 91 మరణాలు కెనడాలోనే

403 Deaths : గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఆరుగురు భారతీయ యువకులు దుర్మరణం పాలయ్యారు.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 08:18 AM IST

403 Deaths : గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఆరుగురు భారతీయ యువకులు దుర్మరణం పాలయ్యారు. 2018 సంవత్సరం నుంచి  ఇప్పటివరకు విదేశాల్లో చనిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య 403. వారిలో అత్యధికంగా 91 మంది కెనడాలోనే దుర్మరణం పాలయ్యారు. కెనడా తర్వాత ఎక్కువగా బ్రిటన్‌‌లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఆస్ట్రేలియాలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను సాక్షాత్తూ రాజ్యసభ వేదికగా భారత ప్రభుత్వం వెల్లడించింది. దీన్నిబట్టి ఆయా దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థులకు భద్రత కొరవడుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.  ఉద్యోగ భరోసా, శాశ్వత పౌరసత్వం ఆశలతో అమెరికా, కెనడా సహా పలు దేశాలకు వెళ్తున్న ఇండియన్స్‌కు ఈ పరిణామాలు భయం రేకెత్తించేలా ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఈ గణాంకాలు చూడండి.. 

  • ఈ ఏడాది 18లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తారని ఒక అంచనా. వీరిలో అత్యధికుల గమ్యస్థానాలు కెనడా, అమెరికాలే!
  • అయితే అమెరికా, కెనడాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారతీయ విద్యార్థులకు ప్రతికూలంగా మారుతున్నాయి. అక్కడ  బోధనా రుసుములతో పాటు ఇతర ఫీజులు భారీగా పెరుగుతున్నాయి.
  • 2022-23 సంవత్సరంలో 2,68,932 మంది భారతీయ విద్యార్థులు చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఈ సంఖ్య అంతకుముందు సంవత్సరంకన్నా 36శాతం ఎక్కువ.
  • అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉంటే, వారిలో 25శాతం మంది ఇండియన్సే.
  • 2022 చివరి నాటికి కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో 40శాతం ఇండియన్సే. వారిలోనూ 45శాతం మంది పంజాబీ విద్యార్థులే కావడం గమనార్హం.

Also Read : Selfie Cop : సెల్ఫీ వీడియో దుమారం.. ఇద్దరి మృతి, 25 మందికి గాయాలు

అంతా నెగెటివ్‌గా మారుతోంది..

2022 తో పోలిస్తే 2023 సంవత్సరంలో ఇండియా నుంచి కెనడాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని కెనడా దేశ వలస వ్యవహారాల మంత్రి మార్క్‌ మిలర్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్‌ హత్యతో భారత్ – కెనడా సంబంధాలు దెబ్బతినడమే ఈ పరిణామానికి ప్రధాన కారణమనే విషయం విస్పష్టం. మరోవైపు ద్రవ్యోల్బణం వల్ల కెనడాలో బోధనా రుసుములు, ప్రయాణ ఖర్చులు బాగా పెరిగాయి. ఇళ్ల అద్దెలు, నిత్యావసర సరకులు, వైద్యసేవలు ఖరీదైపోయాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నెమ్మదించింది. కెనడాలో దాదాపు 3,48,000 ఇళ్ల కొరత కూడా ఉంది. కెనడాలో చదవాలనుకొనే విద్యార్థులు జీవన వ్యయం కోసం చేయాల్సిన బ్యాంకు డిపాజిట్‌ను కెనడా సర్కారు రూ.6 లక్షల నుంచి రూ.12లక్షలకు పెంచింది. కెనడాలో శాశ్వత నివాస హోదా పొందినవారు సైతం ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 1982-2017 మధ్య కెనడాకు వలస వచ్చినవారిలో 17.5శాతం దేశాన్ని విడిచి వెళ్ళిపోయారని ప్రభుత్వ సంస్థ ‘స్టాటిస్టిక్స్‌ కెనడా’ వెల్లడించింది.